Vande Bharat Sleeper Train: పట్టాలెక్కనున్న ‘స్లీపర్ వందే భారత్’.. తొలిసారి పరుగులు తీసే రూట్ ఇదే..!
ప్రస్తుతం 41 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో 39 రైళ్లు ట్రాక్‌పై నడుస్తుండగా, రెండు రైళ్లు రిజర్వ్‌లో ఉన్నాయి. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లన్నీ చైర్ కార్ సౌకర్యం కలిగినవి. అంటే వీటిలో కూర్చుని ప్రయాణించవచ్చు. రాబోయే రోజుల్లో ‘వందే భారత్’ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.
‘స్లీపర్ వందే భారత్’ రైళ్లలో మరింత సౌకర్యవంతమైన ఏర్పాట్లు ఉన్నాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లు చాలా దూరం వరకూ ప్రయాణిస్తాయి. ఇవి రాత్రిపూట నడుస్తాయి. ఇందులో ప్రయాణికులు నిద్రిస్తూనే ప్రయాణం సాగించవచ్చు. రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలోని ప్రధాన మార్గాలైన ఢిల్లీ-హౌరా, ఢిల్లీ-ముంబై మధ్య మొదటి వందే భారత్ స్లీపర్ రైలును నడిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రూట్లలో సాధారణంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఏకకాలంలో ఈ రెండు మార్గాల్లో నడపపనున్నారని తెలుస్తోంది.
ఈ రెండు మార్గాలే కాకుండా, ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-చెన్నై, ఢిల్లీ-గౌహతి, ఢిల్లీ-భువనేశ్వర్, ఢిల్లీ-పాట్నా రూట్లలో 10 ‘స్లీపర్ వందే భారత్’ రైళ్లు నడవనున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మొదటి స్లీపర్ వందే భారత్ రైలును ఐసీఎఫ్ చెన్నై తయారు చేయనుంది. దీని స్లీపర్ కోచ్ రాజధాని, ఇతర ప్రీమియం రైళ్లకు కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో ఒక్కో కోచ్‌లో నాలుగు టాయిలెట్లకు బదులుగా మూడు టాయిలెట్లు ఉంటాయి. దీనితో పాటు మినీ ప్యాంట్రీ కూడా ఉంటుంది. స్లీపర్ వందే భారత్ రైలులో మొత్తం 823 బెర్త్‌లు ఉంటాయి. ఇందులో ప్రయాణికులకు 823 బెర్త్‌లు, రైల్వే సిబ్బందికి 34 బెర్త్‌లు ఉంటాయి.