Human Skeletons: పంజాబ్ బావిలోని పుర్రెలు ఏ ప్రాంత ప్రజలవని తేలింది?
160 ఏళ్ల మిస్టరీ వీడిపోయింది. పంజాబ్ రాష్ట్రం, అమృత్‌సర్ జిల్లాలోని అజ్‌నాలా పట్టణంలోని ఓ పాడుబడ్డ బావిలో బయటపడ్డ 246 పుర్రెలు ఎవరివో తేలిపోయింది. ఎనిమిదేళ్ల క్రితం అంటే 2014లో అజ్‌నాలా పట్టణంలోని ఓ పాడుబడ్డ బావిలో పెద్ద ఎత్తున బయటపడ్డ మానవ కపాలాలు గంగా నదీ పరీవాహక ప్రాంత ప్రజలవని హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) ప్రకటించింది. ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం ఈ పుర్రెలు పంజాబ్, పాకిస్తాన్ ప్రాంతాల ప్రజలకు చెందినవి కానే కాదని, వీటి డీఎన్‌ఏ.. ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ ప్రజల డీఎన్‌ఏతో సరిపోలుతోందని పరిశోధకులు వివరించారు.
డీఎన్‌ఏను పరిశీలించగా..
- ఇప్పటివరకూ ఈ కపాలాలు 1857 నాటి తిరుగుబాటులో బ్రిటిషర్ల చేతిలో హతమైన సిపాయిలవని, కొందరు చరిత్రకారులు చెబుతుండగా.. మరికొందరు 1947 నాటి దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో మరణించిన వారివి కావచ్చనని అంచనా వేశారు. అయితే ఇప్పటివరకు ఏదీ నిర్ధారణ కాలేదు.
- పంజాబ్ యూనివర్సిటీకి చెందిన మానవ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సెహ్రావత్.. సీసీఎంబీ, లక్నోలోని బీర్బల్ సాహ్నీ ఇన్‌స్టిట్యూట్, బెనారస్ హిందూ యూనివర్సిటీలతో కలిసి ఈ పుర్రెల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే సీసీఎంబీ పుర్రెల నుంచి డీఎన్‌ఏను వెలికితీసి పరిశీలించగా.. మరణించిన వారు గంగా నదీ ప్రాంతానికి చెందిన వారని స్పష్టమైంది. ఫ్రాంటియర్స్ ఆఫ్ జెనిటిక్స్ జర్నల్‌లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి.
బెంగాల్ నేటివ్ ఇన్‌ఫాంట్రీ బెటాలియన్ సైనికులవి!
- తాజా పరిశోధన ఫలితాలు చారిత్రక ఆధారాలతోనూ సరిపోతున్నాయి. ఎందుకంటే.. 26వ బెంగాల్ నేటివ్ ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌లో బెంగాల్ తూర్పు ప్రాంతపు ప్రజలతో పాటు ఒడిశా, బిహార్, ఉత్తర ప్రదేశ్‌లకు చెందిన వారూ ఉండేవారని చరిత్ర చెబుతోంది.
- చారిత్రక ఆధారాల ప్రకారం.. ఆ బెటాలియన్‌కు చెందిన సైనికులను ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతంలోని మియాన్ మీర్ ప్రాంతంలో నియమించారు. బ్రిటిష్ అధికారులపై తిరుగుబాటు చేసిన వీరు కొందరిని హతమార్చారు కూడా. అయితే ఆ తరువాతి కాలంలో బ్రిటిష్ అధికారులు వీరిని అజ్‌నాలా సమీపంలో బంధించి చంపివేసినట్లు చరిత్ర చెబుతోంది.
National Language: దేశ జనాభాలో ఎంత శాతం మందికి హిందీ మాతృభాష?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అజ్‌నాలా పట్టణంలోని ఓ పాడుబడ్డ బావిలో బయటపడ్డ 246 పుర్రెలు గంగా నదీ పరీవాహక ప్రాంత ప్రజలవి
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)
ఎక్కడ : అజ్‌నాలా, అమృత్‌సర్ జిల్లా, పంజాబ్ రాష్ట్రం
ఎందుకు : వీటి డీఎన్‌ఏ.. ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ ప్రజల డీఎన్‌ఏతో సరిపోలుతోందని..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్