Van Dhan Vikas Centers: సూపర్ మార్కెట్లను తలపిస్తున్న వన్ ధన్ వికాస్ కేంద్రాలు..!
వీటి ఏర్పాటుతో గిరిజనులకు ఉన్నతమైన జీవనోపాధి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది. గిరిజనులు సేకరించిన ఫలసాయంతోపాటు గిరిజన రైతులు పండించిన ఉత్పత్తులను నాణ్యత చెడిపోకుండా అందమైన ప్యాకింగ్‌తో అమ్మకాలు చేయిస్తోంది. గిరి ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తూ అడవి బిడ్డలకు లాభదాయకంగా మలుస్తోంది.
కొనుగోలుదారులకు సైతం ప్రయోజనాలను అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని 8 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పరిధిలో వీడీవీకేలు అనుకున్న లక్ష్యాలను సాధిస్తూ గిరిజనులకు ఎంతో మేలు చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేసిన వీడీవీకేల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఆయా ఐటీడీఏల పరిధిలో ప్రాజెక్ట్ ఆఫీసర్లు వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ వాటిని పర్యవేక్షిస్తున్నారు.
విక్రయిస్తున్న ఉత్పత్తులివీ..
అటవీ ప్రాంతంలో గిరిజనులు సేకరించిన అటవీ ఫలసాయంతోపాటు వారు పండించిన ఉత్పత్తులు కూడా అందంగా ప్యాక్‌చేసి వీడీవీకేల్లో విక్రయిస్తున్నారు. ప్రధానంగా తేనె, కాఫీ, పసుపు, మిరియాలు, రాజ్మా, రాగులు, రాగి పిండి, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, అడవి దుంపల నుంచి తీసిన పాలపిండి, జీడిపప్పు, నల్లజీడి పిక్కలు, మినుములు, చింతపండు, శీకాయ, శీకాయ పొడి, కుంకుడు, చీపుర్లు, అడ్డాకులతోపాటు ఇంట్లో తయారు చేసిన ధనియాల పొడి, నువ్వులు, కారం, కరివేపాకు, మునగాకు పొడులు కూడా విక్రయిస్తుండటం విశేషం.
AP Bulk Drug Park: బల్క్ డ్రగ్ పార్కు మార్పునకు కేంద్రం ఆమోదం
రూ.61.63 కోట్లతో 415 వీడీవీకేలు
రాష్ట్రంలో 2019–20 నుంచి 2021–22 వరకు గిరిజన సంక్షేమ శాఖ 415 వీడీవీకేలను ఏర్పాటు చేయించింది. ఇందుకోసం రూ.61.63 కోట్లు మంజూరు చేయగా.. ఇప్పటివరకు రూ.36.04 కోట్లు విడుదల చేశారు. గిరిజన మహిళలతో గ్రూపులు ఏర్పాటు చేయించి.. వారికి పెట్టుబడి సాయం అందిస్తున్నారు. గిరిజనులు పండించిన ఉత్పత్తులు, సేకరించిన ఫలసాయాలకు వీటిద్వారా కనీస మద్దతు ధర దక్కేలా చేస్తున్నారు.
సేకరించిన అటవీ ఉత్పత్తులకు అదనపు విలువను జోడించేలా గిరిజన మహిళలకు శిక్షణ ఇవ్వడం, మార్కెటింగ్‌కు అనుగుణంగా వాటిని సిద్ధం చేయడం వంటి లక్ష్యాలు సాధించడంలో వీడీవీకేల ద్వారా చేస్తున్న ప్రయత్నాల వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. గిరిజన ఉత్పత్తుల సేకరణ నుంచి మార్కెటింగ్ వరకు వీడీవీకేల ద్వారా అందిస్తున్న తోడ్పాటు గిరిజన మహిళల ఆర్థిక పురోగతికి దోహదం చేస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటైన వీడీవీకేలు సూపర్ మార్కెట్లను తలపిస్తున్నాయి.
నెలకు రూ.25 వేలకు పైనే మిగులుతోంది
గిరిజన మహిళలు గ్రూపుగా ఏర్పడి వీడీవీకే ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీతో కూడిన పెట్టుబడి సాయం అందిస్తుంది. ఐటీడీఏ, డీఆర్‌డీఏ పర్యవేక్షణలో ఇవి గిరిజన ప్రాంతాల్లో వినూత్న సూపర్ మార్కెట్‌ల మాదిరిగా ఆదరణకు నోచుకుంటున్నాయి. వీటికి మంచి డిమాండ్ ఉండటంతో నెలకు కనీసం రూ.లక్షకుపైగా విక్రయాలు జరిగితే పెట్టుబడి పోనూ రూ.25 వేలు లాభం మిగులుతోంది. గ్రూపు సభ్యులు లాబాల్లో వాటా పంచుకుని మెరుగైన జీవనం గడిపేందుకు వీడీవీకేలు దోహదం చేస్తున్నాయి. – జి.పైడమ్మ, వీడీవీకే నిర్వాహకురాలు, పాడేరు