Suman Kumari Becomes BSF First Woman Sniper: మన దేశ తొలి మహిళా స్నైపర్‌గా సుమన్ కుమారి
800 మీటర్ల దూరం.. అంటే ముప్పావు కిలోమీటరు నుంచి కూడా గురి తప్పకుండా కాల్చే రైఫిళ్లు స్నైపర్లు. వీటిని ఉపయోగించే వారిని కూడా స్నైపర్లు అనే అంటారు. ఇంతకాలం మగవాళ్లే స్నైపర్లుగా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ సుమన్ కుమారి అత్యంత కఠినమైన శిక్షణ పొంది మన దేశ తొలి మహిళా స్నైపర్‌గా అర్హతను పొందింది.
1984 ‘ఆపరేషన్ బ్లూస్టార్’ తర్వాత రాజీవ్ గాంధీ హయాంలో 1988లో ‘ఆపరేషన్ బ్లాక్ థండర్’ పేరుతో స్వర్ణదేవాలయంలో మిగిలి ఉన్న సిక్కు వేర్పాటువాదులను ఏరివేసే మిలటరీ చర్య జరిగింది. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ సమయంలో ఇరువర్గాల్లోనూ ప్రాణనష్టం ఎక్కువ. కాని ‘ఆపరేషన్ బ్లాక్ థండర్’లో మిలటరీ సిబ్బంది ప్రాణనష్టం జరక్కుండా సిక్కు వేర్పాటువాదులను అణిచివేయగలిగారు. దీనికి కారణం స్వర్ణ దేవాలయాన్ని మారణాయుధాలతో పై నుంచి కాపలాకాస్తున్న ఐదుగురు వేర్పాటువాదులను చాలా దూరం నుంచి కాల్చి చంపడం. మొదటిసారి ‘స్నైపర్స్’ ఉపయోగం వల్ల కలిగిన ప్రయోజనం అది.
స్నైపర్ అంటే శత్రునిర్మూలన
ఏదో సినిమాలో ‘నన్ను చూడాలంటే నీ జీవితం సగం తగలడిపోయి ఉండాలి’ అని బ్రహ్మానందం అంటాడు. స్నైపర్ రంగంలో దిగాడంటే శత్రువు జీవితం ముగింపు దశలో ఉందని అర్థం. స్నైపర్లు శత్రువును బంధించడానికి కాదు. నిర్మూలించడానికి. మనదేశంలో ముందు నుంచి కూడా అత్యాధునిక ఆయుధాల పట్ల కాకుండా సంప్రదాయ ఆయుధాల పట్ల మొగ్గు ఉండటం వల్ల స్నైపర్లను ఆదరించింది లేదు.
కిలోమీటరు నుంచి ఒకటిన్నర కిలోమీటరు దూరం వరకూ కూడా శత్రువును కాల్చి చంపగల స్నైపర్ రైఫిల్స్‌ను ఎలా ఉపయోగించాలో తెలియడానికి ఆ కాలంలో మన మిటలరీ యోధులు ఇజ్రాయిల్, ఫ్రాన్స్ వెళ్లాల్సి వచ్చేది. 1980లలోనే కొద్దిగా స్నైపర్స్ ఉపయోగం తెలిసింది. ఇటీవల సరిహద్దుల వెంబడి వివిధ దేశాల దాడులను ప్రతిఘటించడానికి స్నైపర్లు సమర్థంగా ఉపయోగపడుతున్నాయని వాటిని ఉపయోగించే నిపుణులను తయారు చేస్తున్నారు. మధ్యప్రదేశ్– మహౌలోని ‘ఇన్‌ఫాంట్రీ స్కూల్’లో, ‘ఇండోర్‌లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్’ కేంద్రంలో స్నైపర్స్ శిక్షణ ఇస్తున్నారు. ఇంతవరకూ మగవాళ్లకే సాగిన ఈ శిక్షణ సుమన్ కుమారి వల్ల స్త్రీలకు కూడా ఇవ్వడం మొదలైంది.
పంజాబ్‌లో చూసి
హిమాచల్ ప్రదేశ్‌లో మండి జిల్లాకు చెందిన సుమన్ కుమారి 2021లో బి.ఎస్.ఎఫ్.లో ఇన్‌స్పెక్టర్ హోదాలో చేరింది. పంజాబ్‌లో ఆమెకు విధులు కేటాయించారు. అక్కడ ఉండగా సరిహద్దు దేశాల నుంచి శత్రువులు స్నైపర్లతో మనవారి మీద దాడులు చేయడం సుమన్ గమనించింది. మన వద్ద తగినంత మంది స్నైపర్లు లేరని కూడా అవగాహన చేసుకుంది. అంతే. తనకు తానే స్నైపర్‌గా శిక్షణ తీసుకునేందుకు అనుమతి అడిగింది. ‘సాధారణంగా స్నైపర్‌గా తీసుకునే శిక్షణ కఠినమైనది. మగవారే వెనకాడుతారు.
శిక్షణలో సగం మంది వెనుతిరుగుతారు. కాని సుమన్ 8 వారాల పాటు శిక్షణను సమర్థంగా పూర్తి చేసింది. 56 మంది ఉన్న బ్యాచ్‌లో ఆమె మాత్రమే మహిళ. శిక్షణ బాగా పూర్తి చేసిన వారిని ‘ఆల్ఫా’ అని, ‘బ్రేవో’ అని నైపుణ్యాన్ని బట్టి విభజిస్తాం. కాని సుమన్ ప్రతిభ అంతకు మించింది. అందుకే ఆమెకు ఇన్‌స్ట్రక్టర్ హోదా ఇచ్చాం. దాని అర్థం ఆమె స్నైపర్ మాత్రమే కాదు స్నైపర్ శిక్షకురాలు కూడా’ అని ఒక మిలటరీ అధికారి తెలియచేశారు.
ఎప్పుడెప్పుడు
హైజాక్‌లు, కిడ్నాప్‌లు, టెర్రరిస్ట్ అటాక్‌లు, ముఖ్య నేతలను బందీలుగా పట్టుకోవడం, సరిహద్దులు దాటి శత్రువులు రావడం వంటి సందర్భాలలో స్నైపర్లు రంగంలో దిగుతారు. పరిసరాలకు తగినట్టుగా పై తొడుగులు (కామూఫ్లాజ్) ధరించి శత్రువుకు వీలైనంత దగ్గరగా వెళ్లి తూటాతో సమాధానం చెప్పడమే వీరు చేసేపని. సుమన్ సేవలు ఇకపై దేశానికి రక్షణ ఇస్తాయి. ‘నేను స్నైపర్ కావడం స్త్రీలకు స్ఫూర్తినిస్తుందనే అనుకుంటున్నాను. మిలటరీలోకి మరింతమంది మహిళలు రావాలని కోరుకుంటున్నాను’ అందామె.
BSF is truly becoming an inclusive Force where #ladies are taking rapid strides everywhere. In a step in this direction, after rigorous training, #BSF has got the First #Mahila Sniper. pic.twitter.com/S80CUo0eKz
— BSF CSWT INDORE (@BSF_CSWT) March 2, 2024