LVM3 Rocket: వన్‌వెబ్ ఇండియా–2 ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం.. కక్ష్యలోకి 36 సమాచార ఉపగ్రహాలు

శ్రీహరికోటలోని సతీష్‌ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి అత్యంత బరువైన ఎల్‌వీఎం3–ఎం3 బాహుబలి రాకెట్ వాటిని తీసుకుని మార్చి 26వ తేదీ నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. బ్రిటన్‌కు చెందిన నెట్ వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్, ఇండియన్ భారతి ఎంటర్ ప్రైజెస్ సంయుక్తంగా రూపొందించిన 5,805 కిలోలు బరువున్న ఈ ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్లు ఎత్తులో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
ఈ 36 ఉపగ్రహాలను 97 నిమిషాల వ్యవధిలో ఒక్కోసారి నాలుగేసి ఉపగ్రహాల చొప్పున 9 విడుతలుగా భూమికి అతి తక్కువ దూరంలో లోయర్ ఎర్త్ లియో అర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. అవన్నీ కక్ష్యలోకి చేరాయని, అంటార్కిటికా గ్రౌండ్‌స్టేషన్ నుంచి సిగ్నల్స్ అందాయని ఇస్రో ప్రకటించింది. వన్‌వెబ్ ఇండియా–1 పేరిట 2022 అక్టోబర్ 23న తొలి బ్యాచ్‌లో 36 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. తాజా ప్రయోగంతో మొత్తం 72 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపారు.
chandrayaan-3: ‘చంద్రయాన్–3’ ప్రీలాంచ్ పరీక్ష విజయవంతం
ఇస్రో స్థాయి పెరిగింది..
రాకెట్‌లోని అన్ని దశలు అద్భుతంగా పనిచేసినట్టు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ చెప్పారు. ‘‘ఇది టీం వర్క్. ప్రపంచంలోనే అద్భుతమైన విజయంతో ఇస్రో కీర్తి ప్రతిష్టలను పెంచినందుకు సంతోషంగా ఉంది. ఈ ప్రయోగం చరిత్రాత్మకమైనది. దీనివల్ల ఇస్రో వాణిజ్యపరమైన ప్రయోగాల ప్రయోజనాలకు మరింత బలం చేకూరింది. ఇదే ఊపులో పీఎస్‌ఎల్‌వీ సీ55 రాకెట్ ద్వారా ఏప్రిల్‌లో సింగపూర్‌కు చెందిన ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నాం. ఈ ఏడాది చంద్రయాన్–3, ఆదిత్య–ఎల్1తో పాటు మరో నాలుగు ప్రయోగాలు చేసే అవకాశముంది’’ అని చెప్పారు. వాణిజ్య ప్రయోగాలకు ఎల్‌వీఎం3 రాకెట్ ఎంతో ఉపయోగకారి అని న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ సీఎండీ డి.రాధాకృష్ణన్, మిషన్ డైరెక్టర్ ఎస్.మోహన్‌కుమార్ చెప్పారు.