Skip to main content

Lionel Messi: రొనాల్డోను అధిగమించిన మెస్సీ

ఏడుసార్లు ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాల్‌ ఆటగాడిగా ‘బాలన్‌ డీర్‌’ అవార్డు.. ప్రతిష్టాత్మక క్లబ్‌ బార్సిలోనా తరఫున ఏకంగా 35 టైటిల్స్‌లో భాగం.. ఏ లీగ్‌లోకి వెళ్లినా అత్యధిక గోల్స్‌ సాధించిన ఆటగాడిగా ఘనత.

లెక్కలేనన్ని రికార్డులు, అపార ధనార్జన.. అపరిమిత సంఖ్యలో అతని నామం జపించే అభిమానులు.. మెస్సీ గురించి ఇది ఒక చిన్న ఉపోద్ఘాతం మాత్రమే. ఫుట్‌బాల్‌ మైదానంలో అతను చూపించిన మాయకు ప్రపంచం దాసోహమంది.. ఆల్‌టైమ్‌ గ్రేట్‌లలో ఒకడిగా గొప్పగా కీర్తించింది.. కానీ.. కానీ.. అదొక్కటి మాత్రం లోటుగా ఉండిపోయింది. మెస్సీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా వరల్డ్‌ కప్‌ మాత్రం గెలవలేదే అనే ఒక భావన.. 2006లో అడుగు పెట్టిన నాటి నుంచి 2018 వరకు నాలుగు టోర్నీలు ముగిసిపోయాయి. కానీ ట్రోఫీ కోరిక మాత్రం తీరలేదు. 2014లో అతి చేరువగా ఫైనల్‌కు వచ్చినా, పేలవ ఆటతో పరాభవమే ఎదురైంది.

వరల్డ్‌ కప్‌ లేకపోయినంత మాత్రాన అతని గొప్పతనం తగ్గదు.. కానీ అది కూడా ఉంటే బాగుంటుందనే ఒక భావన సగటు ఫ్యాన్స్‌లో బలంగా నాటుకుపోయింది. అతని సమకాలీకుడు, సమఉజ్జీ క్రిస్టియానో రొనాల్డోతో ప్రతీసారి ఆటలో పోలిక.. కానీ ఇప్పుడు మెస్సీ వరల్డ్‌ కప్‌ విన్నర్‌ కూడా.. ఈ విజయంతో అతను రొనాల్డోను అధిగమించేశాడు.. అర్జెంటీనా ఫుట్‌బాల్‌ అంటే మారడోనానే పర్యాయపదం.. 1986లో అతను ఒంటి చేత్తో (కాలితో) తమ టీమ్‌ను విశ్వవిజేతగా నిలిపిన క్షణం ఆ దేశపు అభిమానులు మరచిపోలేదు. అంతటివాడు అనిపించుకోవాలంటే వరల్డ్‌ కప్‌ గెలవాల్సిందే అన్నట్లుగా ఆ దేశం మెస్సీకి ఒక అలిఖిత ఆదేశం ఇచ్చేసింది! ఎట్టకేలకు అతను ఆ సవాల్‌ను స్వీకరించాడు.. తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో పరాజయం ఎదురైన తర్వాత తమను లెక్కలోంచే తీసేసిన జట్లకు సరైన రీతిలో సమాధానమిచ్చాడు.

FIFA World Cup 2022 History : ఫిఫా వరల్డ్‌కప్ వెనుక ఉన్న కథ ఇదే.. ఇప్ప‌టి వ‌ర‌కు విజేతలుగా నిలిచిన జ‌ట్లు ఇవే..

మైదానం అంతటా, అన్నింటా తానై అటు గోల్స్‌ చేస్తూ, అటు గోల్స్‌ చేసేందుకు సహకరిస్తూ టీమ్‌ను నడిపించాడు. ప్రపంచ కప్‌ చరిత్రలో గ్రూప్‌ దశలో, ప్రిక్వార్టర్స్, క్వార్టర్‌ ఫైనల్లో, సెమీస్‌లో, ఫైనల్లో గోల్‌ చేసిన ఏకైక ఆటగాడు కావడంతో పాటు జట్టును శిఖరాన నిలిపాడు. శాశ్వత కీర్తిని అందుకుంటూ అర్జెంటీనా ప్రజలకు అభివాదం చేశాడు. చివరగా.. మెస్సీ భావోద్వేగాలు చూస్తుంటే సచిన్‌ టెండూల్కర్‌ లాంటి దిగ్గజం కూడా తన కెరీర్‌లో అన్నీ సాధించిన తర్వాత లోటుగా ఉన్న క్రికెట్‌ ప్రపంచకప్‌ను ఆరో ప్రయత్నంలో అందుకోవడం, అతడిని సహచరులు భుజాలపై ఎత్తుకొని మైదానంలో తిరిగిన ఘటన మీ కళ్ల ముందు నిలిచిందా!  

Weekly Current Affairs (Important Dates) క్విజ్ (18-24 నవంబర్ 2022)

Published date : 19 Dec 2022 12:41PM

Photo Stories