Thomas Cup 2022 Winner: చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు.. 73 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా..
టోర్నీ ఆసాంతం అద్భుత విజయాలు సాధిస్తూ వచ్చిన భారత బృందం.. మే 15వ తేదీన(ఆదివారం) జరిగిన ఫైనల్లో 14 సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేసియాను 3-0 తేడాతో మట్టికరిపించి థామస్ కప్ 2022 స్వర్ణాన్ని చేజిక్కించుకుంది.
ఈ జోడీని ఖంగుతినిపించి భారత్..
తొలి సింగిల్స్‌లో లక్ష్య సేన్.. ఆంథోని జింటింగ్‌ను 21-8, 21-17, 21-16 తేడాతో ఓడించగా.. తరువాతి మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్ రాంకి రెడ్డి-చిరాగ్ శెట్టి ద్వయం.. 18-21, 23-21, 21-19 తేడాతో మహ్మద్ ఎహసాన్, కెవిన్ సంజయ సుకముల్జియో జోడీని ఖంగుతినిపించి భారత ఆధిక్యాన్ని 2-0కు చేర్చింది.
ఇక కీలకమైన మూడో మ్యాచ్‌లో..
ఇక కీలకమైన మూడో మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ వీర లెవెల్లో రెచ్చిపోయి ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ జోనాటన్ క్రిస్టీని 21-15, 23-21 తేడాతో మట్టికరిపించి భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించాడు. భారత బృందం ఫైనల్ చేరే క్రమంలో (నాకౌట్ దశలో) మలేసియా, డెన్మార్క్ లాంటి పటిష్టమైన జట్లను ఖంగుతినిపించిన విషయం తెలిసిందే.
ఈ విజయం ఎంతో మందికి స్ఫూర్తి.. : ప్రధాని మోదీ
73 ఏళ్ల కలను సాకారం చేసిన భారత పురుషుల బ్యాడ్మింటన్ బృందాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించిన భారత షట్లర్లకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌కు స్వర్ణ పతకం ఖాయం కాగానే మోదీ ట్వీట్ చేశారు. "భారత బ్యాడ్మింటన్ బృందం చరిత్ర సృష్టించింది. ఈ విజయం పట్ల యావత్ భారతం గర్వంతో ఉప్పొంగిపోతుంది. స్వర్ణం గెలిచిన భారత బృందానికి శుభాకాంక్షలు.. వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి. ఈ విజయం ఎంతో మంది భవిష్యత్తు క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది" అంటూ మోదీ ట్వీట్ ద్వారా తన సందేశాన్ని తెలియజేశారు.
రూ. కోటి నగదు బహుమతి..
థామస్ కప్ గెలిచన భారత బ్యాడ్మింటన్ జట్టుకు ప్రభుత్వం రూ. కోటి నగదు బహుమతి ప్రకటించింది. ట్విటర్ వేదికగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.
ఇదో చారిత్రక ఘట్టం.. : ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత పురుషుల బ్యాడ్మింటన్ బృందానికి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భారత బ్యాడ్మింటన్‌లో ఇదో చారిత్రక ఘట్టం అని అభివర్ణించారు. బ్యాడ్మింటన్‌లో 73 ఏళ్ల భారత కలను సాకారం చేసినందుకు గాను కిదాంబి శ్రీకాంత్ అండ్ టీమ్‌ను అభినందించారు. ఫైనల్లో జరిగిన కీలక మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన శ్రీకాంత్‌ను సీఎం జగన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా తన సందేశాన్నిపంపారు.