ఎన్‌హెచ్ నిర్మాణాల్లో ఏపీ టాప్
- 2022–23లో అత్యధికంగా 845 కి.మీ. నిర్మాణం
- ఆర్‌అండ్‌బీ ద్వారా ఎన్‌హెచ్‌లనిర్మాణంలోనూ రికార్డు
- నాలుగేళ్లలో రూ.23,471.92 కోట్లు నిధులు రాబట్టిన రాష్ట్ర ప్రభుత్వం
- టీడీపీ ఐదేళ్లలో సాధించింది కేవలం రూ.10,661 కోట్లే..
జాతీయ రహదారుల నిర్మాణంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మరోసారి తన సత్తాను చాటింది. 2022–23లో జాతీయ రహదారుల నిర్మాణంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపింది. ఈ మేరకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) నివేదిక వెల్లడించింది. కేంద్ర జాతీయ రహదారుల శాఖ నిధులతో రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ చేపట్టే రహదారుల నిర్మాణంలోనూ దేశంలో ఏపీ రెండోస్థానంలో నిలిచింది.
తద్వారా ఎన్‌హెచ్‌ఏఐ రహదారుల నిర్మాణంలో, కేంద్రం నిధులతో ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యాన రోడ్ల నిర్మాణంలోనూ ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. రోడ్ల నిర్మాణాలకు గరిష్టంగా నిధులు రాబట్టడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాధించిన విజయానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. - సాక్షి, అమరావతి
ఆర్‌అండ్‌బీ ద్వారా నిర్మాణాల్లోనూ రెండోస్థానం
కేంద్ర జాతీయ రహదారులు, రవాణా శాఖ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే రహదారుల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సమర్థతను నిరూపించుకుంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి వరుసగా నాలుగో ఏడాది కూడా కేంద్రం నుంచి రికార్డు స్థాయిలో నిధులను సాధించింది. 2022–23 వార్షిక ప్రణాళికలో రాష్ట్రానికి రూ.12,130 కోట్లు రాబట్టింది. కేంద్ర ప్రభుత్వం ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వార్షిక ప్రణాళిక కింద ఆమోదించిన నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రహదారుల ప్రాజెక్టులను పరిశీలిస్తుంది.
చదవండి: ఇవి ఇళ్ల పట్టాలు మాత్రమే కాదు.. సామాజిక న్యాయ పత్రాలు: సీఎం జగన్
రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి చెందితేనే ఆ మేరకు ఆర్థిక సంవత్సరం ఆఖరులో నిధులు మంజూరు చేస్తుంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వ పనితీరుతో పూర్తి సంతృప్తి చెందినందున రికార్డు స్థాయిలో వార్షిక ప్రణాళిక నిధులను కేంద్రం మంజూరు చేసింది. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌కే నిధులు మంజూరు చేయడం విశేషం.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో 2014–19 వరకు భాగస్వామిగా ఉన్నప్పటికీ నాటి టీడీపీ ప్రభుత్వం పెద్దగా నిధులు రాబట్టలేకపోయింది. ఐదేళ్లలో టీడీపీ సర్కారు కేవలం రూ.10,661 కోట్లు మాత్రమే తీసుకువచ్చింది. కానీ, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కానప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ రహదారుల నిర్మాణానికి రికార్డుస్థాయిలో నిధులు తీసుకురావడం విశేషం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒక్క 2022–23లోనే రూ.12,130 కోట్లు సాధించింది. మొత్తం నాలుగేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ.23,471.92 కోట్లు సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
చదవండి: వేగంగా బల్క్ డ్రగ్ పార్క్ పనులు
2019 జూన్ నాటికి రాష్ట్రంలో 6,861.68 కి.మీ.మేర జాతీయ రహదారులు ఉండేవి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా 1,302.04 కి.మీ. మేర జాతీయ రహదారులను నిర్మించింది. దాంతో 2023 మార్చి నాటికి రాష్ట్రంలో 8,163.72 కి.మీ.మేర జాతీయ రహదారులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పారిశ్రామిక, తీర ప్రాంతాలు, ఎకనావిుక్ జోన్లు, పర్యాటక ప్రదేశాలను అనుసంధానిస్తూ రహదారుల అభివృద్ధి జోరందుకుంది.
బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా మిన్నగా...
ఎన్‌హెచ్‌ఏఐ 2022–23లో దేశవ్యాప్తంగా 6,003 కి.మీ. మేర రహదారులను నిర్మించింది. అందులో అత్యధికంగా 845 కి.మీ.మేర జాతీయ రహదారుల నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ (740 కి.మీ.), మూడో స్థానంలో మధ్యప్రదేశ్ (524 కి.మీ.), నాలుగో స్థానంలో జార్ఖండ్ (442 కి.మీ.), ఐదో స్థానంలో కర్ణాటక (419 కి.మీ.) నిలిచాయి.
బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా జాతీయ రహదారులను నిర్మించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో కొత్త జాతీయ రహదారుల్లో 56శాతం హైబ్రీడ్ యాన్యుటీ విధానం (హెచ్‌ఏఎం)లో, ఈపీసీ విధానంలో 35శాతం, ఐటం రేట్ విధానంలో 8శాతం, బీవోటీ విధానంలో ఒక శాతం నిర్మించినట్లు ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది. ఇక ప్రా జెక్టు నిర్మాణ విలువలో కూడా అత్యధికంగా 68 శాతంతో హెచ్‌ఏఎం విధానంలోనే నిర్మించారు.