Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 14th కరెంట్ అఫైర్స్
IIIT UNA: పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించిన మోదీ
ఉనా/చంబా: ఉనా, చంబాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ అక్టోబర్ 13న ప్రారంభించారు. హరోలీలో బల్క్ డ్రగ్ ఫార్మా పార్క్ నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఉనాలో ‘ఐఐఐటీ–ఉనా’ను ప్రారంభించారు. చంబాలో రెండు హైడ్రోపవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఉనాలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపారు. దేశంలో ఇది నాలుగో వందేభారత్ రైలు కావడం విశేషం.
Also read: Telangana History Bitbank in Telugu: నేలకొండపల్లి శాసనాన్ని వేయించింది ఎవరు?
3,125 కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల రోడ్ల అభివృద్ధి కోసం ఉద్దేశించిన ‘ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన–3’ని చంబాలో మోదీ ప్రారంభించారు. డబుల్–ఇంజన్ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో 12,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మించిందని తెలిపారు. ప్రధాని ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఉనా నుంచి ఢిల్లీకి బుధవారం మినహా వారంలో ఆరు రోజులు ప్రయాణిస్తుంది.
United Nations: రష్యా ‘విలీన’ రెఫరండంను ఖండిస్తూ ఐరాస తీర్మానం
ఉక్రెయిన్‌లో మాస్కో మూకల దమనకాండను తీవ్రంగా నిరసిస్తూ ఐక్యరాజ్యసమితి ముసాయిదా తీర్మానం తెచ్చి ఆమోదించింది. ఉక్రెయిన్‌లోని డొనెట్సక్, ఖేర్సన్, లూహాన్సక్, జపోరిజియాలపై దురాక్రమణకు పాల్పడి వాటిని బూటకపు రెఫరెండం ద్వారా తమ ప్రధాన భూభాగంలో కలిపేందుకు రష్యా తీసుకున్న నిర్ణయాలను ఆ ముసాయిదా తీర్మానం తీవ్రంగా తప్పుబట్టింది. ‘ ఉక్రెయిన్ ప్రాంత సమగ్రత: ఐరాస చార్టర్ నిబంధనల పరిరక్షణ’ పేరిట రూపొందించిన ఈ ముసాయిదా తీర్మానం ఆమోదం కోసం సర్వ ప్రతినిధి సభలో అక్టోబర్ 12న ఓటింగ్ నిర్వహించారు. తీర్మానానికి అనుకూలంగా 143 దేశాలు ఓట్లు వేశాయి. రష్యా, బెలారస్, ఉత్తరకొరియా, సిరియా, నికరాగ్వాసహా 35 దేశాలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓట్లు వేశాయి. ‘రెఫరండంకు చట్టబద్ధత లేదు. ఉక్రెయిన్ నాలుగు ప్రాంతాల యథాతథస్థితిని మార్చే హక్కు రష్యాకు లేదు’ అని తీర్మానం పేర్కొంది.
Also read: Russia-Ukraine war: రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం తక్షణావసరం
మాది తటస్థ వైఖరి: భారత్
ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. ‘దీనిపై తటస్థ వైఖరి కొనసాగిస్తున్నా. ఉక్రెయిన్, రష్యా చర్చల బాటలో నడవాలి’ అని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కంభోజ్ అన్నారు.
Supreme Court: హిజాబ్‌పై సుప్రీం భిన్నతీర్పులు
న్యూఢిల్లీ: కర్ణాటకలో విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణ వివాదంపై సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ గురువారం భిన్నమైన తీర్పులిచ్చింది. విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సబబేనంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించారు. దాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేశారు. మరో న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధూలియా మాత్రం హైకోర్టు తీర్పును తప్పుబడుతూ దాన్ని కొట్టేశారు. హిజాబ్ ధారణ విద్యార్థినుల ఎంపిక అని అభిప్రాయపడ్డారు. ఆడపిల్లల చదువుకే ప్రాధాన్యమిస్తానని స్పష్టం చేశారు. పిటిషన్లను విచారణకు స్వీకరించాలని పేర్కొన్నారు. భిన్న తీర్పుల నేపథ్యంలో కేసు విచారణకు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని సీజేఐకి సిఫార్సు చేయాలని బెంచ్‌కు నేతృత్వం వహించిన జస్టిస్ గుప్తా నిర్ణయం తీసుకున్నారు.
Also read: హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదు: కర్ణాటక హైకోర్టు
11 ప్రశ్నల్ని రూపొందించా: జస్టిస్ గుప్తా
హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్న వారికి 11 ప్రశ్నల్ని తయారు చేసినట్టు జస్టిస్ హేమంత్ గుప్తా ఈ సందర్భంగా చెప్పారు. ‘‘ఆర్టికల్ 19(1)(ఏ) కింద భావ ప్రకటన స్వేచ్ఛ, ఆర్టికల్ 21 కింద గోప్యత హక్కు వేటికవే ప్రత్యేకమా, లేక పరస్పరం పరిపూరకాలా? కాలేజీ యాజమాన్యం హిజాబ్‌ను నిషేధించడం ఆర్టికల్ 25కి భంగకరమా? ఆర్థికల్ 25 కింద అత్యవసరంగా పాటించే మత సంప్రదాయాల పరిధి ఎంత? విద్యాసంస్థల్లో ఉమ్మడి నిబంధనలను విధిగా పాటించాలన్న కర్ణాటక ప్రభుత్వ జీవో ఆర్టికల్ 14, 15లను భంగకరమా? రాజ్యాంగం ఇచ్చిన గౌరవం, సోదరభావ హక్కులను అది అడ్డుకుంటోందా? ఇస్లాం ప్రకారం హిజాబ్ తప్పనిసరైతే పాఠశాలలో కూడా ధరిస్తానని అడిగే హక్కు విద్యార్థులకుంటుందా?’’ అంటూ పిటిషన్‌దారులపై ప్రశ్నలు సంధించారు. హైకోర్టు తీర్పులో వీటిని అతిక్రమించలేదని అభిప్రాయపడుతూ పిటిషన్లను కొట్టేశారు.
Also read: Supreme Court: రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు?
వారి జీవితాలను మెరుగు పరుస్తున్నామా?
హిజాబ్ ధారణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ జస్టిస్ ధూలియా విడిగా 73 పేజీల తీర్పు వెలువరించారు. ‘‘హిజాబ్‌ను పాఠశాల గేటు దగ్గర వదిలి తరగతి గదిలోకి వెళ్లడమంటే విద్యార్థిని గౌరవం, గోప్యతపై దాడి చేయడమే. ఇది కచ్చితంగా ఆమె ప్రాథమిక హక్కులకు భంగకరమే. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో చదువుకోవడానికి బాలికలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకందరికీ తెలుసు. కనుక హిజాబ్‌ను నిషేధించాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో కర్ణాటక హైకోర్టు తప్పు దారిలో నడిచినట్టుగా అనిపిస్తోంది. హిజాబ్ ధారణ ఇస్లాం ప్రకారం తప్పనిసరా, కాదా అన్నది ముఖ్యం కాదు. దాన్ని ధరించడం ఒక ఎంపిక. ఎదుటవారికి హాని తలపెట్టకుండా చిత్తశుద్ధిగా ఆచారాన్ని పాటించినప్పుడు దానిపై నిషేధం సమర్థనీయం కాదు. ముస్లిం బాలికలపై ఇలాంటి ఆంక్షల ద్వారా వారి జీవితాల్ని మనం మెరుగుపరుస్తున్నామా?’’ అని ప్రశ్నించారు.
Also read: Karnataka High Court: ‘హిజాబ్’పై ఏర్పాటైన ధర్మాసనానికి ఎవరు సారథ్యం వహిస్తున్నారు?
వివాదం ఎలా మొదలైందంటే...
ఈ ఏడాది జనవరిలో ఉడిపిలో మొదలైన హిజాబ్ వివాదంతో కర్నాటక అట్టుడికింది. హిజాబ్ ధరించినందుకు ముస్లిం అమ్మాయిలను ఉడిపి కాలేజీలోకి అనుమతించకపోవడంతో రగడ మొదలైంది. దీనిపై విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు. ఆందోళనల దెబ్బకు కొద్ది రోజులు విద్యాసంస్థలు మూతపడ్డాయి. తర్వాత హిజాబ్‌ను ప్రభుత్వం నిషేధించింది.
Also read: Weekly Current Affairs (National) Quiz: Which High Court has upheld the Hijab ban?
హైకోర్టు తీర్పు ఏమిచ్చిందంటే..?
ఇస్లాం ప్రకారం ముస్లిం బాలికలు హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదంటూ కర్నాటక హైకోర్టు మార్చి 15న సంచలన తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో ఉమ్మడి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్న ప్రభుత్వ జీవోను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రుతురాజ్ అవస్థీ, జస్టిస్ కృష్ణ, జస్టిస్ జేబున్నీసా ఎం.వాజీలతో కూడిన బెంచ్ సమర్థించింది.
James Webb Telescope: రోదసిలో లార్డ్ ఆఫ్ ద రింగ్స్!
17 వలయాలతో వయ్యారాలు పోతున్న జంట తారలివి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వీటిని తాజాగా గుర్తించింది. ఎనిమిదేళ్లకోసారి అవి పరస్పరం సమీపంగా వచ్చినప్పుడల్లా రెండింటి వాయు ప్రవాహాలతో రేగే అంతరిక్ష ధూళి ఇలా వలయాల రూపు సంతరించుకుంటోందట. దీన్ని రోదసిలో లార్డ్ ఆఫ్ ద రింగ్స్‌గా శాస్త్రవేత్తలు అభివర్ణింస్తున్నారు. భూమి నుంచి 50 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ జంట తారలను వూల్ఫ్–రాయెట్ 140గా వ్యవహరిస్తున్నారు. వీటిలో ఒకటి సూర్యుని కంటే కనీసం 25 రెట్లు పెద్దదట. దాని జీవితకాలం ముగింపుకు వస్తోందని నాసా తెలిపింది. అది నెమ్మదిగా కృశించి బ్లాక్‌హోల్‌గా మారడానికి ఎంతోకాలం పట్టదని చెబుతోంది.
NASA: తారల మరుభూమి
కాలం తీరి మృతప్రాయంగా మారి రాలిపడ్డ పురాతన నక్షత్రాలతో కూడిన మరుభూమి వంటి ప్రదేశాన్ని పాలపుంతలో ఓ మూలన వ్యోమగాములు తొలిసారిగా గుర్తించారు! మన పాలపుంత వైశాల్యాన్ని మథిస్తున్న క్రమంలో ఈ శ్మశానసదృశ ప్రాంతం యాదృఛ్చికంగా వారి కంటపడటం విశేషం! పదులు వందలూ కాదు, లెక్కకు మిక్కిలి సంఖ్యలో మృత నక్షత్రాలు అక్కడున్నాయట. ఇవన్నీ ఒక్కొక్కటిగా బ్లాక్‌హోల్స్‌లోకి అంతర్ధానమవుతున్నాయట. అంతరిక్షంలో దీన్ని ఒకరకంగా అధోజగత్తుగా చెప్పవచ్చని సైంటిస్టులు అంటున్నారు. దీని ఎత్తు పాలపుంతతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా ఉందట! పాలపుంతలోని ద్రవ్యరాశిలో ఇవే కనీసం మూడో వంతు ఉంటాయట. ఈ మృత నక్షత్రాలన్నీ చాలా పురాతనమైనవని, ఎప్పుడో మన పాలపుంత పాలబుగ్గల ప్రాయంలో ఉన్నప్పుడు ఏర్పడ్డ బాపతని నాసా పేర్కొంది. మారుమూల చీకట్లలో దాగుండటం వల్ల ఇంతకాలం కంటపడలేదని చెప్పుకొచ్చింది. అన్నట్టూ, ఈ అధోజగత్తు తాలూకు ఒక కొస మనకు 65 కాంతి సంవత్సరాల కంటే దూరం ఉండదట!
Also read: Human intelligence: ల్యాబ్‌లోని మెదడు కణాలూ వీడియోగేమ్ ఆడేశాయ్
PWC report: స్టార్టప్‌లకు నిధుల కొరత
న్యూఢిల్లీ: స్టార్టప్‌లకు నిధుల మద్దతు తగ్గింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనంతో దేశంలో స్టార్టప్‌లకు నిధుల సాయం సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో రెండేళ్ల కనిష్ట స్థాయి అయిన 2.7 బిలియన్ డాలర్లకు (రూ.21,870 కోట్లు) పరిమితమైంది. 205 డీల్స్ నమోదయ్యాయి. ఈ మేరకు పీడబ్ల్యూసీ ఓ నివేదికను విడుదల చేసింది. జూలై–సెప్టెంబర్ కాలంలో కేవలం రెండు స్టార్టప్‌లు యూనికార్న్ హోదా సాధించాయి. యూనికార్న్ హోదా పొందే విషయంలో అంతర్జాతీయంగా ఉన్న ధోరణే మన దగ్గరా కనిపించింది. అంతర్జాతీయంగా చూస్తే సెప్టెంబర్ క్వార్టర్‌లో 20 స్టార్టప్‌లు యూనికార్న్ హోదా పొందగా, ఇందులో 45 శాతం కంపెనీలు సాస్ విభాగం నుంచే ఉన్నాయి. ఇక డెకాకార్న్ స్థాయికి ఒక్కటీ చేరుకోలేదు.
అన్ని విభాగాల్లోనూ క్షీణత..
ఆరంభ దశ, వృద్ధి దశ, తదుపరి దశ ఇలా అన్ని విభాగాల్లోని స్టార్టప్‌లకు సెప్టెంబర్ త్రైమాసికంలో నిధుల మద్దతు తగ్గింది. ఆరంభ స్థాయి డీల్స్ విలువ సెప్టెంబర్ త్రైమాసికంలో 21 శాతంగా ఉంది. అంతకుముందు మూడు నెలల కాలంలో ఆరంభ స్థాయి డీల్స్ విలువ 12 శాతంతో పోలిస్తే రెట్టింపైంది. ముఖ్యంగా స్టార్టప్‌లకు వెంచర్ క్యాపిటల్ సంస్థలు (వీసీలు) మద్దతుగా నిలుస్తున్నాయి. వృద్ధి దశ, తదుపరి దశ స్టార్టప్‌లకు సెప్టెంబర్ త్రైమాసికంలో 79 శాతం నిధులు వెళ్లాయి. ‘‘స్టార్టప్‌లకు నిధుల మార్కెట్లో మందగమనం ఎంత కాలం కొనసాగుతుందో తెలియదు. వ్యవస్థాపకులు, ఇన్వెస్టర్లు డీల్స్ విషయంతో జాగ్రత్త పాటిస్తున్నారు’’ అని పీడబ్ల్యూసీ ఇండియా డీల్స్ పార్ట్‌నర్ అమిత్ నవకా పేర్కొన్నారు. కాగా, ఇన్వెస్టర్లు గణనీయమైన నిధులు సమీకరించారని, ఈ నిధులు ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌లోకి రానున్నాయని నివేదిక అంచనా వేసింది.
ఒక్కో డీల్ 4–5 డాలర్లు..
సెప్టెంబర్ క్వార్టర్‌లో ఒక్కో డీల్ టికెట్ విలువ సగటున 4–5 మిలియన్ డాలర్లు (రూ.32.5–40.5 కోట్లు)గా ఉంంది. సెప్టెంబర్ క్వార్టర్‌లో 38 విలీనాలు, కొనుగోళ్ల (ఎం అండ్ ఏ) డీల్స్ నమోదయ్యాయి. ఇందులో 30 దేశీ డీల్స్ ఉన్నాయి. సాస్, ఎడ్యుటెక్ స్టార్టప్‌లలో ఎక్కువ ఎం అండ్‌ఏ లు నమోదయ్యాయి. ఎడ్యుటెక్ కంపెనీ ‘అప్‌గ్రాడ్’ నాలుగు కంపెనీలను సొంతం చేసుకుని మొదటి స్థానంలో నిలిచింది.
Also read: Retail inflation: సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.41%
Indian Super League (ISL): హైదరాబాద్ FC ఘనవిజయం
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఎఫ్‌సీ తొలి విజయాన్ని అందుకుంది. అక్టోబర్ 13న నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీతో జరిగిన పోరులో హైదరాబాద్ 3–0తో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జోరు ముందు నార్త్‌ఈస్ట్ జట్టు తేలిపోయింది. మ్యాచ్ ఆరంభమైన 13వ నిమిషంలోనే బార్తొలొమి ఒబెచ్ గోల్ చేయడంతో 1–0తో హైదరాబాద్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై క్రమం తప్పకుండా దాడులకు పదునుపెట్టిన డిఫెండింగ్ చాంపియన్ రెండో అర్ధభాగంలో మరో రెండు గోల్స్ చేసింది. హలిచరన్ నర్జరీ (69వ ని.), బొర్జ హెరెరా (73వ ని.) నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేయడంతో హైదరాబాద్ విజయం ఖాయమైంది.
World Championship Shooting: భారత్ ఖాతాలో కాంస్యం
కైరో: అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ తొలి రోజే కాంస్యంతో బోణీ కొట్టింది. అక్టోబర్ 13న ప్రారంభమైన ఈ పోటీల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్, నామ్య కపూర్, విభూతి భాటియాలతో కూడిన జట్టు మహిళల 25 మీటర్ల జూనియర్ ఈవెంట్‌లో మూడో స్థానంలో నిలిచింది.
Also read: Weekly Current Affairs (Important Dates) Bitbank: ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత బృందం 17–1తో జర్మనీపై గెలిచింది. ముందుగా క్వాలిఫికేషన్‌లో 856 పాయింట్లతో భారత బృందం నాలుగో స్థానంలో నిలిచింది. తర్వాతి రౌండ్‌లో 437 పాయింట్ల స్కోరు చేసిన భారత త్రయం జర్మనీ తర్వాత నాలుగో స్థానంలో నిలిచింది. ఇరు జట్లు కాంస్యం కోసం తలపడగా భారత్ విజయం సాధించింది.
Family doctors: లక్షకుపైగా కుటుంబాలకు సమకూరనున్న ‘ఫ్యామిలీ డాక్టర్లు’
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ విద్యార్థులు ఇక ముందు ఫ్యామిలీ డాక్టర్లుగా మారిపోనున్నారు. నేరుగా గ్రామాల్లోని ప్రజల వద్దకే వెళ్లి.. కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోనున్నారు. ఆ కుటుంబాల యోగక్షేమాలను తెలుసుకోవడం, రెండు వారాలకోసారి ఇంటికే వచ్చి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, అవసరమైన మందులు సూచించడం, మరీ అవసరమైతే ఆస్పత్రులకు రిఫర్ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించడం వంటివి చేయనున్నారు. ఎంబీబీఎస్ సిలబస్‌లో భాగంగా కుటుంబాల దత్తత కార్యక్రమాన్ని చేపట్టాలని గతంలో చేసిన సిఫార్సులను జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) తాజాగా అమల్లోకి తెచి్చంది. ఈ మేరకు వైద్య విద్య క్యాలెండర్‌లోకుటుంబాల దత్తతను ప్రధాన అంశంగా ప్రస్తావించింది.
ఇంటి ముంగిటికే వైద్యం
ప్రస్తుతం చాలావరకు గ్రామాల్లో గుర్తింపు లేని ప్రైవేట్ ప్రాక్టీషనర్లు, ఆర్‌ఎంపీల వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయి. కొందరు తెలిసీ తెలియని వైద్యం చేస్తుండటం, నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రాణాల మీదకు వచ్చిన ఘటనలూ ఎన్నో. అర్హత లేని ప్రాక్టీషనర్లు ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాల్సి ఉండగా.. కొందరు సర్జరీలు, డెలివరీలు వంటివి కూడా చేస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. అంతేగాకుండా విచ్చలవిడిగా నొప్పుల మాత్రలు, యాంటీ బయాటిక్స్, ఇతర మందులు ఇస్తున్నారు కూడా. ఈ క్రమంలో అటు గ్రామీణ ప్రజలకు మంచి వైద్యం అందించడం, ఇటు ఎంబీబీఎస్ విద్యార్థులకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు, వివిధ వ్యాధులపై అవగాహన, ప్రాక్టీస్ లభించేందుకు.. కుటుంబాల దత్తత కార్యక్రమాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ఎన్‌ఎంసీ గతంలోనే సిఫార్సు చేసింది. తాజాగా దీనిని అమల్లోకి తెచి్చంది. దీనితో పలుచోట్ల గ్రామీణ ప్రాంతాల వారికి నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.
Also read: Council for Social Development Report: అవగాహన లేక ‘కు.ని’కి పాట్లు!
ఒక్కో బ్యాచ్‌కు ఒక్కో గ్రామం
ఎన్‌ఎంసీ నిర్ణయం ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలకు చెందిన ఒక్కో బ్యాచ్ విద్యార్థులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి. బ్యాచ్‌లోని ఒక్కో విద్యార్ధికి ఐదు నుంచి ఏడు కుటుంబాలను కేటాయిస్తారు. ప్రతి 25 మంది విద్యార్థుల బృందాన్ని పర్యవేక్షించడానికి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటారు. వైద్య విద్యార్థులకు స్థానికంగా ఆశా కార్యకర్తల సాయం అందించేలా ఏర్పాటు చేస్తారు. వైద్య విద్యార్థులు ఆయా కుటుంబాల్లోని వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఎవరికైనా, ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. తక్షణమే టెలి మెడిసిన్ పద్ధతిలో అవసరమైన వైద్య సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. అవసరమైతే ఆస్పత్రికి రిఫర్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు రెండు వారాలకోసారి ఆయా గ్రామాలకు వెళ్లాలి. కోర్సు మొదటి ఏడాదిలో కనీసం 10 సార్లయినా వారికి కేటాయించిన కుటుంబాల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. దీనంతటినీ కోర్సులో భాగంగానే పరిగణిస్తారు. ఇలా విద్యార్థులు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం నుంచే ఫ్యామిలీ డాక్టర్ల అవతారం ఎత్తుతారు. దత్తత తీసుకున్న గ్రామాలకు పదుల సంఖ్యలో వైద్య విద్యార్థులు వచ్చిపోవడం, సలహాలు సూచనలు ఇవ్వడం వల్ల అక్కడి ప్రజలకు ఆరోగ్య సమకూరుతుందని చెప్తున్నారు.
Also read: Family doctor: ఫోన్ కాల్‌తో వైద్య సేవలు.. ఫ్యామిలీ డాక్టర్‌కు ప్రత్యేక యాప్
వేల మంది విద్యార్థులు.. లక్షన్నరకుపైగా కుటుంబాలు..
ఈ ఏడాది మొదలవుతున్న కొత్త కాలేజీలతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం 18 ప్రభుత్వ, 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో వచ్చే నెల 15వ తేదీ నుంచి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానున్నాయి. అన్ని బ్యాచ్‌లకు చెందినవారు కలిపి దాదాపు 20 వేల మందికిపైగా ఎంబీబీఎస్ విద్యార్థులు ఉంటారు. ఆయుష్, డెంటల్ వారినీ కలిపితే మరో ఐదారు వేల మంది జత అవుతారు. ఇంతమందికి కుటుంబాల దత్తత బాధ్యత ఇస్తే.. లక్షన్నరకు పైగా కుటుంబాలకు ఆరోగ్య సేవలు అందనున్నాయి. ప్రతి జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఉన్నందున అన్ని చోట్లా ఫ్యామిలీ డాక్టర్ పద్ధతి అమల్లోకి వస్తుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
Also read: NMC: గ్రామాల్లో కుటుంబాలను దత్తత తీసుకోనున్న వైద్య విద్యార్థులు
విద్యార్థులు చేసేదిదీ..
- వైద్య విద్యార్థులు గ్రామాల్లో తాము దత్తత తీసుకున్న కుటుంబాల వద్దకు నెలకు రెండు సార్లు వస్తారు. కుటుంబంలోని వారందరితో మాట్లాడి వారి ఆరోగ్య వివరాలను తెలుసుకుంటారు.
- వ్యక్తుల వారీగా ఆరోగ్య రికార్డులను తయారు చేస్తారు. ఆహారపు అలవాట్లు, వ్యసనాలను తెలుసుకుని నమోదు చేస్తారు.
- అవసరాన్ని బట్టి బీపీ, షుగర్, కిడ్నీ, లివర్, గుండె పనితీరు పరీక్షలు, కేన్సర్ స్క్రీనింగ్, ఇతర వైద్య పరీక్షలు చేయిస్తారు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే.. పరిశీలించి తగిన వైద్య సలహాలు ఇస్తారు. మందులు సూచిస్తారు. అవసరమైతే ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు.
- పిల్లలకు వ్యాక్సిన్లు, గర్భిణులకు రెగ్యులర్ చెకప్‌లపై అవగాహన కల్పిస్తారు.
- రోగాలు రాకుండా ఎలాంటి ఆహార అలవాట్లు అలవరుచుకోవాలో సూచిస్తారు. వ్యసనాలకు దూరంగా ఉండేలా ప్రోత్సహిస్తారు.
- గ్రామాల్లో స్థానిక పరిస్థితులు, తరచుగా వస్తున్న వ్యాధులను పరిశీలిస్తారు.
- ఈ అన్ని అంశాల్లో తమకు పర్యవేక్షకుడిగా ఉండే అసిస్టెంట్ ప్రొఫెసర్ సూచనల మేరకు వైద్య విద్యార్థులు వ్యవహరిస్తారు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP