వేగంగా బల్క్ డ్రగ్ పార్క్ పనులు
- ఏపీ బల్క్ డ్రగ్ ఇన్‌ఫ్రా కార్పొరేషన్ పేరుతో ప్రత్యేక కంపెనీ ఏర్పాటు
- బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా పీఎంసీ
- కాకినాడ సమీపంలో రూ.వెయ్యి కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు
- 16 రాష్ట్రాలతో పోటీపడి టెండర్ దక్కించుకున్న ఏపీ
- రూ.14,340 కోట్ల పెట్టుబడులు, 30 వేల మందికి ఉపాధి
సాక్షి, అమరావతి: కాకినాడ సమీపంలోని తొండంగి మండలం కేపీ పురం–కోదండ గ్రామాల మధ్య బల్క్ డ్రగ్ పార్క్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 16 రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్ దక్కించుకున్న ఈ పార్క్‌ను 2,000.23 ఎకరాల్లో నెలకొల్పేందుకు ఏపీఐఐసీ ఏపీ బల్క్ డ్రగ్ ఇన్‌ఫ్రా కార్పొరేషన్ పేరుతో అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌ను ఏర్పాటు చేస్తోంది.
ఇందుకోసం ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచింది. ఆసక్తి గల సంస్థలు జూన్ 8లోగా బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ముడిసరుకు దిగుమతుల్ని తగ్గించుకునే లక్ష్యంతో చైనా నుంచి ఫార్మా ముడి పదార్థాల దిగుమతులను తగ్గించుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మూడు బల్క్ డ్రగ్ పార్క్‌ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. అందులో ఒకటి మన రాష్ట్రంలో ఏర్పాటవుతోంది. ఈ బల్క్ డ్రగ్ పార్క్ అభివృద్ధికి రూ.1,500 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తుండగా.. మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా రూ.1,000 కోట్ల వరకు ఇవ్వనుంది.
ఇవి ఇళ్ల పట్టాలు మాత్రమే కాదు.. సామాజిక న్యాయ పత్రాలు: సీఎం జగన్
ఈ బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా కాకినాడ ఫార్మా హబ్‌గా తయారు కావడమే కాకుండా సుమారు రూ.14,340 కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని అంచనా. అలాగే ఈ పార్క్‌ద్వారా 30,000 మందికి ప్రత్యక్షంగా, 40,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా. ప్రస్తుతం రాష్ట్రంలోని 200కుపైగా ఫార్మా యూనిట్లు ఉంటే ఇప్పుడు ఈ ఒక్క పార్క్ ద్వారానే 100కు పైగా యూనిట్లు అదనంగా రావచ్చని బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (బీడీఎంఏ) ప్రతినిధులు అంచనా వేస్తున్నారు.