Skip to main content

Emma Raducanu: క్వాలిఫయర్‌ హోదాలో గ్రాండ్‌స్లామ్‌ విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌?

యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌–2021లో బ్రిటన్‌ టీనేజర్‌ ఎమ్మా రాడుకాను విజేతగా అవతరించింది. న్యూయార్క్‌లోని ఆర్థర్‌ యాష్‌ స్టేడియంలో సెప్టెంబర్‌ 12న... ఇద్దరు అన్‌సీడెడ్‌ క్రీడాకారిణులు 18 ఏళ్ల ఎమ్మా రాడుకాను, 19 ఏళ్ల లేలా ఫెర్నాండెజ్‌ టైటిల్‌ కోసం తలపడ్డారు.
Emma Raducanu

 ఫైనల్లో ప్రపంచ 150వ ర్యాంకర్‌ ఎమ్మా రాడుకాను (బ్రిటన్‌) 6–4, 6–3తో ప్రపంచ 73వ ర్యాంకర్‌ లేలా ఫెర్నాండెజ్‌ (కెనడా)పై విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో టెన్నిస్‌ చరిత్రలో క్వాలిఫయర్‌ హోదాలో గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌గా అవతరించిన తొలి ప్లేయర్‌గా రాడుకాను చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా 44 ఏళ్ల తర్వాత బ్రిటన్‌ తరఫున గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. చాంపియన్‌గా నిలిచిన రాడుకానుకు 25 లక్షల డాలర్లు (రూ. 18 కోట్ల 37 లక్షలు)... రన్నరప్‌ లేలా ఫెర్నాండెజ్‌కు 12 లక్షల 50 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 18 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

ఎమ్మా రాడుకాను రికార్డులు...

  • ఓపెన్‌ శకంలో (1969 తర్వాత) ఆడిన రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలోనే విజేతగా నిలిచిన తొలి క్రీడాకారిణి ఎమ్మా రాడుకాను.
  • షరపోవా (2004లో వింబుల్డన్‌; 17 ఏళ్లు) తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన పిన్న వయస్కురాలిగా ఎమ్మా రాడుకాను (18 ఏళ్లు) గుర్తింపు పొందింది. 
  • ఓపెన్‌ శకంలో ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ చాంపియన్‌గా నిలిచిన 11వ క్రీడాకారిణి ఎమ్మా రాడుకాను. 
  • అన్‌సీడెడ్‌ హోదాలో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన 13వ ప్లేయర్‌ ఎమ్మా రాడుకాను.

చ‌దవండి: టోక్యో పారాలింపిక్స్‌లో రజతం సాధించిన జిల్లా కలెక్టర్‌?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌–2021 టైటిల్‌ విజేత
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 12
ఎవరు    : ఎమ్మా రాడుకాను(బ్రిటన్‌)
ఎక్కడ    : ఆర్థర్‌ యాష్‌ స్టేడియం, న్యూయార్క్, అమెరికా 
ఎందుకు    : ఫైనల్లో ఎమ్మా రాడుకాను (బ్రిటన్‌) 6–4, 6–3తో లేలా ఫెర్నాండెజ్‌ (కెనడా)పై విజయం సాధించినందున...
 

Published date : 13 Sep 2021 05:00PM

Photo Stories