Supreme Court: హిజాబ్‌పై సుప్రీం భిన్నతీర్పులు
విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సబబేనంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించారు. దాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేశారు. మరో న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధూలియా మాత్రం హైకోర్టు తీర్పును తప్పుబడుతూ దాన్ని కొట్టేశారు. హిజాబ్ ధారణ విద్యార్థినుల ఎంపిక అని అభిప్రాయపడ్డారు. ఆడపిల్లల చదువుకే ప్రాధాన్యమిస్తానని స్పష్టం చేశారు. పిటిషన్లను విచారణకు స్వీకరించాలని పేర్కొన్నారు. భిన్న తీర్పుల నేపథ్యంలో కేసు విచారణకు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని సీజేఐకి సిఫార్సు చేయాలని బెంచ్‌కు నేతృత్వం వహించిన జస్టిస్ గుప్తా నిర్ణయం తీసుకున్నారు.
Also read: హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదు: కర్ణాటక హైకోర్టు
11 ప్రశ్నల్ని రూపొందించా: జస్టిస్ గుప్తా
హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్న వారికి 11 ప్రశ్నల్ని తయారు చేసినట్టు జస్టిస్ హేమంత్ గుప్తా ఈ సందర్భంగా చెప్పారు. ‘‘ఆర్టికల్ 19(1)(ఏ) కింద భావ ప్రకటన స్వేచ్ఛ, ఆర్టికల్ 21 కింద గోప్యత హక్కు వేటికవే ప్రత్యేకమా, లేక పరస్పరం పరిపూరకాలా? కాలేజీ యాజమాన్యం హిజాబ్‌ను నిషేధించడం ఆర్టికల్ 25కి భంగకరమా? ఆర్థికల్ 25 కింద అత్యవసరంగా పాటించే మత సంప్రదాయాల పరిధి ఎంత? విద్యాసంస్థల్లో ఉమ్మడి నిబంధనలను విధిగా పాటించాలన్న కర్ణాటక ప్రభుత్వ జీవో ఆర్టికల్ 14, 15లను భంగకరమా? రాజ్యాంగం ఇచ్చిన గౌరవం, సోదరభావ హక్కులను అది అడ్డుకుంటోందా? ఇస్లాం ప్రకారం హిజాబ్ తప్పనిసరైతే పాఠశాలలో కూడా ధరిస్తానని అడిగే హక్కు విద్యార్థులకుంటుందా?’’ అంటూ పిటిషన్‌దారులపై ప్రశ్నలు సంధించారు. హైకోర్టు తీర్పులో వీటిని అతిక్రమించలేదని అభిప్రాయపడుతూ పిటిషన్లను కొట్టేశారు.
Also read: Supreme Court: రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు?
వారి జీవితాలను మెరుగు పరుస్తున్నామా?
హిజాబ్ ధారణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ జస్టిస్ ధూలియా విడిగా 73 పేజీల తీర్పు వెలువరించారు. ‘‘హిజాబ్‌ను పాఠశాల గేటు దగ్గర వదిలి తరగతి గదిలోకి వెళ్లడమంటే విద్యార్థిని గౌరవం, గోప్యతపై దాడి చేయడమే. ఇది కచ్చితంగా ఆమె ప్రాథమిక హక్కులకు భంగకరమే. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో చదువుకోవడానికి బాలికలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకందరికీ తెలుసు. కనుక హిజాబ్‌ను నిషేధించాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో కర్ణాటక హైకోర్టు తప్పు దారిలో నడిచినట్టుగా అనిపిస్తోంది. హిజాబ్ ధారణ ఇస్లాం ప్రకారం తప్పనిసరా, కాదా అన్నది ముఖ్యం కాదు. దాన్ని ధరించడం ఒక ఎంపిక. ఎదుటవారికి హాని తలపెట్టకుండా చిత్తశుద్ధిగా ఆచారాన్ని పాటించినప్పుడు దానిపై నిషేధం సమర్థనీయం కాదు. ముస్లిం బాలికలపై ఇలాంటి ఆంక్షల ద్వారా వారి జీవితాల్ని మనం మెరుగుపరుస్తున్నామా?’’ అని ప్రశ్నించారు.
Also read: Karnataka High Court: ‘హిజాబ్’పై ఏర్పాటైన ధర్మాసనానికి ఎవరు సారథ్యం వహిస్తున్నారు?
వివాదం ఎలా మొదలైందంటే...
ఈ ఏడాది జనవరిలో ఉడిపిలో మొదలైన హిజాబ్ వివాదంతో కర్నాటక అట్టుడికింది. హిజాబ్ ధరించినందుకు ముస్లిం అమ్మాయిలను ఉడిపి కాలేజీలోకి అనుమతించకపోవడంతో రగడ మొదలైంది. దీనిపై విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు. ఆందోళనల దెబ్బకు కొద్ది రోజులు విద్యాసంస్థలు మూతపడ్డాయి. తర్వాత హిజాబ్‌ను ప్రభుత్వం నిషేధించింది.
Also read: Weekly Current Affairs (National) Quiz: Which High Court has upheld the Hijab ban?
హైకోర్టు తీర్పు ఏమిచ్చిందంటే..?
ఇస్లాం ప్రకారం ముస్లిం బాలికలు హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదంటూ కర్నాటక హైకోర్టు మార్చి 15న సంచలన తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో ఉమ్మడి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్న ప్రభుత్వ జీవోను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రుతురాజ్ అవస్థీ, జస్టిస్ కృష్ణ, జస్టిస్ జేబున్నీసా ఎం.వాజీలతో కూడిన బెంచ్ సమర్థించింది.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP