FIDE Chess Rating: ఫిడే ర్యాంకింగ్స్‌లో ముందుకొచ్చిన భారతీయ చెస్ ఆటగాళ్లు వీరే..
చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకాలతో అదరగొట్టిన భారత గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) స్టాండర్డ్ ఫార్మాట్ ర్యాంకింగ్స్‌లోనూ ముందుకు దూసుకొచ్చారు. అక్టోబర్ 1వ తేదీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో తెలంగాణకు చెందిన అర్జున్ ఒక స్థానం మెరుగుపర్చుకొని కెరీర్ బెస్ట్ మూడో ర్యాంక్‌కు చేరుకోగా.. గుకేశ్ రెండు స్థానాలు పురోగతి సాధించి కెరీర్ బెస్ట్ ఐదో ర్యాంక్‌ను అందుకున్నాడు.
అర్జున్ ఖాతాలో 2797 ఎలో రేటింగ్ పాయింట్లు, గుకేశ్ ఖాతాలో 2794 ఎలో రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 2831 రేటింగ్ పాయింట్లతో నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్ వరల్డ్ నంబర్‌వన్ ర్యాంకర్‌గా కొనసాగుతుండగా.. హికారు నకముర (అమెరికా; 2802 పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. టాప్–100లో భారత్ నుంచి ఏకంగా తొమ్మిది మంది గ్రాండ్‌మాస్టర్లు ఉన్నారు.
ఐదుసార్లు ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ 11వ స్థానంలో, ప్రజ్ఞానంద 12వ స్థానంలో ఉన్నారు. విదిత్ సంతోష్ గుజరాతి 22వ ర్యాంక్‌లో, అరవింద్ చిదంబరం 33వ ర్యాంక్‌లో, పెంటేల హరికృష్ణ 42వ ర్యాంక్‌లో, నిహాల్ సరీన్ 58వ ర్యాంక్‌లో, రౌనక్ సాధ్వాని 66వ ర్యాంక్‌లో, శ్రీనాథ్ నారాయణన్ 95వ ర్యాంక్‌లో, అభిమన్యు పురాణిక్ 98వ ర్యాంక్‌లో నిలిచారు.
Chess Championship: చెస్ చాంపియన్‌షిప్ విజేతలు.. తెలంగాణ క్రీడాకారులు..
నంబర్‌వన్‌గా హంపి..
మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తన ఆరో ర్యాంక్‌ను నిలబెట్టుకొని భారత నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. చెస్ ఒలింపియాడ్‌కు హంపి దూరంగా ఉన్నా ఆమె ర్యాంక్‌లో మార్పు రాలేదు. భారత రెండో ర్యాంకర్‌గా మహారాష్ట్రకు చెందిన జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ అవతరించింది.
ఇన్నాళ్లు భారత రెండో ర్యాంకర్‌గా ద్రోణవల్లి హారిక కొనసాగింది. చెస్ ఒలింపియాడ్‌లో టీమ్ స్వర్ణ పతకంతోపాటు వ్యక్తిగత పసిడి పతకం నెగ్గిన దివ్య నాలుగు స్థానాలు పురోగతి సాధించి 11వ ర్యాంక్‌కు చేరుకుంది.
హారిక 14వ ర్యాంక్‌లో, వైశాలి 15వ ర్యాంక్‌లో, తానియా సచ్‌దేవ్ 54వ ర్యాంక్‌లో, వంతిక అగర్వాల్ 58వ ర్యాంక్‌లో ఉన్నారు. తెలంగాణ అమ్మాయి వేల్పుల సరయు 76వ ర్యాంక్‌లో, భక్తి కులకర్ణి 82వ ర్యాంక్‌లో, సవితాశ్రీ 99వ ర్యాంక్‌లో నిలిచారు.
Chess Olympiad 2024: చెస్ ఒలింపియాడ్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. తొలిసారి పసిడి పతకాలు సొంతం