Skip to main content

Konijeti Rosaiah: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇకలేరు

Rosaiah

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) ఇకలేరు. డిసెంబర్‌ 4న ఉదయం హైదరాబాద్‌లోని తన స్వగృహంలో బీపీ డౌన్‌ కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను నగరంలోని స్టార్‌ ఆస్పత్రిలో తరలిస్తుండగా.. మార్గ మధ్యంలోనే తుదిశ్వాస విడిచారు. 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించిన రోశయ్య గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్‌ అభ్యసించారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు.

గవర్నర్‌గా, ముఖ్యమంత్రిగా..

  • తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా రోశయ్య పనిచేసారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల హయాంలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. 
  • 2004లో చీరాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనారు.
  • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య..... 2009, సెప్టెంబర్‌ 3 నుండి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
  • 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు.
  • 2014లో జూన్‌ 28 నుంచి ఆగస్టు 31 వరకు కర్ణాటక గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించారు.

ఆర్థిక మంత్రిగా..

  • రోశయ్య 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణా, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు నిర్వహించారు. 
  • 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోంశాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు నిర్వహించారు. 
  • 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్‌ శాఖలు, 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్‌ శాఖలకు మంత్రిగా పనిచేశారు. 
  • 2004, 2009లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వములో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను రోశయ్య 15 సార్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
Published date : 04 Dec 2021 12:58PM

Photo Stories