Asia Cup 2023: సెమీస్‌లో భారత్‌ను ఓడించింది.. కట్‌చేస్తే ఏకంగా ఛాంపియన్స్‌గా..!
దుబాయి వేదికగా జరిగిన ఫైనల్లో యూఏఈను 195 పరుగుల తేడాతో చిత్తు చేసిన బంగ్లాదేశ్.. తొలిసారి అండర్-19 ఆసియాకప్ టైటిల్‌ను ముద్దాడింది. తుది పోరులో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది.
బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్ అషికర్ రెహ్మాన్ షిబ్లీ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 149 బంతులు ఎదుర్కొన్న అషికర్ రెహ్మాన్.. 12 ఫోర్లు, 1 సిక్సర్‌తో 129 పరుగులు చేశాడు. అతడితోపాటు రిజ్వాన్(60), అరిఫుల్ ఇస్లాం(50) పరుగులతో రాణించారు. యూఏఈ బౌలర్లలో ఆయామన్ ఆహ్మద్ 4 వికెట్లతో చెలరేగగా.. ఒమిడ్ రెహ్మద్ రెండు వికెట్లు సాధించాడు.
అనంతరం 283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ.. బంగ్లా బౌలర్ల దాటికి కేవలం 87 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బౌలర్లలో రోహనత్, మరూఫ్ మిర్దా తలా మూడు వికెట్లు పడగొట్టగా.. ఇక్భాల్, షేక్ ఫవీజ్ చెరో రెండు వికెట్లు సాధించారు. కాగా సెమీఫైనల్లో భారత్‌ను బంగ్లాదేశ్ ఓడించిన సంగతి తెలిసిందే.