Women Cricketers' Pay: పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు
ప్రపంచ క్రికెట్లో సమ, నవ శకానికి న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్‌జెడ్‌సీ) నాంది పలికింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆధిపత్యం చలాయిస్తున్న పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు, కాంట్రాక్టులు ఇవ్వనున్నట్లు ఎన్‌జెడ్‌సీ ప్రకటించింది. దీనికి సంబంధించిన విధాన నిర్ణయాన్ని వెలువరించింది. వచ్చే ఐదేళ్ల కాంట్రాక్టులో నూతన సమాన వేతనాలను ఒక్క అంతర్జాతీయ క్రికెట్‌కే పరిమితం చేయకుండా ఎన్‌జెడ్‌సీ బోర్డు దేశవాళీ క్రికెట్లోనూ ప్రవేశపెట్టి.. కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఈ నిర్ణయంతో... కివీస్ స్టార్లు విలియమ్సన్ సహచరులకు ఎంత మొత్తం లభిస్తుందో... సోఫీ డివైన్ బృందం కూడా అంతే మొత్తం మ్యాచ్ ఫీజులు, వేతన భత్యాలు పొందుతుంది.
Also read: Quiz : ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న రాజధాని నగరం ఏది?
ఎన్‌జెడ్‌సీ ఫీజులను పరిశీలిస్తే ఒక్కో టెస్టుకు 10,500 న్యూజిలాండ్ డాలర్లు (రూ. 5 లక్షల 11 వేలు), ఒక్కో వన్డేకు 4,000 డాలర్లు (రూ. లక్షా 94 వేలు), ఒక్కో టి20 మ్యాచ్‌కు 2,500 డాలర్లు (రూ. లక్షా 21 వేలు) చెల్లిస్తారు. అయితే న్యూజిలాండ్ అమ్మాయిల జట్టు 2004 నుంచి ఇప్పటివరకు ఒక్క టెస్టు కూడా ఆడలేదు.