Skip to main content

IPL 2023: ఐదోసారి IPL చాంపియన్‌గా చెన్నై సూపర్‌కింగ్స్‌.. ధోని సేనదే ట్రోఫీ

ఐపీఎల్‌–2023లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చాంపియన్‌గా నిలిచింది.
Chennai Super Kings wins IPL title

మే 29న‌ జరిగిన ఫైనల్లో చెన్నై 5 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌ (47 బంతుల్లో 96; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీ కోల్పోగా.. వృద్ధిమాన్‌ సాహా (39 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్‌) శుబ్‌మన్‌ గిల్‌ (20 బంతుల్లో 39; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం చెన్నై 15 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసి గెలిచింది. కాన్వే (25 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్‌ దూబే (21 బంతుల్లో 32 నాటౌట్‌; 2 సిక్స్‌లు)  రాణించారు.  

సమష్టి బ్యాటింగ్‌ ప్రదర్శన.. 
42 బంతుల్లో 67, 42 బంతుల్లో 64, 33 బంతుల్లో 81... తొలి మూడు వికెట్లకు వరుసగా గుజరాత్‌ భాగస్వామ్యాలివి. జట్టులోని టాప్‌–4 తమ వంతుగా కీలకపాత్ర పోషించడంతో భారీ స్కోరు సాధ్యమైంది. సాహా, గిల్‌ ఇద్దరూ దూకుడుగా ఆడుతూ ఈ సీజన్‌లో మరోసారి జట్టుకు శుభారంభం అందించారు. తుషార్‌ వేసిన రెండో ఓవర్లోనే 3 పరుగుల వద్ద గిల్‌ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను దీపక్‌ చహర్‌ వదిలేసి గుజరాత్‌కు మేలు చేశాడు. చహర్‌ ఓవర్లో సాహా సిక్స్, 2 ఫోర్లు కొట్టగా... తుషార్, తీక్షణ ఓవర్లలో  గిల్‌ వరుసగా మూడేసి ఫోర్లు బాది జోరు ప్రదర్శించాడు.

IPL 2023: 16 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో అరుదైన రికార్డు...

21 పరుగుల వద్ద సాహా ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను కూడా చహర్‌ వదిలేయడం టైటాన్స్‌కు మరింత కలిసొచ్చింది. ఎట్టకేలకు ధోని మెరుపు స్టంపింగ్‌తో గిల్‌ వెనుదిరగ్గా, 36 బంతుల్లో సాహా అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ వెంటనే సాహా అవుట్‌ కాగా, సుదర్శన్‌ దూకుడు కొనసాగింది. తీక్షణ ఓవర్లో రెండు సిక్స్‌లు బాదిన అతను పతిరణ ఓవర్లో వరుసగా 2 ఫోర్లు కొట్టి 33 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీకి చేరుకున్నాడు. తుషార్‌ వేసిన తర్వాతి ఓవర్లో అతను మరింత చెలరేగిపోయాడు.

తొలి నాలుగు బంతుల్లో అతను 6, 4, 4, 4 కొట్టడం విశేషం. తుషార్‌ తర్వాతి ఓవర్లోనూ టైటాన్స్‌ 18 పరుగులు రాబట్టింది. పతిరణ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా 6, 6 కొట్టి 96కు చేరిన సుదర్శన్‌ తర్వాతి బంతికి దురదృష్టవశాత్తూ ఎల్బీగా దొరికిపోయి సెంచరీ చేజార్చుకున్నాడు. చివర్లో హార్దిక్‌ పాండ్యా (12 బంతుల్లో 21 నాటౌట్‌; 2 సిక్స్‌లు) ధాటి గుజరాత్‌ను మరింత పటిష్ట స్థితికి చేర్చింది.

BCCI: భారత క్రికెట్‌ జట్టు కిట్‌ స్పాన్సర్‌గా అడిడాస్‌
 
శుభారంభం.. 
వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం చెన్నై విజయలక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులుగా నిర్ణయించారు. ఛేదనను చెన్నై ఘనంగా ప్రారంభించింది. దూకుడుగా ఆడిన ఓపెనర్లు రుతురాజ్, కాన్వే 4 ఓవర్ల పవర్‌ప్లే ముగిసేసరికి 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో స్కోరును 52 పరుగులకు చేర్చారు.

అయితే పవర్‌ప్లే తర్వాత చెన్నైని నియంత్రించడంలో బౌలర్లు సఫలమయ్యారు. నాలుగు పరుగుల తేడాతో వీరిద్దరు వెనుదిరిగారు. అయితే రుతురాజ్‌ (16 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్‌), రహానే (13 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అంబటి రాయుడు (8 బంతుల్లో 19; 1 ఫోర్, 2 సిక్స్‌లు) తలా ఓ చేయి వేసి జట్టును గెలుపు దిశగా నడిపించారు. జడేజా ఆఖరి బంతికి ఫోర్‌ బాది చెన్నైని విజేతగా నిలిపాడు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (07-13 మే 2023)
 
15 ఓవర్లకు కుదింపు... 
రిజర్వ్‌ డే అయిన మే 29న‌ కూడా వాన మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. సరైన సమయానికే ఆరంభమై గుజరాత్‌ పూర్తి 20 ఓవర్లు ఆడింది. అయితే చెన్నై ఇన్నింగ్స్‌లో 3 బంతులకు 4 పరుగులు చేసిన తర్వాత మొదలైన వర్షం సుదీర్ఘ సమయం పాటు తెరిపినివ్వలేదు.

వర్షం తగ్గినా, ప్రధాన పిచ్‌ పక్కన ఉన్న మరో పిచ్‌ ఆరకపోవడంతో సమస్యగా మారింది. దానిని ఆరబెట్టేందుకు గ్రౌండ్స్‌మన్‌ అన్ని ప్రయత్నాలు చేశారు. చివరకు అర్ధరాత్రి 12.05 గంటలకు మ్యాచ్‌ మళ్లీ మొదలైంది. చెన్నై ఇన్నింగ్స్‌ను 15 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 171 పరుగులుగా నిర్దేశించారు. పవర్‌ప్లేను 4 ఓవర్లకు పరిమితం చేయగా, ఒక్కో బౌలర్‌ గరిష్టంగా 3 ఓవర్లు మాత్రం వేసేందుకు అనుమతించారు.  

IPL 2023 New Rules: ఐపీఎల్‌లో సంచ‌ల‌నం రేకెత్తించే కొత్త రూల్స్ ఇవే.. టాస్‌‌‌‌‌‌‌‌ గెలిస్తే ఒక టీమ్‌‌‌‌‌‌‌‌, ఓడితే మరో టీమ్‌‌‌‌ రంగంలోకి..
 

Published date : 30 May 2023 05:38PM

Photo Stories