Republic Day: కన్నుల పండువగా గణతంత్ర వేడుకలు.. ఆకట్టుకున్న శకటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు..

అత్యాధునిక క్షిపణులు, యుద్ధ విమానాల ప్రదర్శన, జవాన్ల కవాతు దేశమంతా గర్వంతో ఉప్పొంగేలా సాగాయి. ‘సశక్త్ ఔర్ సురక్షిత్’ పేరిట తొలిసారి ప్రదర్శించిన త్రివిధ దళాల ఉమ్మడి శకటం ఆకట్టుకుంది.
ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జనవరి 26వ తేదీ గణతంత్ర వేడుకలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో త్రివిధ దళాల సైనికులు ఆమెకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పరేడ్ ప్రారంభమైంది. మొదట లెఫ్టినెంట్ అహన్‌కుమార్ నేతృత్వంలో 61 కావల్రీ సైనిక బృందం ముందుకు సాగింది. జాట్ రెజిమెంట్, గర్వాల్ రైఫిల్స్, మహర్ రెజిమెంట్, జమ్మూకశ్మీర్ రైఫిల్స్ రెజిమెంట్ వంటి దళాల కవాతు ఆకట్టుకుంది.
దేశాభివృద్ధిని, ప్రజల సంక్షేమం, సాధికారతను కళ్లకు కడుతూ పలు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘స్వర్ణిమ్ భారత్: విరాసత్ ఔర్ వికాస్’ థీమ్‌తో 31 శకటాలను ప్రదర్శించారు. వైమానిక దళానికి చెందిన 40 యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలు ఆహూతులను అలరించాయి.
ఈ ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, త్రివిధ దళాధిపతులు, ప్రముఖుల పాల్గొన్నారు. ఇండొనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో కలిసి రాష్ట్రపతి సంప్రదాయ బగ్గీలో కర్తవ్యపథ్‌కు చేరుకున్నారు.
Republic Day 2025: 76వ గణతంత్ర వేడుకల్లో ప్రత్యేకతలు ఇవే.. ఈ ఏడాది థీమ్ ఇదే..
10 వేల మంది ప్రత్యేక అతిథులు
రిపబ్లిక్ డే పరేడ్‌కు ప్రముఖులు సహా 10 వేల మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. వీరిలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, విపత్తు సహాయక చర్యల సిబ్బంది, ఆశా వర్కర్లు, పారా ఒలింపిక్ అథ్లెట్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, కృషి సఖీలు, ఉద్యోగ్ సఖీలు తదితరులు ఉన్నారు. పలు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, రోడ్డు నిర్మాణ కార్మికులు, పేటెంట్ హోల్డర్లు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులను ఈసారి ప్రత్యేకంగా ఆహ్వానించారు. వీరంతా జాతీయ యుద్ధ స్మారకం, పీఎం సంగ్రహాలయ్ తదితర కట్టడాలను సైతం సందర్శించారు.
మోదీ తలపాగా..
గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ ఎరుపు, పసుపు రంగు గీతలతో కూడిన తలపాగా ‘సఫా’ను ధరించారు. దాంతోపాటు తెల్లరంగు కుర్తా–పైజామా, దానిపై ఊదారంగు బంద్‌గలా జాకెట్ ధరించారు. మోదీ ప్రతిఏటా స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర వేడుకల్లో రంగురంగుల తలపాగాలు ధరించడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది గణతంత్ర ఉత్సవాల్లో ఆయన బహుళ రంగులతో కూడిన బాంధానీ ప్రింట్ సఫా ధరించారు.
గూగుల్ డూడుల్
76వ గణతంత్ర వేడుకల సందర్భంగా గూగుల్ జనవరి 26వ తేదీ తీసుకొచ్చిన ప్రత్యేక డూడుల్ అందరినీ ఆకట్టుకుంది. లద్దాఖీ దుస్తులు ధరించిన మంచు చిరుత, ధోతీ–కుర్తా ధరించిన పులి వంటి జంతువులు ఇందులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ వాయిద్యాలను ఇవి వాయిస్తున్నట్లుగా ఈ డూడుల్‌ను రూపొందించారు. ఇది జంతువుల పరేడ్‌లా ఉందని చెప్పొచ్చు. అంతర్లీనంగా గూగుల్ అనే అక్షరాలు పొందుపర్చారు.
Republic Day: 942 మంది రక్షణ సిబ్బందికి శౌర్య పురస్కారాలు
విదేశాల్లోనూ ఉప్పొంగిన దేశభక్తి
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోనూ భారత గణతంత్ర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రవాస భారతీయులతోపాటు స్థానికులు వాటిలో ఉత్సాహంగా పాల్గొన్నారు. భారతీయులు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. భారతీయ నృత్యాలను ప్రదర్శించారు. నేపాల్, ఆ్రస్టేలియా, సింగపూర్, చైనా, శ్రీలంక, ఇజ్రాయెల్, జపాన్, ఇండొనేసియా, అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో రిపబ్లిక్ డే నిర్వహించారు. భారత రాయబార కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాలు ఎగురవేశారు.
సాయుధ శక్తి
దేశీయంగా అభివృద్ధి చేసిన షార్ట్–రేంజ్ టాక్టికల్ మిస్సైల్ ‘ప్రళయ్’, టీ–90 భీష్మా యుద్ధ ట్యాంక్, నాగ్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్ సూపర్‌సానిక్ క్రూయిజ్ మిస్సైల్, పినాక మల్టీ–లాంచర్ రాకెట్ సిస్టమ్, అగ్నిబన్ మల్టీ–బ్యారెల్ రాకెట్ లాంచర్, ఆకాశ్ ఆయుధ వ్యవస్థ వంటి వాటిని ప్రదర్శించారు. బజరంగ్ లైట్ స్పెషలిస్టు వాహనం, ఐరావత్ మోర్టర్ సిస్టమ్, నందిఘోష్, త్రిపురాంతక్ వాహనాలు సైతం దర్శనిమిచ్చాయి.
హైలైట్స్
- రాజ్యాంగానికి 75 ఏళ్లయిన సందర్భంగా వేడుకలు మరింత వైభవంగా జరిగాయి.
- గణతంత్ర వేడుకల్లో ఇండొనేసియా అధ్యక్షుడు పాల్గొనడం ఇది నాలుగోసారి. ఆ దేశ సైనిక బృందం కూడా పాలుపంచుకుంది.
- పరేడ్‌లో పరమ్‌వీర్ చక్ర అవార్డు గ్రహీతలు సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్, సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్, అశోక చక్ర అవార్డు గ్రహీత లెఫ్టినెంట్ కల్నల్ జస్‌రామ్ సింగ్ పాల్గొన్నారు.
కర్తవ్య పథ్‌పై.. మోదీ స్వచ్ఛభారత్
కర్తవ్యపథ్‌పై ప్రధాని మోదీ స్వచ్ఛభారత్ చేసి చూపించారు. జనవరి 26వ తేదీ జరిగిన గణతంత్ర వేడుకలు ఇందుకు వేదికయ్యాయి. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ను స్వాగతించేందుకు వెళ్తుండగా దారిలో చెత్త కన్పించింది. దాంతో వేడుకల్లో పాల్గొన్న వేలాదిమంది చూస్తుండగా ఆయన కిందకు వంగి దాన్ని ఏరారు. డస్ట్‌బిన్‌లో పడేయాల్సిందిగా సెక్యూరిటీ సిబ్బందికి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మోదీ చర్యను నెటిజన్లంతా ప్రశంసిస్తున్నారు.
సాయుధ శక్తిదేశీయంగా అభివృద్ధి చేసిన షార్ట్–రేంజ్ టాక్టికల్ మిస్సైల్ ‘ప్రళయ్’, టీ–90 భీష్మా యుద్ధ ట్యాంక్, నాగ్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్ సూపర్‌సానిక్ క్రూయిజ్ మిస్సైల్, పినాక మల్టీ–లాంచర్ రాకెట్ సిస్టమ్, అగ్నిబన్ మల్టీ–బ్యారెల్ రాకెట్ లాంచర్, ఆకాశ్ ఆయుధ వ్యవస్థ వంటి వాటిని ప్రదర్శించారు. బజరంగ్ లైట్ స్పెషలిస్టు వాహనం, ఐరావత్ మోర్టర్ సిస్టమ్, నందిఘోష్, త్రిపురాంతక్ వాహనాలు సైతం దర్శనిమిచ్చాయి.
Republic Day: గణతంత్ర పరేడ్‌లో తొలిసారి.. అలరించనున్న వ్యూహాత్మక క్షిపణి, యుద్ధ నిఘా వ్యవస్థ!