Skip to main content

US Election Results: అమెరికా ఎన్నికల్లో.. విజయం సాధించిన ఆరుగురు భారతీయులు

అమెరికా ఎన్నికల్లో ఆరుగురు భారతీయ అమెరికన్లు విజయం సాధించారు.
Six Indian Americans win elections of US House of Representatives

ప్రస్తుత కాంగ్రెస్‌లో ఐదుగురు ప్రతినిధులు ఉండగా.. ఈ ఎన్నికలతో అమెరికా ప్రతినిధుల సభలో భారతీయ అమెరికన్ల సంఖ్య ఆరుకు పెరిగింది. వర్జీనియా నుంచి ఎన్నికైన తొలి భారతీయుడిగా న్యాయవాది సుహాస్‌ సుబ్రమణ్యం చరిత్ర సృష్టించారు.

అమీ బెరా.. 
డెమొక్రాట్‌ అభ్యర్థిగా కాలిఫోర్నియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమీ బెరా విజయం సాధించారు. రిపబ్లికన్‌ ప్రత్యర్థి క్రిస్టీన్‌ బిష్‌ను ఆయన ఓడించారు. యూఎస్‌ ప్రతినిధుల సభలో ఆయన సీనియర్‌ భారతీయ అమెరికన్‌. 2012లో రిపబ్లికన్‌ అభ్యర్థిని ఓడించిన బెరా 6వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌కు ప్రాతినిధ్యం వహించారు. యూఎస్‌ ప్రతినిధుల సభకు చేరిన మూడో భారతీయ వ్యక్తిగా నిలిచారు. 1957లో కాలిఫోర్నియా 29వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో కాలు పెట్టిన తొలి భారతీయ అమెరికన్‌గా దలీప్‌ సింగ్‌ సౌంద్‌ చరిత్ర సృష్టించిన 50 ఏళ్ల తరువాత అమీ బెరా కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు. మొదట స్వల్ప ఓట్ల తేడాతో గెలిచినా.. తరువాత పర్యాయాల్లో ఆధిక్యాన్ని కొనసాగించారు.  

థానేదార్‌ రెండోసారి.. 
మిషిగన్‌లోని పదమూడో కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్ నుంచి ఇండియన్‌ అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు థానేదార్‌ రెండోసారి ఎన్నికయ్యారు. రిపబ్లికన్‌ ప్రత్యర్థి మార్టెల్‌ బివింగ్స్‌ను 35 శాతానికి పైగా ఓట్ల తేడాతో ఓడించారు. తాను అందించిన సేవలు, శ్రామికులు, యూనియన్ల పక్షాన నిలబడటం, అబార్షన్‌ హక్కుల కోసం పోరాటం తన విజయానికి కారణమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.    

United States Presidents: ఇప్ప‌టివ‌ర‌కు అమెరికా అధ్యక్షులుగా ఎన్నికైన వారు వీరే..

రోఖన్నా.. 2016 నుంచి
కాలిఫోర్నియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న డెమొక్రటిక్‌ ప్రతినిధి రో ఖన్నా మూడోసారి ఎన్నికయ్యారు. డెమొక్రాట్లకు బలమైన పట్టున్న 17వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌లో రిపబ్లికన్‌ అనితా చెన్‌ను సునాయాసంగా ఓడించారు. 2016లో మైక్‌ హోండాను ఓడించి ఖన్నా తొలిసారి అమెరికా సభకు ఎన్నికయ్యారు. ఖన్నా హౌస్‌ ఆర్మ్‌డ్ సర్వీసెస్‌ కమిటీలో, పర్యవేక్షణ, జవాబుదారీ కమిటీల్లో పనిచేస్తున్నారు. శాన్‌ ఫ్రాన్సిస్కోకు దక్షిణాన సిలికాన్‌ వ్యాలీలోని కొన్ని భాగాలను కలిగి ఉన్న డిస్ట్రిక్ట్‌.. 1990 నుంచి డెమొక్రాట్లకు కంచుకోటగా ఉంది.  

ఇల్లినాయిస్‌ నుంచి రాజా కృష్ణమూర్తి..  
డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి రాజా కృష్ణమూర్తి ఇల్లినాయిస్‌ 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌ నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. రిపబ్లికన్‌ అభ్యర్థి మార్క్‌ రిక్‌పై దాదాపు 30 వేలకు పైగా ఓట్ల తేడాతో కృష్ణమూర్తి విజయం సాధించారు. 2016లో తొలిసారి కాంగ్రెస్‌కు ఎన్నికైన ఆయన.. చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీలో అనుమానిత కార్యకలాపాలపై దృష్టి సారించిన సెలక్ట్‌ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుకున్న న్యాయవాది అయిన కృష్ణమూర్తి.. మాజీ డిప్యూటీ స్టేట్‌ కోశాధికారితో సహా రాష్ట్రం తరఫున అనేక పదవులు నిర్వహించారు.  

ప్రమీలా జయపాల్‌
వాషింగ్టన్‌ 7వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి ప్రమీలా జయపాల్‌ మరోసారి గెలుపొందారు. మలయాళీ అయిన జయపాల్‌ నాయర్‌ రిపబ్లికన్‌ అభ్యర్థి డాన్‌ అలెగ్జాండర్‌ను భారీ ఓట్ల తేడాతో ఓడించారు. జయపాల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న స్లామ్‌–డంక్‌ లిబరల్‌ సీటు. ఇది డెమొక్రాట్లకు బలమైన జిల్లా. గెలుపు అనంత రం ఎక్స్‌ వేదికగా మద్దతు దారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.  

సుహాస్‌ సుబ్రమణ్యం రికార్డు..  
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎన్నికై చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్‌ సుహాస్‌ సుబ్రమణ్యం. ఇప్పటివరకు వర్జీనియా స్టేట్‌ సెనేటర్‌గా ఉన్న సుబ్రమణ్యం.. వర్జీనియానుంచి ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్‌గా రికార్డు సృష్టించారు. డెమొక్రటిక్‌లకు కంచుకోట అయిన వర్జీనియాలోని 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌ నుంచి అమెరికా ప్రతినిధుల సభకు పోటీ చేసి రిపబ్లికన్ పార్టీకి చెందిన మైక్‌ క్లాన్సీని ఓడించారు. ప్రస్తుతం ఐదుగురు భారతీయ అమెరికన్లతో కూడిన కాంగ్రెస్‌లో ఆయన సమోసా కాకస్‌లో చేరారు.

Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. హారిస్‌పై ఘనవిజయం

Published date : 07 Nov 2024 03:14PM

Photo Stories