YS Jagan virtually starts Food Processing Units: ఆహార శుద్ధి పరిశ్రమలకు వర్చువల్‌గా సీఎం జగన్ శ్రీకారం
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన ఆరు ప్రాజెక్టుల్లో నాలుగు టమాటా విలువ ఆధారిత యూనిట్లు, ఒక మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్, ఉల్లి విలువ ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమలు ఉన్నాయి. ఆపరేషన్ గ్రీన్స్ కింద ఒక్కొక్కటి రూ.5.5 కోట్లతో అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం తుమ్మగుంటపల్లి, చిత్తూరు జిల్లా గంగవరం మండలం పత్తికొండ, బైరెడ్డిపల్లి మండలం చప్పిడిపల్లి, సోమల మండలం కామిరెడ్డివారిపల్లెల్లో నాలుగు టమాటా విలువ ఆధారిత యూనిట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో యూనిట్ సామర్థ్యం ఏడాదికి 3,600 టన్నులు.
విజయనగరంలో రూ.4 కోట్లతో నిర్మించిన ఆరోగ్య మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను సీఎం ప్రారంభించారు. ఏటా 7,600 టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ ద్వారా రాగిపిండి, మిల్లెట్ చిక్కీలు, బిస్కెట్లు, సేమ్యా తయారు చేస్తారు.
☛☛ YSR Netanna Nestam: తిరుపతి వెంకటగిరిలో వైఎస్సార్ నేతన్న నేస్తం
కర్నూలు జిల్లాలో:
కర్నూలు జిల్లాలో ఉల్లి విలువ ఆధారిత ఉత్పత్తుల కోసం ఒక్కో యూనిట్ రూ.లక్ష చొప్పున రూ.కోటితో 100 సోలార్ డీహైడ్రేషన్ యూనిట్లు (సూక్ష్మ పరిశ్రమలు) ఏర్పాటు చేశారు. ఒక్కో యూనిట్ ఆరుటన్నుల చొప్పున ఏటా మొత్తం ఆరువేల టన్నుల ఉల్లిని ప్రాసెస్‌చేసే సామర్థ్యం ఈ యూనిట్లకు ఉంది.
ఐదు ఆహారశుద్ధి పరిశ్రమలకు భూమిపూజ:
మరోవైపు రూ.1,692 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఐదు ఆహారశుద్ధి పరిశ్రమలకు సీఎం వైఎస్ జగన్ భూమిపూజ చేశారు. వీటిలో చాక్లెట్ల కంపెనీ, వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్, మూడు టమాటా ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి.
మాండలిజ్ కంపెనీ రూ.1,600 కోట్లతో శ్రీసిటీలో అతిపెద్ద చాక్సెట్ల తయారీ కంపెనీ నిర్మిస్తోంది. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల గ్రామం వద్ద 11 ఎకరాల్లో రూ.75 కోట్లతో వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో కల్యాణదుర్గం, కుందుర్పి, సత్యసాయి జిల్లాలో చెన్నేకొత్తపల్లిల్లో టమాటా ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు.