El Nino: భారత్‌కు శుభవార్త.. జూన్ నాటికి ‘ఎల్‌నినో’ మాయం!
గత ఏడాదిలా కాకుండా ఈ ఏడాది దేశంలో సమృద్ధిగా వర్షాలు పడతాయని వారు అంచనా వేస్తున్నారు. 2023లో దేశంలో అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావానికి కారణమైన ఎల్‌నినో పరిస్థితులు నైరుతి రుతుపవనాలు వచ్చే సమయానికి మారిపోతాయని అమెరికాతో పాటు భారత్‌కు చెందిన వాతావరణ సైంటిస్టులు వెల్లడిస్తున్నారు.
పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడంతో ఏర్పడిన ఎల్‌నినో(వర్షాభావ పరిస్థితి) జూన్ నాటికి బలహీనపడి లా నినా ఏర్పడుతుందని అమెరికాకు చెందిన క్లైమేట్ ప్రెడిక్షన్ సెంటర్, నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకటించాయి. ఎల్‌నినో తొలుత ఏప్రిల్-జూన్ మధ్య ఈఎన్‌ఎస్‌ఓ(తటస్థ స్థితి)కి రావడానికి 83 శాతం, ఆ తర్వాత ఇది జూన్-ఆగస్టు మధ్య లానినాగా మారడానికి 62 శాతం అవకాశం ఉందని వెల్లడించాయి.
Doomsday Glacier: డూమ్స్‌డే గ్లేసియర్.. ఒక భయంకరమైన ముప్పు
లా నినా పరిస్థితులు ఏర్పడితే గనుక ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో దేశంలో సాధారణవర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ సైంటిస్టులు చెబుతున్నారు. ఒక వేళ లానినా ఏర్పడకపోయినా తటస్థ(ఈఎస్‌ఎన్‌ఓ) పరిస్థితులు ఏర్పడినా భారత్‌లో ఈ ఏడాది వర్షాలకు ఢోకా ఉండదని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ మాజీ సెక్రటరీ మాధవన్ రాజీవన్ తెలిపారు. భారత్‌లో 70 శాతం వార్షిక వర్షపాతం నైరుతి రుతుపవనాల వల్లే నమోదవుతుంది. జీడీపీలో 14 శాతం వాటా కలిగిన వ్యవసాయరంగానికి ఈ రుతుపవనాలే కీలకంగా ఉండటం గమనార్హం.