Neeraj Chopra Biography: ఛాంపియన్ నీరజ్
ప్రపంచ అథ్లెటిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. దేశం గర్వపడేలా చేశారు. ఆదివారం నాడు రెండో ప్రయత్నంలో గరిష్ఠంగా 88.17 మీటర్ల దూరం ఈటెను విసిరి, నీరజ్ సాధించిన ఈ స్వర్ణపతకం ఇక భారత క్రీడాచరిత్రలో సువర్ణాక్షర లిఖితం.
భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ఊరిలోని నీరజ్ ఇంట్లో ఆయన తండ్రి, బంధుమిత్రులు ఒక్కచోట కూడిన ఉత్కంఠగా చూసిన ఈ విజయఘట్టం వారికే కాదు... యావద్భారతావనికి కూడా ఉద్విగ్నభరితమైనది. ఆర్మీలో సుబేదార్ అయిన పాతికేళ్ళ నీరజ్ చోప్రా మాటల్లోనే చెప్పాలంటే, ఒలింపిక్స్ కన్నా వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ కఠినమైనది. ఒలింపిక్స్ ప్రత్యేక మైనది అయితే, వరల్డ్ ఛాంపియన్ అనేది అతి పెద్ద కిరీటం.
పోటీ పరంగా చూసినా, అథ్లెట్లు అవిశ్రాంత సాధన చేసి వచ్చే వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ ఎప్పుడూ కాస్తంత ఎక్కువ కఠినమే. అలాంటి వేదికపై స్వర్ణసాధనతో నీరజ్ ‘భారతదేశంలో ఆల్‌టైమ్ అతి గొప్ప అథ్లెట్’గా అవతరించారు. మొహమాటంగా ఆ పిలుపును పక్కనపెడుతూ, ఆయన వినయంగా వ్యవహరిస్తున్నప్పటికీ అది వాస్తవమే. అటు ఒలింపిక్స్ స్వర్ణం, ఇటు తాజా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ స్వర్ణం – రెండూ సాధించిన ఏకైక భారత అథ్లెట్ ఈ సైనికుడే.
World Athletics Championships: నీరజ్ స్వర్ణ చరిత్ర
మధ్యతరగతి నుంచి వచ్చిన నీరజ్ ఈ స్థాయికి చేరడానికి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. మోచేతికి గాయం కావడంతో 2019లో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. అలా అప్పట్లో దోహాలో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌కు హాజరు కాలేకపోయారు. తర్వాత రెట్టించిన ఉత్సాహంతో వచ్చి, 2020 జనవరిలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఆలస్యంగా ఆ మరుసటేడు జరిగిన ఆ ఒలింపిక్స్‌లో ఏకంగా స్వర్ణం సాధించారు. మన దిగ్గజ అథ్లెట్లైన మిల్ఖాసింగ్, పీటీ ఉషకు సైతం అందని ఆ స్వర్ణకీర్తిని అందుకున్నారు.
అలా రెండేళ్ళ క్రితం 2021 ఆగస్ట్‌లో జరిగిన టోక్యో ఒలింపిక్స్– 2020లో స్వర్ణసాధన నాటి నుంచి అందరి దృష్టీ నీరజ్‌పై ఉంది. ఇప్పుడీ ప్రపంచ ఛాంపియన్ షిప్స్‌లోనూ బంగారు పతకం తెచ్చి, అథ్లెటిక్స్‌లో మన దేశానికి పతకాలు పండించే బంగారు కొండ అయ్యారు. సౌత్ ఏషియన్ గేమ్స్ (2016), ఏషియన్ ఛాంపియన్‌షిప్స్ (2017), కామన్వెల్త్ గేమ్స్ (2018), ఏషియన్ గేమ్స్ (2018), ఒలింపిక్స్ (2020), డైమండ్ లీగ్ (2022), ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్‌షిప్స్... ఇలా నీరజ్ సాధించిన స్వర్ణాలే అందుకు సాక్ష్యం.
World Badminton Championships 2023: బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ప్రణయ్‌కు కాంస్యం
మొత్తం ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ చరిత్రలో భారత్‌కు ఇది మూడో పతకం. ఇంతకు మునుపు జరిగిన 18 ఛాంపియన్‌షిప్‌లలో మన దేశానికి వచ్చినవి రెండు పతకాలే. ఆ రెండింటిలో కూడా ఒకటి నిరుటి ఛాంపియన్‌షిప్స్‌లో నీరజ్ చోప్రా సాధించిన రజతమే. అంతకు ముందెప్పుడో 2003లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ బాబీ జార్జ్ కాంస్యం గెలిచారు. అప్పుడలా విశ్వవేదికపై మొదలైన మన పతకాల లెక్క ఇప్పుడు మూడుకు చేరడం ఒక రకంగా ఆనందమే అయినా, మరోరకంగా ఇన్నేళ్ళకు గానీ ఆ స్థాయికి చేరకపోవడం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశం.
ప్రపంచ స్థాయికి చేరేలా మన ఆటగాళ్ళను ప్రోత్సహించేందుకు మనం చేయవలసినంత చేస్తున్నామా అన్నది ఆలోచించాల్సిన విషయం. అయితే, ఒకప్పుడు అంతర్జాతీయ యవనికపై భారతీయ క్రీడ అంటే హాకీ. తర్వాత క్రికెట్, ఆ పైన చెస్, బ్యాడ్మింటన్, టెన్నిస్, రెజ్లింగ్ వగైరాల్లోనూ మన ప్రతిభకు తక్కువ లేదని నిరూపిత మవుతూ వచ్చింది. నిజానికి, జావెలిన్ త్రోలో సైతం ఒకప్పుడు విశ్వవేదికపై మనం ఎక్కడ ఉన్నామో కూడా ఎవరికీ తెలీదు. కానీ, ఇప్పుడు ఏకంగా ముందు వరుసలో నిలిచాం.
Chess World Cup 2023: చెస్ ప్రపంచకప్ విజేతగా మాగ్నస్ కార్ల్‌సన్
అందులోనూ తాజా పోటీలో కిశోర్ జెనా, డీపీ మను అనే మరో ఇద్దరు భారతీయ జావెలిన్ త్రో వీరులు కూడా ఉండడం, వారిద్దరు 5వ, 6వ స్థానాల్లో నిలవడం... ఇవన్నీ మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. భవిష్యత్తు పట్ల ఆశలు రేపుతున్నాయి. ఆ ఆశలు నెరవేరడానికి నీరజ్ అన్నట్టు మన దగ్గర కూడా కీలకమైన మోండో ట్రాక్స్ వగైరాలను అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌ఐ) సిద్ధం చేయడం అవసరం.
చెక్ రిపబ్లిక్‌కు చెందిన దిగ్గజ అథ్లెట్ జెలెజ్నీ 98.48 మీటర్ల దూరం ఈటె విసిరి, ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. మూడుసార్లు ఒలింపిక్స్‌లో, మరో 3 సార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకాలు గెలిచారు. అతనే తనకు స్ఫూర్తి అని చెప్పే నీరజ్ ఆ స్థాయికి చేరడానికి చేయాల్సిన శ్రమ, సాగించాల్సిన ప్రయాణం ఇంకా చాలానే ఉంది. ఆ ప్రయాణానికి మన ప్రభుత్వాలు, క్రీడా సంస్థలు అందించాల్సిన సహకారమూ అపారమే.
నీరజ్ ఒలింపిక్స్ సాధన తర్వాత హరియాణాలోని పానిపట్ సహా అనేక గ్రామాల్లో పిల్లల్లో, ఇళ్ళల్లో క్రీడల పట్ల ఆసక్తి కొన్ని పదుల రెట్లు పెరిగింది. గుంపులుగా వచ్చి, ఆటలాడుతున్న ఆ భావి భారత ఆశాకిరణాలకు మైదానాలు, ఆస్పత్రుల లాంటి కనీస వసతులు కల్పించడం ప్రభుత్వ కర్తవ్యం. ఆ దిశగా కృషి చేస్తే, మరింత మంది నీరజ్‌లు ఈ గడ్డపై నుంచి వస్తారనడంలో సందేహం లేదు.