World's Oldest Person: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ కన్నుమూత
అమెరికాలో జన్మించిన, స్పెయిన్ దేశస్తురాలు మరియా బ్రన్యాస్ కన్నుమూశారని ఆమె కుటుంబసభ్యులు ఆగస్టు 21వ తేదీ ప్రకటించారు. బ్రన్యాస్ ‘ఎక్స్’పేజీలో వారు.. ‘మరియా బ్రన్యాస్ మనల్ని విడిచి వెళ్లిపోయారు. కోరుకున్న విధంగానే నిద్రలోనే, ప్రశాంతంగా, ఎలాంటి బాధా లేకుండా తుదిశ్వాస విడిచారు’అని పేర్కొన్నారు.
110 ఏళ్లు.. అంతకంటే ఎక్కువ ఏళ్లు జీవించి ఉన్న వ్యక్తుల వివరాలను ఎప్పటికప్పుడు సేకరించే గెరంటాలజీ రీసెర్చ్ గ్రూప్.. ఫ్రాన్సుకు చెందిన లుసిలె రాండన్ అనే నన్ గతేడాది మరణించాక, మనకు తెలిసినంత వరకు అత్యంత వృద్ధ మహిళ బ్రన్యాస్ అని ప్రకటించింది. బ్రన్యాస్ మరణంతో ఆ స్థానం 116 ఏళ్ల జపనీయురాలు తొమికొ ఇకూటాకు దక్కుతుందని తాజాగా ఆ గ్రూప్ తెలిపింది.
1907 మార్చి 4వ తేదీన అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో బ్రన్యాస్ జన్మించారు. ఆమె కుటుంబం కొన్నాళ్లపాటు న్యూఆర్లియన్స్‌లోనూ ఉంది. ఆమె తండ్రి స్పెయిన్‌లో ఓ మ్యాగజీన్‌ను ప్రారంభించడంతో, కుటుంబంతోపాటు ఆమె కూడా ఇక్కడికే వచ్చేశారు. 113 ఏళ్ల వయస్సులో తక్కువ తీవ్రతతో సోకిన కోవిడ్ నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు.