Asian Games 2023 Shooting: ఆసియా క్రీడల్లో తగ్గని భారత షూటర్ల జోరు
ముందుగా పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, స్వప్నిల్ కుసాలె, అఖిల్ షెరాన్‌లతో కూడిన భారత జట్టు 1769 పాయింట్లు స్కోరు కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతేకాకుండా స్వర్ణ పతకాన్ని కూడా సొంతం చేసుకుంది. 2022లో 1761 పాయింట్లతో అమెరికా నెలకొల్పిన ప్రపంచ రికార్డును భారత జట్టు బద్దలు కొట్టింది.
Asian Games Shooting: ఆసియా క్రీడల్లో భారత షూటర్ల జోరు
క్వాలిఫయింగ్‌లో స్వప్నిల్ (10 పాయింట్ల షాట్‌లు 33), ఐశ్వరీ ప్రతాప్ సింగ్ (10 పాయింట్ల షాట్‌లు 27) 591 పాయింట్ల చొప్పున స్కోరు చేసి వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి వ్యక్తిగత విభాగం ఫైనల్‌కు అర్హత పొందారు. అఖిల్ షెరాన్ 587 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచాడు. అయితే ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరు షూటర్లు మాత్రమే ఫైనల్లో ఆడాలి. దాంతో అఖిల్ ఫైనల్‌కు దూరమయ్యాడు. టాప్–8లో నిలిచిన షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ 459.7 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెల్చుకున్నాడు. స్వప్నిల్ 438.9 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
Asian Games Rifle: రైఫిల్‌లో భారత్‌కు రజతం
పలక్ ‘పసిడి’..
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్, వ్యక్తిగత ఈవెంట్లలో భారత షూటర్లు అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్నారు. పలక్, ఇషా సింగ్, దివ్యలతో కూడిన భారత జట్టు 1731 పాయింట్లు స్కోరు చేసి రజత పతకం దక్కించుకుంది. క్వాలిఫయింగ్‌లో తెలంగాణ షూటర్ ఇషా సింగ్ 579 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో, పలక్ 577 పాయింట్లు సాధించి ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందారు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో పలక్ 242.1 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకం సొంతం చేసుకోగా... ఇషా సింగ్ 239.7 పాయింట్లతో రజత పతకాన్ని గెల్చుకుంది. పాకిస్తాన్ షూటర్ తలత్ కిష్మలా 218.2 పాయింట్లతో కాంస్య పతకం సాధించింది. ఈ ఆసియా క్రీడల్లో ఇషా సింగ్ ఓవరాల్‌గా నాలుగు పతకాలు సాధించడం విశేషం.