Skip to main content

Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్ గెలిచారు.
Donald Trump wins the US presidential election 2024  Donald Trump wins the US presidential election, becoming the 47th president

డెమొక్రాట్ల అభ్యర్ధి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై ఘనవిజయం సాధించారు. అమెరికా కాలమానం ప్రకారం న‌వంబ‌ర్ 6వ తేదీ రాత్రి వెల్లడైన ఫలితాల్లో విజయానికి కావాల్సిన 270 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్ల మార్కును ట్రంప్ దాటేశారు. తద్వారా నాలుగేళ్ల విరామం తర్వాత రెండోసారి అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకుని, 47వ అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నాడు.  

గ్రోవర్‌ క్లీవ్‌లాండ్‌ తర్వాత అమెరికా చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక నేతగా నిలిచారు. ఆ క్రమంలో పలు ఇతర రికార్డులూ సొంతం చేసుకున్నారు. అత్యంత ఎక్కువ వయసులో అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన వ్యక్తిగా కూడా 78 ఏళ్ల ట్రంప్‌ నిలిచారు. 

2016లో ట్రంప్‌ తొలిసారి అధ్యక్షునిగా నెగ్గినప్పుడు ఆయన కంటే ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌కు 28 లక్షల ఓట్లు ఎక్కువగా వ‌చ్చాయి. ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా పోలైన ఓట్లలో ట్రంప్‌ ఇప్పటికే హారిస్‌ కంటే ఏకంగా 50 లక్షలకు పై చిలుకు ఓట్ల మెజారిటీ సాధించారు. 20 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన రిపబ్లికన్‌ అధ్యక్షునిగా నిలిచారు. 

అంతేగాక తనకు మాయని మచ్చగా మిగిలిన 2020 అధ్యక్ష ఎన్నికల ఓటమి తాలూకు చేదు గుర్తులను కూడా ఈ గెలుపుతో చెరిపేసుకున్నారు. బైడెన్‌ విజయాన్ని తిరస్కరిస్తూ తన మద్దతుదారులను క్యాపిటల్‌ హిల్‌పై దాడికి ఉసిగొల్పి క్రిమినల్‌ కేసుల్లో ఇరుక్కోవడంతో ట్రంప్‌ రాజకీయ భవితవ్యం ముగిసినట్టేనని అంతా భావించారు. అలాంటి స్థితి నుంచి పుంజుకుని నాలుగేళ్ల తర్వాత ఆయన సాధించిన ఘనవిజయం రిపబ్లికన్‌ పార్టీలో ఆనందోత్సాహాలు నింపగా 60 ఏళ్ల హారిస్‌ ఓటమితో డెమొక్రాట్లు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు.  

US President salary: అమెరికా అధ్యక్షుడి జీతం ఎంత, సౌకర్యాలు ఏమిటో తెలుసా..?

జనవరి 20న ప్రమాణస్వీకారం
ఫలితాల వెల్లడి ప్రక్రియ పూర్తయి ట్రంప్‌ను అధ్యక్షునిగా లాంఛనంగా ప్రకటించేందుకు మరో రెండు నెలలు పట్టనుంది. అనంతరం జనవరి 20న ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు. రెండోసారి శ్వేతసౌధంలో అడుగు పెట్టనున్న ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశాధినేతల నుంచి అభినందనలు, శుభాకాంక్ష సందేశాలు వెల్లువెత్తాయి. 

ముందునుంచీ ట్రంప్‌ ఆధిపత్యమే సాగుతూ.. 
అమెరికా వ్యాప్తంగా న‌వంబ‌ర్ 6వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం దాకా పోలింగ్‌ ప్రక్రియ కొనసాగింది. ఆ వెంటనే రాష్ట్రాలవారీగా ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదటినుంచీ ట్రంప్‌ ఆధిపత్యమే సాగుతూ వచ్చింది. చూస్తుండగానే ఏడు స్వింగ్‌ రాష్ట్రాల్లోనూ ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. 

రాత్రి తుది ఫలితాలు వెల్లడయ్యే సమయానికి 538 ఎలక్టోరల్‌ ఓట్లలో ట్రంప్‌ 294 సొంతం చేసుకున్నారు. మరోవైపు హారిస్‌ 223 ఎలక్టోరల్‌ ఓట్లకే పరిమితమయేలా కన్పిస్తున్నారు. ట్రంప్‌కు 7.1 కోట్ల పై చిలుకు ఓట్లు రాగా ఆమెకు 6.6 కోట్లే వచ్చాయి. 

50 రాష్ట్రాలకు గాను అరిజోనా, నెవడా, మెయిన్‌ ఫలితమే తేలాల్సి ఉంది. అరిజోనాల్లో ట్రంప్‌ గెలుపు లాంఛనమే కాగా మెయిన్, నెవడాల్లోనూ ఆయన ఇప్పటికే 50 వేల పై చిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 

United States Presidents: ఇప్ప‌టివ‌ర‌కు అమెరికా అధ్యక్షులుగా ఎన్నికైన వారు వీరే..

ఆ మూడు రాష్ట్రాల్లోని 21 స్థానాలనూ గెలుచుకుని మరోసారి 300 మార్కు అలవోకగా దాటేలా కన్పిస్తున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఆయనకు 304 ఓట్లు దక్కాయి. తన ఓటమి ఖాయం కావడంతో హార్వర్డ్‌ వర్సిటీలో న‌వంబ‌ర్ 6వ తేదీ రాత్రి తలపెట్టిన ప్రసంగ కార్యక్రమాన్ని హారిస్‌ రద్దు చేసుకున్నారు. 

అధ్యక్షుడు బైడెన్‌ అభ్యర్థిత్వం పట్ల డెమొక్రాట్ల నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయనకు బదులుగా అనూహ్యంగా బరిలో దిగిన హారిస్‌కు ఈ ఫలితాలు నిరాశ కలిగించేవే. గెలిచి ఉంటే అధ్యక్ష పదవిని అధిష్టించిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించేవారు. 

Published date : 07 Nov 2024 12:36PM

Photo Stories