Skip to main content

COP-27 conference: భూతాపం ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది.. దేశాలన్నీ సహకరించుకోకపోతే వినాశనమే: గుటేరస్‌

షెర్మ్‌–ఎల్‌–షేక్‌: ప్రపంచ దేశాలన్నీ పరస్పరం సహకరించుకోకపోతే వినాశనం తప్పదని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటేరస్‌ హెచ్చరించారు. నరక కూపం దిశగా ప్రపంచ పయనం సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులను నియంత్రించకపోతే ఊహించని ఉత్పాతాలు తప్పవని పేర్కొన్నారు.
UN chief warns at Cop27 summit
UN chief warns at Cop27 summit

కాలుష్య ఉద్గారాల విషయంలో అతిపెద్ద దేశాలైన చైనా, అమెరికా ఇకనైనా కళ్లు తెరవాలని, రాబోయే దుష్పరిణామాలను నివారించడానికి కలిసికట్టుగా పనిచేయాలని హితవు పలికారు. ఈజిప్ట్ లోని షెర్మ్‌–ఎల్‌–షేక్‌లో నవంబర్ 7న కాప్‌–27 సదస్సులో వివిధ దేశాల నేతలు, ప్రతినిధులను ఉద్దేశించి గుటేరస్‌ ప్రసంగించారు. భూతాపం ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని చెప్పారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయని, కరువులు, వరదలు మానవాళికి పెనుసవాళ్లు విసురుతున్నాయని గుర్తుచేశారు. కర్బన ఉద్గారాలను తగ్గించుకొనేలా ధనిక, పేద దేశాలు ఒక కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలని చెప్పారు. ధనిక దేశాలు 2030 నాటికి, ఇతర దేశాలకు 2040 నాటికి బొగ్గు వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని గుటేరస్‌ కోరారు.  

Also read: WHO Latest Report: శారీరక శ్రమ లోపిస్తే రూ.25 లక్షల కోట్ల నష్టం

మనకున్న సమయం పరిమితం  
వాతావరణ మార్పులకు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిన సమయం వచ్చిందని ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా అల్‌–సిసీ ఉద్ఘాటించారు. మనం జోక్యం చేసుకోకపోతే వాతావరణ మార్పులు ఎప్పటికీ ఆగవని అన్నారు. సమయం పరిమితంగానే ఉందని, ప్రతి సెకెన్‌ కాలాన్ని వాడుకోవాలని సూచించారు. యుద్ధాన్ని ఆపాలని రష్యా, ఉక్రెయిన్‌కు విజ్ఞప్తి చేశారు. వాతావరణ మార్పుల వల్ల నష్టపోతున్న పేద దేశాలకు ధనిక దేశాలకు ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలని నైజీరియా పర్యావరణశాఖ మంత్రి మొహమ్మద్‌ అబ్దుల్లాహీ కోరారు. ఇందుకోసం క్లైమేట్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలన్నారు.   

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 08 Nov 2022 03:09PM

Photo Stories