ASian Games 2023 Shooting: ముగిసిన షూటింగ్ పోటీలు...పతకాలలో భారత షూటర్ల రికార్డు
ఓవరాల్‌గా భారత షూటర్లు ఈ క్రీడల్లో ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, ఆరు కాంస్యాలతో కలిపి మొత్తం 22 పతకాలు గెలిచారు. ఆఖరి రోజు పురుషుల, మహిళల ట్రాప్ టీమ్, వ్యక్తిగత విభాగాల్లో పోటీలు జరిగాయి.
పురుషుల ట్రాప్ టీమ్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన కైనన్ చెనాయ్, జొరావర్ సింగ్ సంధూ, పృథ్వీరాజ్ తొండైమన్‌లతో కూడిన భారత జట్టు 361 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. ఈ క్రమంలో ఆసియా క్రీడల కొత్త రికార్డును నెలకొల్పింది. క్వాలిఫయింగ్‌లో కైనన్ 122 పాయింట్లు, జొరావర్ 120 పాయింట్లు స్కోరు చేసి టాప్–2లో నిలిచి వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్‌కు అర్హత పొందారు.
Asian Games 2023 Shooting: ఆసియా క్రీడల్లో తగ్గని భారత షూటర్ల జోరు
వ్యక్తిగత విభాగంలో ఆరుగురు షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో జొరావర్ 23 పాయింట్లతో ఐదో స్థానంలో నిలువగా... కైనన్ 32 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెల్చుకున్నాడు. మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో రాజేశ్వరి కుమారి, మనీశా కీర్, ప్రీతి రజక్‌లతో కూడిన భారత జట్టు 337 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం కైవసం చేసుకుంది.