Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత నొవాక్ జకోవిచ్.. నాదల్ రికార్డు సమం
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో తనకు తిరుగులేదని ఈ సెర్బియా యోధుడు మరోసారి చాటుకున్నాడు. జనవరి 29వ తేదీ జరిగిన ఆ్రస్టేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ జొకోవిచ్ 6–3, 7–6 (7/4), 7–6 (7/4)తో ప్రపంచ మూడో ర్యాంకర్, మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)పై గెలుపొందాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 29,75,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 17 కోట్ల 22 లక్షలు).. రన్నరప్ సిట్సిపాస్‌కు 16,25,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 9 కోట్ల 40 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. తాజా విజయంతో 35 ఏళ్ల జొకోవిచ్ జనవరి 30న విడుదల చేసే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకి మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోనున్నాడు. కెరీర్‌లో 22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా రాఫెల్ నాదల్ (22; స్పెయిన్) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. సిట్సిపాస్‌తో 2 గంటల 56 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో జొకోవిచ్‌కు ఏదశలోనూ ఆందోళన చెందేరీతిలో ప్రతిఘటన ఎదురుకాలేదు. కీలకదశలో ఈ సెర్బియా స్టార్ పైచేయి సాధించి సిట్సిపాస్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు.
Novak Djokovic: 16 ఏళ్ల తర్వాత.. అడిలైడ్ ఓపెన్ విజేత జొకోవిచ్
తొలి సెట్‌లోని నాలుగో గేమ్‌లో సిట్సిపాస్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 4–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరులో తొలి సెట్‌ను 36 నిమిషాల్లో దక్కించుకున్నాడు. రెండో సెట్‌లో ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. ఫలితంగా సర్వీస్ ఒక్కసారీ బ్రేక్ కాలేదు. స్కోరు 6–6తో సమం కావడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో జొకోవిచ్ పైచేయి సాధించి 70 నిమిషాల్లో రెండో సెట్‌ను గెల్చుకున్నాడు. మూడో సెట్ తొలి గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సిట్సిపాస్ ఆ వెంటనే తన సర్వీస్‌ను కూడా కోల్పోయాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో స్కోరు 6–6తో సమమైంది. మళ్లీ టైబ్రేక్ అనివార్యమైంది. ఈసారీ టైబ్రేక్‌లో జొకోవిచ్ ఆధిపత్యం కనబరిచి 70 నిమిషాల్లో మూడో సెట్‌నూ సొంతం చేసుకొని విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో ఓడిపోవడం సిట్సిపాస్‌కిది రెండోసారి. 2021 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోనూ జొకోవిచ్ చేతిలో ఓడిపోయాడు.
• జొకోవిచ్ నెగ్గిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్. ఇందులో ఆ్రస్టేలియన్ ఓపెన్ (10), వింబుల్డన్ (7), యూఎస్ ఓపెన్ (3), ఫ్రెంచ్ ఓపెన్ (2) ఉన్నాయి. ప్రస్తుతం అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో రాఫెల్ నాదల్ (22) సరసన జొకోవిచ్ నిలిచాడు.
• జొకోవిచ్ కెరీర్‌లో నెగ్గిన టైటిల్స్ 93. అత్యధిక టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో నాదల్‌ను (92) ఐదో స్థానానికి నెట్టి జొకోవిచ్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. టాప్–3లో జిమ్మీ కానర్స్ (అమెరికా; 109), ఫెడరర్ (స్విట్జర్లాండ్; 103), ఇవాన్ లెండిల్ (అమెరికా; 94) ఉన్నారు.
• ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్ 10 సార్లు (2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021, 2023) ఫైనల్ చేరుకోగా.. పదిసార్లూ గెలిచాడు.
ATP Finals: ఆరోసారి విజేతగా జొకోవిచ్.. ఫెడరర్ రికార్డు సమం