Skip to main content

World Blitz Championship: రెండోసారి ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌గా కోనేరు హంపీ

ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ మహిళల విభాగంలో భారత నంబర్‌వన్‌ కోనేరు హంపి విజేతగా నిలిచింది.
Koneru Humpy celebrating her victory at World Rapid Chess Championship  Indian Grandmaster Koneru Humpy crowned World Rapid Chess Champion for historic second time

భారత కాలమానం ప్రకారం డిసెంబ‌ర్ 29వ తేదీ తెల్లవారుజామున ముగిసిన ర్యాపిడ్‌ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 37 ఏళ్ల హంపి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 110 మంది క్రీడాకారిణల మధ్య స్విస్‌ ఫార్మాట్‌లో 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హంపి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ను దక్కించుకుంది. 

60 వేల డాలర్ల ప్రైజ్‌మనీ..
విజేతగా నిలిచిన హంపికి 60 వేల డాలర్ల (రూ.51 లక్షల 23 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. 10వ రౌండ్‌ ముగిశాక హంపితోపాటు మరో ఆరుగురు క్రీడాకారిణులు జు వెన్‌జున్‌ (చైనా), కాటరీనా లాగ్నో (రష్యా), టాన్‌ జోంగి (చైనా), ఇరినె ఖరిస్మా సుకందర్‌ (ఇండోనేసియా), ద్రోణవల్లి హారిక (భారత్‌), అఫ్రూజా ఖమ్‌దమోవా (ఉజ్బెకిస్తాన్‌) 7.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ రేసులో నిలిచారు. 

అయితే చివరిదైన 11వ రౌండ్‌ గేమ్‌లో నల్ల పావులతో ఆడిన హంపి 67 ఎత్తుల్లో ఖరిస్మా సుకందర్‌పై గెలుపొందడం.. జు వెన్‌జున్, కాటరీనా లాగ్నో, హారిక, టాన్‌ జోంగి, అఫ్రూజా తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకోవడంతో హంపికి టైటిల్‌ ఖరారైంది. 8 పాయింట్లతో జు వెన్‌జున్, కాటరీనా లాగ్నో, టాన్‌ జోంగి, హారిక, అఫ్రూజా, అలెగ్జాండ్రా కొస్టెనిక్‌ (స్విట్జర్లాండ్‌) ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచారు. 

Awards: ‘ఖేల్‌రత్న’ అవార్డు అందుకోనున్న క్రీడాకారులు వీరే.. మను బాకర్‌కు దక్కని చోటు

మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ఈ ఆరుగురి ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. జు వెన్‌జున్‌కు రెండో స్థానం, కాటరీనాకు మూడో స్థానం లభించాయి. టాన్‌ జోంగి నాలుగో స్థానంలో, హారిక ఐదో స్థానంలో, కొస్టెనిక్‌ ఆరో స్థానంలో, అఫ్రూజా ఏడో స్థానంలో నిలిచారు. 
 

  • ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో హంపి సాధించిన పతకాలు 4. 2012లో కాంస్య పతకం నెగ్గిన హంపి.. 2019లో స్వర్ణం, 2023లో రజతం, 2024లో స్వర్ణం గెలిచింది.  

దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ (2003, 2017) తర్వాత ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను రెండుసార్లు గెలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గా.. జు వెన్‌జున్‌ (చైనా) తర్వాత రెండుసార్లు ప్రపంచ ర్యాపిడ్‌ చాంపియన్‌గా నిలిచిన రెండో మహిళా క్రీడాకారిణిగా హంపి గుర్తింపు పొందింది.  

అర్జున్‌కు ఐదో స్థానం 
ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఓపెన్‌ విభాగంలో భారత క్రీడాకారులకు నిరాశ ఎదురైంది. రెండో రోజు గేమ్‌లు ముగిశాక టైటిల్‌ రేసులో నిలిచిన భారత నంబర్‌వన్‌ ఇరిగేశి అర్జున్‌ ఆఖరి రోజు తడబడ్డాడు. పదో గేమ్‌లో అలెగ్జాండర్‌ గ్రిష్‌చుక్‌ (రష్యా) చేతిలో అర్జున్‌ ఓడిపోవడం అతని టైటిల్‌ అవకాశాలను దెబ్బ తీసింది. 

U19 T20 Asia Cup: అండర్-19 మహిళల ఆసియా టీ20 ఛాంపియన్‌గా భారత్

నిర్ణీత 13 రౌండ్ల తర్వాత అర్జున్‌ 9 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. రష్యాకు చెందిన 18 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్‌ వొలోడార్‌ ముర్జిన్‌ 10 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించాడు. రష్యాకే చెందిన గ్రిష్‌చుక్, నిపోమ్‌నిషి 9.5 పాయింట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచి క్లీన్‌స్వీప్‌ చేశారు.

ఈ విజయం ఎంతో ప్రత్యేకం.. 
ప్రపంచ టైటిల్స్‌ సాధించడం కోనేరు హంపికి కొత్తేమీ కాదు. 26 ఏళ్ల క్రితం తొలిసారి ప్రపంచ అండర్‌–10 విభాగంలో విశ్వవిజేతగా అవతరించిన హంపి ఆ తర్వాత 1998లో అండర్‌–12 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, 2000లో అండర్‌–14 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, 2001లో జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో జగజ్జేతగా నిలిచింది. ఆ తర్వాత ఆసియా చాంపియన్‌షిప్, గ్రాండ్‌ప్రి టోర్నీ టైటిల్స్‌ సాధించిన హంపి 2019లో ర్యాపిడ్‌ ఫార్మాట్‌లో తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఐదేళ్ల క్రితం సాధించిన తొలి ప్రపంచ ర్యాపిడ్‌ టైటిల్‌తో పోలిస్తే ఈసారి విజయం ఎంతో ప్రత్యేకమని హంపి అన్నారు. 

T20 Series: టీ20లో ‘రికార్డు’ విజయం సాధించిన‌ భారత మహిళల జట్టు

Published date : 31 Dec 2024 09:35AM

Photo Stories