Skip to main content

Science and Technology: మాతృభాషలో శాస్త్ర, సాంకేతిక పదాల అర్థాలు

ఆధునిక శాస్త్రీయ, సాంకేతిక పదాలకు ఇకపై మాతృభాషలో సులభంగా అర్థాలు తెలుసుకోవచ్చు. జాతీయ విద్యా విధానంలో భాగంగా కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలోని కమిషన్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ టెక్నికల్‌ టర్మినాలజీ (సీఎస్‌టీటీ) దాదాపు 30 లక్షల పదాలు, వారి అర్థాలను అందుబాటులోకి తీసుకొస్తోంది.

ఈ మేరకు ఒక వెబ్‌సైట్, యాప్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల శాస్త్ర, సాంకేతిక విద్యను మాతృభాషలు, ప్రాంతీయ భాషల్లో బోధించడం సులభతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, రచయితలు, అనువాదకులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. శాస్త్రీయ, సాంకేతిక పదాలు, వాటి అర్థ వివరణలను గూగుల్‌లో మాతృభాషలో తెలుసుకోవచ్చు. shabd.education.gov.nic అనే వెబ్‌సైట్‌లో ఈ వివరాలు త్వరలో కనిపించనున్నాయి.
వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నుంచే వెబ్‌సైట్, యాప్‌ ప్రారంభం కానుంది. మెడిసిన్, లింగి్వస్టిక్స్, పబ్లిక్‌ పాలసీ, ఫైనాన్స్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్‌ తదితర విభాగాల పదాలు, అర్థాలు ఇందులో ఉంటాయి. విద్యను సాధ్యమైనంత మేరకు మాతృ భాషలు, స్థానిక భాషల్లో బోధించాలని జాతీయ విద్యా విధానం నిర్దేశిస్తోంది. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకూ.. అన్ని స్థాయిల్లో భారతీయ భాషలను ప్రోత్సహించాలని పేర్కొంటోంది. ప్రస్తుతం 22 అధికారిక భాషల్లో పదాల అర్థాలను వివరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, భాషల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సీఎస్‌టీటీ చైర్‌పర్సన్‌ ప్రొఫెసర్‌ గిరినాథ్‌ ఝా చెప్పారు. పుస్తకాల ప్రచురణ కోసం సీఎస్‌టీటీని కేంద్రం 1961లో ఏర్పాటు చేసింది.


Also read: Black hole: సూర్యుని కంటే 10 రెట్లు పెద్దదైన ఈ కృష్ణబిలం
 

Published date : 21 Nov 2022 05:13PM

Photo Stories