Skip to main content

Chinese Troops: భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు చైనా ప్ర‌య‌త్నం

‘‘అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్లో యాంగ్‌ట్సే ప్రాంతం వద్ద వాస్తవాదీన రేఖను దాటేందుకు, తద్వారా యథాతథ స్థితిని మార్చేందుకు డిసెంబర్‌ 9న చైనా సైన్యం ప్రయత్నించింది. వాటన్నింటినీ మన సైనికులు చాలా గట్టిగా తిప్పికొట్టారు. మన సైనిక కమాండర్లు సకాలంలో స్పందించడంతో చైనా సైన్యం తోక ముడిచింది’’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు.
కొద్ది రోజులుగా తవాంగ్‌ వద్ద భారత సైన్యం మోహరింపులు (ఎరుపు రంగు గీతలున్న ప్రాంతాల్లో)

డిసెంబ‌ర్ 13న పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆయన వేర్వేరుగా ప్రకటన చేశారు. ‘‘ఈ ఘర్షణ ఇరు సైనికుల నడుమ భౌతిక పోరుకూ దారి తీసింది. మనవాళ్లు వీరోచితంగా పోరాడారు. మన భూభాగాల్లోకి చొచ్చుకొచ్చేందుకు చైనా సైన్యం చేసిన ప్రయత్నాలను వమ్ము చేసి వారిని తరిమికొట్టారు’’ అని వివరించారు.  ఈ ప్రయత్నంలో మనవైపు ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదని, కొందరు సైనికులు స్వల్పంగా గాయపడ్డార‌ని స్పష్టం చేశారు. ‘‘ఈ ఘటన తర్వాత మన స్థానిక సైనిక కమాండర్, చైనా కమాండర్‌ మధ్య డిసెంబర్‌ 11న ఫ్లాగ్‌ మీటింగ్‌ జరిగింది. దీనిపై మన ఆగ్రహాన్ని, అభ్యంతరాలను దౌత్య మార్గాల్లో కూడా చైనాకు తెలియజేశాం. ఇలాంటి దుందుడుకు చర్యలను పునరావృతం చేయొద్దని, సరిహద్దుల వెంబడి శాంతి, సామరస్యాలను కాపాడాలని గట్టిగా చెప్పాం’’ అని వెల్లడించారు. ‘‘మన భూభాగాన్ని ఆక్రమించేందుకు జరిగే ఎలాంటి ప్రయత్నాలనైనా పూర్తిగా తిప్పికొట్టేందుకు, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు సైన్యం నిత్యం సన్నద్ధంగా ఉంది. సభకు ఈ మేరకు హామీ ఇస్తున్నా’’ అని చెప్పారు. అంతకుముందు తాజా పరిస్థితిపై సీడీఎస్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్, త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్‌ సమీక్ష జరిపారు. 

Nirmala Sitharaman: ‘ఫోర్బ్స్‌’ శక్తివంతమైన మహిళ నిర్మలా సీతారామన్‌
భారత సైనికులు అడ్డుకున్నందుకే.. తవాంగ్‌ రగడ: చైనా సైన్యం  

‘గల్వాన్‌ లోయ’ చేదు అనుభవం నేపథ్యంలో తవాంగ్‌ రగడపై చైనా ప్రభుత్వ ఆచితూచి స్పందించగా సైన్యం మాత్రం తెంపరి వ్యాఖ్యలకు దిగింది! సరిహద్దుల వెంబడి పరిస్థితి నిలకడగా ఉందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ మంగళవారం వ్యాఖ్యానించారు. ‘‘భారత దళాలే అక్రమంగా ఎల్‌ఓసీ దాటాయి. చైనా వైపు డాంగ్‌జాంగ్‌ ప్రాంతంలో గస్తీ విధుల్లో ఉన్న మా సైనికులను అడ్డుకున్నాయి. అది డిసెంబర్‌ 9 రగడకు దారి తీసింది’’ అని చైనీస్‌ పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) వెస్టర్న్‌ థియేటర్‌ కమాండ్‌ అధికార ప్రతినిధి కల్నల్‌ లోంగ్‌ షోహువా ఆరోపించారు.  
గల్వాన్‌ తరహా ఘర్షణ 
• డిసెంబర్‌ 9 నాటి చైనా ఆక్రమణ యత్నం మరోసారి రెండేళ్లనాటి ‘గల్వాన్‌ లోయ’ ఉదంతాన్ని తలపించింది. విశ్వసనీయ సమాచారం మేరకు... చైనా సైనికులు అచ్చం అప్పటి మాదిరిగానే ఇనుప ముళ్లతో కూడిన లావుపాటి ఆయుధాలు, కర్రల వంటివాటితో దాడికి దిగారు. అప్పట్లాగే పరిస్థితి మరోసారి బాహాబాహీకి కూడా దారితీసింది. 
• తవాంగ్‌ పరిసరాల్లో యాంగ్‌ట్సే వద్ద 17 వేల అడుగుల పై చిలుకు ఎత్తున్న మంచు శిఖరాలపై పట్టు కోసం చైనా ఎప్పట్నుంచో ప్రయతి్నస్తోంది. అందులో భాగంగానే దాదాపు రెండేళ్ల అనంతరం మరోసారి మన భూభాగాల్లోకి సైలెంటుగా చొచ్చుకొచ్చేందుకు డిసెంబర్‌ 9న దొంగ ప్రయత్నం చేసింది. 
• అయితే అక్కడ ఎటు చూసినా మన సైన్యం భారీగా మోహరించిన తీరుతో చైనా దళాలు అవాక్కైనట్టు సమాచారం. వాటి చొరబాటు యత్నాలను మనవాళ్లు దీటుగా అడ్డుకోవడమే గాక పూర్తిస్థాయిలో తరిమి కొట్టారు. 
• ఆ ప్రాంతంలో భారత సైన్యపు మోహరింపులు హై రిజల్యూషన్‌ కెమెరాలతో తీసిన ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కన్పిస్తున్నాయి. 

Indian Railways: 2025–26 నాటికి వందేభారత్‌ రైళ్ల ఎగుమతి!
• 2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్‌ సమీపంలోని గల్వాన్‌ లోయ వద్ద చైనా, భారత దళాల మధ్య జరిగిన భీకర పోరు జరగడం తెలిసిందే. దానివల్ల ఇరుదేశాల సంబంధాలు బాగా క్షీణించాయి. 
• అప్పటినుంచి తూర్పు ప్రాంతంలో వాస్తవాదీన రేఖ వద్ద మోహరింపులను, యుద్ధ సన్నద్ధతను సైన్యం బాగా పెంచింది. నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. 
• ఆ తర్వాత ఇరు దేశాల మధ్య చోటుచేసుకున్న పెద్ద ఘర్షణ ఇదే. ఈ దురాక్రమణ యత్నంలో చైనా వైపు చాలామంది సైనికులు గాయపడ్డట్టు  సమాచారం. 
• 2012 అక్టోబర్లో కూడా యాంగ్‌ట్సే ప్రాంతంలోనే భారత, చైనా సైనికుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. 
• కొంతకాలంగా ఈ ప్రాంతంలో చైనా డ్రోన్ల హడావుడి బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజా రగడకు ముందే మన యుద్ధ విమానాలు తవాంగ్‌ పరిసరాల్లో గస్తీ కాయడం, డేగ కళ్లతో నిఘా వేయడం మొదలైంది. 
• దాదాపు 3,500 కిలోమీటర్ల పొడవైన నియంత్రణ రేఖ పొడవునా పరిస్థితిపై, దళాల సన్నద్ధతపై త్రివిధ దళాధిపతులు సమీక్ష జరిపారు. 

Assembly Elections: గుజరాత్‌లో వరుసగా ఏడోసారి బీజేపీ గెలుపు
 

Published date : 14 Dec 2022 12:03PM

Photo Stories