Skip to main content

15 medals in a day: ఓకే రోజు పదిహేను పతకాలు

ఆసియా క్రీడల్లో ఆదివారం భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు.... ఏకంగా 15 పతకాలతో పండుగ చేసుకున్నారు. అథ్లెటిక్స్‌లో అత్యధికంగా తొమ్మిది పతకాలు రాగా... షూటింగ్‌లో మూడు పతకాలు... బ్యాడ్మింటన్, గోల్ఫ్, బాక్సింగ్‌లో ఒక్కో పతకం లభించాయి.
India wins 15 medals in a day
India wins 15 medals in a day

ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ జ్యోతి యర్రాజీ రేసు విషయంలో కాస్త వివాదం రేగినా... చివరకు రజతంతో కథ సుఖాంతమైంది. తెలంగాణకు చెందిన అగసార నందిని కూడా ఏషియాడ్‌ పతకాల జాబితాలో తన పేరును లిఖించుకుంది.  

Asian Games 2023: జ్యోతి యర్రాజీకి రజతం

సత్తా చాటిన సాబ్లే  

3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాశ్‌ సాబ్లే కొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల విభాగంలో గతంలో ఏ భారత అథ్లెట్‌కూ సాధ్యంకాని రీతిలో స్వర్ణ పతకంతో మెరిసాడు. 8 నిమిషాల 19.50 సెకన్లలో ఈవెంట్‌ను పూర్తి చేసిన సాబ్లే మొదటి స్థానంలో నిలిచాడు. 29 ఏళ్ల సాబ్లే ఈ క్రమంలో కొత్త ఆసియా క్రీడల రికార్డును నమోదు చేశాడు. 2018 జకార్తా క్రీడల్లో హొస్సీన్‌ కేహని (ఇరాన్‌: 8 నిమిషాల 22.79 సెకన్లు) పేరిట ఉన్న ఘనతను అతను సవరించాడు. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌ మహిళల విభాగంలో మాత్రం భారత్‌ నుంచి 2010 గ్వాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో సుధా సింగ్‌ స్వర్ణం గెలుచుకుంది.  

తజీందర్‌ తడాఖా 

పురుషుల షాట్‌పుట్‌లో తజీందర్‌పాల్‌ సింగ్‌ తూర్‌ సత్తా చాటడంతో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. 2018 జకార్తా క్రీడల్లో స్వర్ణం గెలుచుకున్న అతను ఈసారి తన మెడల్‌ను నిలబెట్టుకున్నాడు. ఇనుప గుండును 20.36 మీటర్ల దూరం విసిరిన తజీందర్‌ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. తొలి రెండు ప్రయత్నాల్లో అతను ఫౌల్‌ చేసినా మూడో ప్రయత్నంలో 19.51 మీటర్ల దూరం గుండు వెళ్లింది. తర్వాతి ప్రయత్నంలో దానిని 20.06 మీటర్లతో అతను మెరుగుపర్చుకున్నాడు.
ఐదో ప్రయత్నం కూడా ఫౌల్‌ అయినా... ఆఖరి ప్రయత్నంలో తన అత్యుత్తమ ప్రదర్శనతో పసిడిని ఖాయం చేసుకున్నాడు.  పర్దుమన్‌ సింగ్, జోగీందర్‌ సింగ్, బహదూర్‌ సింగ్‌ చౌహాన్‌ తర్వాత వరుసగా రెండు ఆసియా క్రీడల్లో షాట్‌పుట్‌ ఈవెంట్‌లో స్వర్ణం సా ధించిన నాలుగో భారత అథ్లెట్‌గా తజీందర్‌ నిలిచాడు.  

Asian Games 2023 badminton: పురుషుల బ్యాడ్మింటన్‌ జట్టుకు ర‌జితం

సిల్వర్‌ జంప్‌ 

పురుషుల లాంగ్‌జంప్‌లో భారత ఆటగాడు మురళీ శ్రీశంకర్‌ తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకున్నాడు. ఆగస్టులో బుడాపెస్ట్‌లో జరిగిన వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన మురళీ ఇక్కడ ఆసియా క్రీడల్లోనూ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 8.19 మీటర్లు దూకిన శ్రీశంకర్‌ రెండో స్థానంలో నిలిచాడు. జియాన్‌ వాంగ్‌ (చైనా–8.22 మీ.), యుహావో షి (చైనా–8.10 మీ.) స్వర్ణ, కాంస్యాలు సాధించారు.  

వహ్వా హర్‌మిలన్‌  

1998 జనవరి... పంజాబ్‌ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగి అయిన మాధురి సింగ్‌ మూడు నెలల గర్భిణి. అయితే క్రీడాకారుల కోటాలో ఉద్యోగం పొందిన ఆమె సంస్థ నిబంధనలు, ఆదేశాల ప్రకారం తన ప్రధాన ఈవెంట్‌ 800 మీటర్ల నుంచి 1500 మీటర్లకు మారి పరుగెత్తాల్సి వచ్చింది. 1500 మీటర్ల ట్రయల్‌లో పాల్గొని ఉద్యోగం కాపాడుకున్న మాధురికి ఆరు నెలల తర్వాత పాప పుట్టింది.
ఆ అమ్మాయే హర్‌మిలన్‌ బైన్స్‌. నాలుగేళ్ల తర్వాత 2002 ఆసియా క్రీడల్లో మాధురి 800 మీటర్ల పరుగులోనే పాల్గొని రజత పతకం సాధించింది. ఇప్పుడు 21 ఏళ్ల తర్వాత ఆమె కూతురు ఆసియా క్రీడల్లో రజత పతకంతో మెరిసింది... అదీ 1500 మీటర్ల ఈవెంట్‌లో కావడం యాదృచ్చికం! ఆదివారం జరిగిన 1500 మీటర్ల పరుగును హర్‌మిలన్‌ 4 నిమిషాల 12.74 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది.  
అజయ్‌కు రజతం, జాన్సన్‌కు కాంస్యం 
పురుషుల 1500 మీటర్ల పరుగులో కూడా భారత్‌ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజయ్‌ కుమార్‌ సరోజ్, కేరళ అథ్లెట్‌ జిన్సన్‌ జాన్సన్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచి రజత, కాంస్యాలు సొంతం చేసుకున్నారు. 3 నిమిషాల 38.94 సెకన్లలో అజయ్‌ రేసు పూర్తి చేయగా, 3 నిమిషాల 39.74 సెకన్లలో లక్ష్యం చేరాడు. ఈ ఈవెంట్‌లో ఖతర్‌కు చెందిన మొహమ్మద్‌ అల్‌గర్ని (3 నిమిషాల 38.38 సెకన్లు)కు స్వర్ణం దక్కింది. 

Asian Games 2023: భార‌త్‌కు హెప్టాథ్లాన్‌లో కంచు ప‌త‌కం

సీనియర్‌ సీమ జోరు 

మహిళల డిస్కస్‌ త్రోలో సీమా పూనియా వరుసగా మూడో ఆసియా క్రీడల్లోనూ పతకంతో మెరిసింది. 2014లో స్వర్ణం, 2018లో కాంస్యం గెలిచిన సీమ ఈసారి కూడా కాంస్య పతకాన్ని తన మెడలో వేసుకుంది. 40 ఏళ్ల సీమ డిస్కస్‌ను 58.62 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచింది. దాదాపు 20 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్‌లో కామన్వెల్త్‌ క్రీడల్లోనూ 3 రజతాలు, 1 కాంస్యం నెగ్గిన సీమ ఇవి తనకు ఆఖరి ఆసియా క్రీడలని ప్రకటించింది. ర్యాంకింగ్‌ ద్వారా పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తానని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొంది.   

ASian Games 2023 Shooting: ముగిసిన షూటింగ్ పోటీలు...ప‌త‌కాల‌లో భార‌త షూట‌ర్ల రికార్డు

Published date : 02 Oct 2023 03:20PM

Photo Stories