Skip to main content

Sri Lanka Economic Crisis: లంక మంటలకు కారణాలేమిటి?

Sri Lanka Economic Crisis reasons, ukraine war, covid effects
Sri Lanka Economic Crisis reasons, ukraine war, covid effects

ద్వీపదేశం శ్రీలంకలో ప్రజలు నిత్యావసరాల కోసం గంటల తరబడి బారులు తీరాల్సి వస్తోంది. దశాబ్దాలుగా తీసుకున్న నిర్ణయాలు ఆ చిన్న దేశాన్ని పెద్ద సంక్షోభం లోకి నెట్టేశాయి. వీటికితోడు ఎకాఎకీ సేంద్రీయ వ్యవసాయంలోకి మరలడం, హింసాకాండ వల్ల పర్యాటక రంగం దెబ్బతినడం, కోవిడ్‌ మహమ్మారి పంజా విసరడం, ఇంకా ముఖ్యంగా ఉక్రెయిన్‌ యుద్ధం, ఫలితంగా పెరిగిన చమురు ధరలు ఆ దేశం మీద తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దాంతో నిసర్గ ప్రకృతి సౌందర్యానికి పేరున్న దేశం నిరసనలతో దద్దరిల్లుతోంది. ఇండియా, చైనా, ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌ చేస్తున్న సాయంతో ప్రస్తుతానికి లంక గట్టెక్కవచ్చు. కానీ తన విధానాలను సరిదిద్దుకుంటేనే అంతిమ పరిష్కారం లభిస్తుంది.

శ్రీలంకను మళ్లీ కల్లోల పరిస్థితులు చుట్టు ముట్టాయి. దేశ మంత్రివర్గం సామూహికంగా రాజీనామా చేసింది. ఇంధనం, ఆహార ధాన్యాలకు కొరత ఏర్పడ టంతో ప్రజా నిరసనలు మిన్నుముట్టాయి. దీంతో దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స అత్యవసర పరిస్థితి ప్రకటించారు. తిరిగి తొలగిం చారు. నిత్యావసర వస్తువులను దిగుమతి చేసుకోవడానికి కూడా విదేశీ మారక ద్రవ్యం తగినంతగా లేకపోవడంతో ప్రజలు తమకు కావలసిన వాటిని పొందడానికి  గంటలపాటు  క్యూలలో నిల్చోవాల్సి వస్తోంది. పైగా గంటలపాటు విద్యుత్‌ కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

Economic Crisis in Sri Lanka: శ్రీలంకలో ఆకలి కేకలు!

శ్రీలంక జనాభా 2.2 కోట్లు. నిసర్గ ప్రకృతి సౌందర్యంతో మెరిసే ఈ దేశం దశాబ్దాలపాటు కొనసాగిన అంతర్యుద్ధంలో 2009లో సైనిక విజయం పొందిన తర్వాత సాపేక్షంగా శాంతిని అనుభవించింది. అంతర్యుద్ధం చివరి సంవత్సరాల్లోనూ, ఆ తర్వాతా భారీగా రుణాలు తీసుకొంది. దేశ ఆర్థిక ప్రగతిని ప్రోత్సహించడానికి విదేశీ పెట్టుబడు లను తీసుకురావడంలో తనదైన మార్గంలో ప్రయాణించింది. ఆ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంది. ఒక దశాబ్ద కాలంలో దేశ స్థూల ఉత్పత్తి దాదాపు మూడు రెట్లు పెరిగింది. దీంతో 2019లో శ్రీలంకను ఎగువ మధ్య ఆదాయ స్థితిని సాధించిన దేశంగా ప్రపంచబ్యాంకు కూడా మంచి ర్యాంకునిచ్చి కొనియాడింది.

కరిగిపోయిన విదేశీ మారక నిల్వలు

అయినా సరే స్వావలంబన లేని ఈ ఆర్థిక అద్భుతం చాలా కాలం కొనసాగలేదు. స్థూల దేశీయ ఉత్పత్తికి లాగే శ్రీలంక తీసుకున్న విదేశీ రుణాలు కూడా మూడురెట్లు పెరిగాయి. దీని ఫలితంగా ఎగువ మధ్య ఆదాయ దేశంగా శ్రీలంక సాధించిన విశిష్టమైన హోదా ఒకే ఒక్క సంవత్సరంతో గాల్లో కలిసిపోయింది. చాలా మీడియా సంస్థలు శ్రీలంకను రుణ ఊబిలో చిక్కుకున్న బాధితురాలిగా నివేదించాయి. అయితే దేశ ఆర్థిక సమస్యలు మరింత లోతైనవీ, బహుముఖీనమైనవీ. శ్రీలంక ప్రభుత్వ రుణాల్లో 14 శాతం వరకు చైనా నుంచి తీసుకున్నవే. కాగా అంతర్జాతీయ పెట్టుబడి మార్కెట్‌ వాటా 36 శాతంగా ఉంది.

అన్నిటికంటే మించిన సమస్య ఏమిటంటే శ్రీలంక ఆర్థిక వ్యవస్థ దశాబ్దాలుగా ఆర్థిక అవకతవకల సంక్షోభంలో కూరుకుపోయింది. ఎలాంటి ఆర్థిక క్రమశిక్షణా పాటించకుండానే లంక ప్రభుత్వాలు వరుసగా రుణాల మీద రుణాలను తీసుకుంటూ దేశాన్ని అప్పుల ఊబిలోకి దింపేశాయి. లంక విదేశీ రుణం 51 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. పైగా వడ్డీలు చెల్లించడానికి ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 7 బిలియన్‌ డాలర్లు అవసరం అవుతాయి. గత రెండేళ్ల కాలంలో దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు దాదాపుగా 70 శాతం వరకు కరిగిపోయాయి. ఇప్పుడు శ్రీలంక విదేశీ మారక ద్రవ్యం కేవలం 2 బిలియన్‌ డాలర్లలోపు ఉంటోందంటే ఆ దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితిని సులభంగా అర్థం చేసుకోవచ్చు.

The Hunger Virus Multiplies: ఆకలి.. ప్రతి నిమిషానికి 11 మంది బలి!

గత 15 సంవత్సరాలుగా శ్రీలంకలో కొనసాగుతూ వచ్చిన ఆర్థిక అవకతవకలు ప్రామాణికమైన ఆర్థిక సమస్యకు దారితీశాయి. అదేమి టంటే శ్రీలంక తన రాబడికి మించి ఖర్చుపెడుతూ వచ్చింది. పెరుగు తున్న లోటును సర్దుబాటు చేసుకోవడానికి అవసరమైన సరుకులు, సేవల ఉత్పత్తి కూడా లంకకు సాధ్యపడలేదు. ఇటీవలి సంవత్సరాల్లో జరిగిన కొన్ని ఘటనలు ఈ వ్యవస్థీకృత ఆర్థిక సమస్యను మరింత విస్తృతం చేశాయి. కొన్ని బాహ్య కారణాలు కాగా, మరికొన్ని ప్రభుత్వ స్వయంకృతాపరాధం అనే చెప్పాలి.

కుప్పకూలిన పర్యాటకం

శ్రీలంక పర్యాటక పరిశ్రమ చాలా పెద్దది. దేశ ఆర్థిక వ్యవస్థకు 5 బిలియన్‌ డాలర్ల మేరకు పర్యాటక పరిశ్రమే దోహదం చేస్తోంది. 2018 సంవత్సరంలో శ్రీలంకను 20 లక్షలమంది పర్యాటకులు సందర్శిం చారు. 2019లో శ్రీలంక రాజధాని కొలంబోలో అత్యంత సమన్వ యంతో జరిగిన బాంబు దాడుల్లో 200 మంది ప్రజలు చనిపోయారు. దీంతో శ్రీలంకకు విదేశీ పర్యాటకుల రాక గణనీయంగా తగ్గి పోయింది. ఆనాటి నుంచి పర్యాటక పరిశ్రమ పూర్తిగా కోలుకోలేదు. పైగా గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి తన వంతు పాత్ర పోషిం చింది. కోవిడ్‌–19 కారణంగా విదేశాల్లో పనిచేస్తున్న శ్రీలంక ప్రవా సుల నుంచి, వలస కార్మికుల నుంచి దేశం అందుకుంటున్న ‘రెమి టెన్స్‌ డబ్బు’ చాలావరకు తగ్గిపోయింది.

Explained:: కప్పు టీ రూ.100, లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 280..

​​​​​​​శ్రీలంక ఆర్థిక కష్టాలకు ఉక్రెయిన్‌ యుద్ధం కూడా తోడయింది. అంతర్జాతీయ చమురు ధరలు పెరిగిపోవడంతో శ్రీలంకపై మరింతగా భారం పడింది. రష్యా నుంచి, ఉక్రెయిన్‌ నుంచి భారీ పరిమాణంలో ఆహార పదార్థాలను శ్రీలంక దిగుమతి చేసుకుంటోంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా లంకలో ఆర్థిక, ఆహార సంక్షోభం మరింతగా పెరిగింది. పైగా, శ్రీలంకను సందర్శిస్తూ వచ్చిన రష్యన్‌ పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది.

ఆర్థిక సంక్షోభానికి తోడు 2019లో లంక ప్రభుత్వం భారీగా పన్ను రాయితీలను ఇవ్వడం పరిస్థితిని మరింత విషమింప జేసింది. 2021లో దేశవ్యాప్తంగా రసాయనిక ఎరువులను నిషేధించాలని నిర్ణయించడంతో దేశంలో వరి, టీ ఉత్పత్తులు చాలావరకు పడి పోయాయి. తర్వాత ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారనుకోండి! శ్రీలంకలో ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభానికి విదేశీ రుణం, మహమ్మారి కొంత దోహదం చేసి ఉండవచ్చు కానీ పేలవమైన ఆర్థిక, ద్రవ్యపరమైన నిర్ణయాలే శ్రీలంక సంక్షోభానికి మూల కారణం అని చెప్పాలి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నుంచి ఆర్థిక సహాయం కోర కూడదని శ్రీలంక ప్రభుత్వం చాలాకాలం స్థిర నిర్ణయంతో ఉండింది. ఎందుకంటే ఐఎంఎఫ్‌ నుంచి రుణాలు తీసుకుంటే ఆర్థిక సంస్కర ణలను తీసుకురావల్సి ఉంటుంది. దీనివల్ల దేశ కరెన్సీని ఎక్కువగా కోల్పోవాల్సి ఉండటమే కాకుండా నిత్యావసర వస్తువుల కొరతను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

Russia-Ukraine Conflict: ఈ యుద్ధం వెనుక ఏముంది?

అందుకనే చాలాకాలంగా ఐఎంఎఫ్‌ని ఆశ్రయించడానికి బదు లుగా చైనా, భారతదేశం వైపు శ్రీలంక దృష్టి సారించింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో శ్రీలంకకు భారత్‌ 1.5 బిలియన్‌ డాలర్లను రుణంగా ఇచ్చింది. వీటితో నిత్యావసర వస్తువులను, ఇంధనాన్ని కొనుక్కునే వెసులుబాటు లంకకు దక్కింది. అదే సమయంలో చైనా కూడా లంకకు 2.5 బిలియన్‌ డాలర్ల మేరకు ఆర్థిక సహాయంగా ఇచ్చింది. చైనా, భారత్‌లు ఈ ద్వీపదేశాన్ని ప్రభావితం చేయడానికి పోటీ పడుతున్నాయి. అంటే షరతులు లేకుండా ఈ రెండు దేశాలు లంకకు మద్దతు ఇస్తాయని భావించాల్సిన పని లేదు. అయితేనేం, ఆర్థిక సంక్షోభం తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే శ్రీలంక చివరకు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులను సహాయం కోసం అర్థించక తప్పడం లేదు. చైనా, భారత్, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకుల నుంచి అందే ఆర్థిక సహాయం, రుణాలు త్వరలోనే కొలంబో ఆర్థిక పరిస్థితిని సుస్థిరపరిచే అవకాశం ఉంది. అయితే దేశ ఆర్థిక సంక్షోభానికి ఆర్థిక కారణాల కంటే రాజకీయ కారణాలే ఎక్కువ! జాతి కేంద్రకమైన జాతీయవాదం, మెజారిటీ సింహళ ప్రజలవైపు మొగ్గు చూపడం ఇప్పటికీ విస్తృత స్థాయిలో కొనసాగుతున్నాయి. 

పార్లమెంటులో 150 సీట్ల అఖండ మెజారిటీతో గెలుపొందిన గొటబయ రాజపక్స ప్రభుత్వంపై, ముఖ్యంగా రాజపక్స కుటుంబంపై లంకేయులు ప్రస్తుతం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారంటే ఈ కుటుంబ రాజకీయ విధానాలు ఎంత ఏహ్యభావాన్ని వారిలో పెంచాయో అర్థమవుతుంది. అందుకే శ్రీలంకకు అందుతున్న బాహ్య సహాయం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి దేశం గట్టెక్క వచ్చు. కానీ దాని ఆర్థిక విధానాలను, అంతకు మించి తన రాజకీయ విధానాలను సరిదిద్దుకోకపోతే శ్రీలంక సమస్యకు అంతిమ పరి ష్కారం లభించడం కష్టసాధ్యమే!

Ashok Swain
అశోక్‌ స్వయిన్‌
వ్యాసకర్త ప్రొఫెసర్, ఉప్సల యూనివర్సిటీ, స్వీడన్‌
(‘గల్ఫ్‌ న్యూస్‌’ సౌజన్యంతో)

 

Published date : 08 Apr 2022 03:55PM

Photo Stories