Skip to main content

ఆక్సిజన్‌ ‘స్థాయి’లో మార్పును బట్టి గ్రహాలపై జీవం గుట్టు పట్టేయొచ్చు

లీడ్స్‌(యూకే): అనంతమైన విశ్వంలో మనమంతా ఒంటరి జీవులమా? లేక ఇతర గ్రహాలపైనా జీవం ఏదైనా ఉందా? మన సౌర కుటుంబానికి అవతల ఉన్న గ్రహాలపై వాతావరణం ఉనికి ఉండే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలు శతాబ్దాలుగా మానవులను వేధిస్తూనే ఉన్నాయి. వీటికి సమాధాలు కనిపెట్టేందుకు జిజ్ఞాసులు అలుపెరుగని కృషి సాగిస్తున్నారు.
Earth's Oxygen Levels Can Affect Its Climate
Earth's Oxygen Levels Can Affect Its Climate

ఇతర గ్రహాలపై జీవం జాడ తెలుసుకొనేందుకు ఎన్నో పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతున్నాయి. రహస్యాన్ని ఛేదించే విషయంలో మనం కొంత పురోగతి సాధించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటిదాకా మనకు తెలిసింతవరకూ కేవలం మన భూగోళంపైనే జీవులు ఉన్నాయి. ఇవన్నీ ఆక్సిజన్‌ను శ్వాసిస్తున్నాయి. జీవుల మనుగడకు ప్రాణవాయువు(ఆక్సిజన్‌) అవసరమన్న సంగతి తెలిసిందే. భూమిపై ఆక్సిజన్‌ ఎల్లవేళలా ఒకేలా లేదని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ లీడ్స్‌కు చెందిన బయోకెమికల్‌ మోడలింగ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ బెంజమిన్‌ జేడబ్ల్యూ మిల్స్‌ చెప్పారు. కోట్ల సంవత్సరాల నుంచి భూమిపై ఆక్సిజన్‌ పరిమాణం మారుతూ వచ్చిందని అన్నారు. ఈ మార్పు ఎప్పుడు, ఎలా జరిగిందో, ఆయా సమయాల్లో ఏయే జీవులు పుట్టాయో కచ్చితంగా తెలుసుకుంటే ఇతర గ్రహాలపై ఉన్న వాయువుల పరిమాణం గురించి, తద్వారా అక్కడి జీవజాలం గురించి ఒక అంచనాకు రావొచ్చని వివరించారు. మన గ్రహంపై ఉన్న ఆక్సిజన్‌ పరిమాణంపై తమ పరిశోధనలో కీలక విషయాలు బహిర్గతమయ్యాయని పేర్కొన్నారు.  

Also read: Continents of the World: 7 ఖండాలు కాదు.. ఏక ఖండమే..!

భూమిపై ఆక్సిజన్, జీవం  
భూగోళంపై వాతావరణంలో ప్రస్తుతం 21 శాతం ఆక్సిజన్‌ ఉంది. అయితే, ఇప్పుడున్నంత ఆక్సిజన్‌ కోట్ల సంవత్సరాల క్రితం లేదు. గతంలోకి.. అంటే 45 కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్తే.. అక్కడ జీవించడానికి ఆక్సిజన్‌ ట్యాంకర్లు కూడా వెంట తీసుకొని పోవాల్సిందే. ఎందకంటే అప్పట్లో స్వల్ప పరిమాణంలో ఆక్సిజన్‌ ఉండేది. జీవులు కూడా ఇంకా పుట్టలేదు. ప్రధానంగా మూడు దశల్లో ఆక్సిజన్‌ స్థాయిలు భూమిపై పెరిగాయి. మొదటిది ‘గ్రేట్‌ ఆక్సిడేషన్‌ ఈవెంట్‌’. దాదాపు 240 కోట్ల సంవత్సరాల క్రితం ఇది సంభవించింది. భూమిపై వాతావరణం ఏర్పడింది. ఆక్సిజన్‌ నిల్వలు ప్రారంభమయ్యాయి. రెండోది నియోప్రొటెరోజోయిక్‌ ఆక్సిజనేషన్‌ ఈవెంట్‌ (ఎన్‌ఓఈ). 80 కోట్ల సంవత్సరాల క్రితం సంభవించింది. భూమిపై ఆక్సిజన్‌ పరిమాణం పెరిగింది. దాదాపు ఇప్పుడున్న స్థాయికి ప్రాణవాయువు చేరుకుంది. ఆ తర్వాత 20 కోట్ల సంత్సరాలకు భూమిపై తొలితరం జంతువులు పుట్టాయి. మూడోది ‘పాలెజోయిక్‌ ఆక్సిజనేషన్‌ ఈవెంట్‌’.. 42 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడింది. ఆక్సిజన్‌ ఇప్పుడున్న స్థాయికి పూర్తిగా చేరింది. 75 కోట్ల ఏళ్ల క్రితం భూమి వాతావరణంలో కేవలం 12 శాతం ఆక్సిజన్‌ ఉండేది. ఇది ఇప్పుడు 21 శాతానికి ఎగబాకింది. ఆక్సిజన్‌ పరిమాణాన్ని బట్టి కొత్త జీవులు ఉద్భవించడం, పాతవి అంతరించిపోవడం వంటివి జరిగాయని పరిశోధకులు భావిస్తున్నారు. దాదాపు 45 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై మొక్కలు పుట్టాయి.  
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ(ఈఎస్‌ఏ), కెనడియన్‌ స్పేస్‌ ఏజెన్సీ(సీఎస్‌ఏ) భాగస్వామ్యంతో గత ఏడాది జేమ్స్‌వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌(జేడబ్ల్యూఎస్‌టీ)ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇది మన సౌర మండలం ఆవల ఉన్న గ్రహాలపై వాతావరణం, వాయువులపై అధ్యయనం చేస్తోంది. అక్కడి వాయువులు, వాటి పరిమాణం గురించి తెలిస్తే జీవం ఉందా? లేదా? అనేది తేల్చవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు.   

Also read: Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 14th కరెంట్‌ అఫైర్స్‌

Published date : 17 Oct 2022 06:34PM

Photo Stories