DSC 2024: డీఎస్సీపై స్టేకు నిరాకరణ.. పరీక్షల్లో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు
తుది ఉత్తర్వుల మేరకు ఫలితాలు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరినా కుదరదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూలై 28కి వాయిదా వేసింది. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం గత ఫిబ్రవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.జూలై 18న నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి.
వచ్చే నెల 5 వరకు సాగనున్నాయి. అయితే సన్నద్ధతకు సరిగ్గా సమయం ఇవ్వకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారని, స్టే ఇవ్వాలని కోరుతూ వికారాబాద్ జిల్లా నాగులపల్లికి చెందిన రాంపల్లి అశోక్‌తోపాటు మరో 9 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ జూలై 18న విచారణ చేపట్టారు.
చదవండి: DSC 2024: నేటి నుంచే డీఎస్సీ.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సంఖ్య, పరీక్షా కేంద్రాలు వివరాలు ఇలా..
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం సమయం ఇవ్వకుండా అత్యవసరమన్నట్లు డీఎస్సీ నిర్వహిస్తోందన్నారు. సన్నద్ధతకు సరైన సమయం ఇవ్వని కారణంగా చాలామంది టీచర్ పోస్టు పొందలేకపోయే ప్రమాదం ఉందని చెప్పారు.
2022 నుంచి పిటిషనర్లు గ్రూప్–1, గ్రూప్–2తోపాటు కేంద్ర ప్రభుత్వం నిర్వహి స్తున్న పలు పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారన్నారు. ఈ కారణంగా డీఎస్సీకి సిద్ధం కావడానికి తగిన సమయం లేకుండా పోయిందని చెప్పారు. డీఎస్సీ పరీక్షలపై స్టే విధించి సన్నద్ధకు సమయం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
నిరుద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టొదు: ఏఏజీ
ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని,జూలై 18న నుంచి ప్రారంభమయ్యాయని చెప్పారు.
దాదాపు 2.5 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలు రాయడానికి సిద్ధమయ్యారన్నారు. 10 మంది కోసం లక్షల మంది జీవితాలను ఫణంగా పెట్ట వద్దని కోరారు. 81.5% మంది పరీక్ష లకు హాజరవుతున్నారన్నారు.
చదవండి: DSC 2024: కొలువు కొట్టాల్సిందే...! ఉమ్మడి జిల్లాలో డీఎస్సీ ఉపాధ్యాయ ఖాళీలు ఇలా..
పిటిషనర్లు ఏయే పరీక్షలకు హాజరయ్యారు.. వారి హాల్‌టికెట్ల వివరాలు సమర్పించలేదని పేర్కొన్నారు. పరీక్షను వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ డీఎస్సీ పరీక్షలకు వర్తించదని వెల్లడించారు.
తుది తీర్పు మేరకు ఫలితాలు వెల్లడించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల న్యాయవాది విజ్ఞప్తి చేయగా.. ఏఏజీ అభ్యంతరం చెప్పారు. ఇప్పటికే పలు పరీక్షల రద్దుతో నిరుద్యోగులు విసిగిపోయారని, తుది తీర్పు మేరకే ఫలితాల వెల్లడి అంటే వారు మరింత నిరుత్సాహంలో కూరుకుపోతారన్నారు. ఏఏజీ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ.. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని చెప్పారు.