Skip to main content

Military Expenditure: మొట్టమొదటి సారిగా 2 లక్షల కోట్ల డాలర్ల గీత దాటి ఖర్చు

Military

‘స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌’ (సిప్రీ) ప్రకారం, 2021లో రెండు లక్షల నూట పదమూడు కోట్ల డాలర్లను (162 లక్షల కోట్ల రూపాయలు) మిలిటరీ కోసం ప్రపంచ దేశాలు ఖర్చు చేశాయని తేలింది.  ప్రపంచ దేశాలు మొట్టమొదటి సారిగా 2 లక్షల కోట్ల డాలర్ల గీతను దాటి  ఖర్చు చేయటం ఇదే తొలిసారి. కరోనా మహమ్మారి, మూత బడుతున్న పరిశ్రమలు, పెరుగుతున్న నిరుద్యోగం, తగ్గుతున్న ఆదాయాలు... ఇవేవీ ఈ ఖర్చుకు అడ్డుకాలేదు. ఉక్రెయిన్‌– రష్యా యుద్ధ బూచితో ఈ సంవత్సర మిలిటరీ వ్యయం 2.5 నుండి 3 లక్షల కోట్ల డాలర్లకు పెరిగినా ఆశ్యర్యం లేదు. అమెరికా, చైనా, భారత్, యూకే, రష్యా కలిసి మొత్తం ఖర్చులో 62 శాతాన్ని చేశాయి. 80,100 కోట్ల డాలర్లతో అమెరికా మొత్తం మిలిటరీ వ్యయంలో 38 శాతం వెచ్చించి బంగారు పతకాన్ని పొంది, శాంతి కబుర్లు చెప్పటం మాత్రం మానలేదు. నాటో దేశాల ఖర్చూ రాను రాను పెరుగుతోంది.

Report on Food Crises: ఆహార సంక్షోభం ముంగిట్లో..

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు ఆస్టిన్, బ్లింకెన్‌లు వచ్చి... ఉక్రెయిన్‌లో యుద్ధం ఆగదనీ, రష్యా మొత్తం బలహీనపడేవరకూ యుద్ధం కొనసాగుతుందనీ, అప్పటివరకూ ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తూనే ఉంటామనీ సెలవిచ్చారు. యుద్ధం ఇప్పటికే 52 లక్షల మంది పౌరులను  శరణార్థులుగా మార్చింది. యుద్ధం వల్ల ఎంత ప్రాణ, ధన నష్టం జరిగినా వీరికి చీమైనా కుట్టదు. రష్యా వ్యవస్థల్ని ధ్వంసం చేయటం ద్వారా వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా... ఆయుధాల్ని సురక్షితంగా అమ్ముకొంటూ ఏకధృవ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళాలనేది వీరిద్దరి ఆకాంక్ష. ఇప్పటి వరకూ పంపిన ఆయుధాలు చాలవన్నట్లు అమెరికా హోం శాఖ 6.5 కోట్ల డాలర్ల ఆయుధాలను పంపించటానికి ఆమోద ముద్ర వేసింది. కీవ్‌కు వచ్చిన బ్లింకెన్, ఆస్టిన్‌లు అదనంగా 32.2 కోట్ల డాలర్ల ఆయుధాలను ఇస్తామన్నారు.  అసలే చితికిపోయి ఉన్న ఉక్రెయిన్‌కు ఈ సహాయమంతా అప్పు రూపమనే విషయం అందరికీ తెలుస్తూనే ఉంది. 

Hubble Space Telescope: జోవియన్‌ గ్రహాలు అని ఏ గ్రహాలను పిలుస్తారు?

యుద్ధాలన్నా, మిలిటరీ ఖర్చులు పెంచటమన్నా ప్రపంచ ఆయుధ కర్మాగారాలకు పండుగే. పెద్దపెద్ద ఆయుధ కర్మాగారాలు 2020 సంవత్సరంలో కోవిడ్‌ను కూడా లెక్కచేయక 53,100 కోట్ల డాలర్ల ఆయుధాల వ్యాపారం చేసినట్లు సిప్రీ తెలిపింది. 2019తో పోలిస్తే ఇది సుమారు 1.3 శాతం ఎక్కువ. ఇదే సంవత్సరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.1 శాతం సంపదను కోల్పోయింది. ప్రపంచ అతిపెద్ద 100 ఆయుధ కర్మాగారాల్లో అమెరికాకు చెందిన 41 కంపెనీలు 54 శాతం ప్రపంచ ఆయుధ అమ్మకాలతో 28,500 కోట్ల డాలర్లు సంపాదించాయి. కనుకనే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు శాంతి చర్చలకు ముందుకు వస్తున్నా... అమెరికా ఆయుధ కంపెనీల ప్రతినిధులైన బైడెన్, బ్లింకెన్, ఆస్టిన్‌లు చర్చలకు దూరమంటున్నారు. యుద్ధం ఎంతకాలం ముందుకు సాగితే, అమెరికాకు అంత లాభం. 

India-Nepal Relations: పొరపొచ్చాలు ఏర్పడినా, ఎప్పటికప్పుడు..

యుద్ధాలు, ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యానికి ఆటంకా లయితే... మానవాళికి అందాల్సిన వస్తు సేవలు అందక ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. ఉద్రిక్తతల నడుమ  కూడా వాణిజ్యం ఆగదని చెప్పడానికి భారత్‌–చైనా, జర్మనీ–రష్యా  సంబంధాలు చక్కటి ఉదాహరణలు. గల్వాన్‌ ఉద్రిక్తతల తర్వాత  చైనా కస్టమ్స్‌ విభాగం నివేదిక ప్రకారం... 2021–22లలో చైనాకు భారతదేశం ఎగుమతులు కొంచెం పెరిగి 2,646 కోట్ల డాలర్లకు చేరగా, చైనా నుండి మన దిగుమతులు 10,347 కోట్ల డాలర్లకు పెరి గాయి. దీనితో మన వాణిజ్య లోటు 7,700 కోట్ల డాలర్లకు పెరిగింది. ఇక్కడ ఆత్మనిర్భర భారత్‌ పని చేయలేదు. మరొక ఉదాహరణగా జర్మనీ. యథేచ్ఛగా రష్యాపై ఆంక్షలు విధిస్తూనే రష్యా నుంచి గ్యాసు, ముడి చమురు దిగుమతులను మాత్రం ఆపలేదు.  ప్రపంచ దేశాలు మిలిటరీ ఖర్చులు తగ్గించి  మానవాళి మనుగడకు కావల్సిన పరిశ్రమల్ని, విద్యాలయాలు, స్కూళ్లను, ఆసుపత్రులను నెలకొల్పడం ద్వారా ప్రపంచ ప్రధాన సమస్యల పరిష్కారాలకు కృషి చేయాలి. నూతన అలీనోద్యమ సారథిగా భారతదేశం ఈ దిశగా ప్రపంచ దేశాల్ని నడిపించటానికి చొరవ తీసుకోవాలి.

​​​​​​​Buddiga Jamindar

వ్యాసకర్త: బుడ్డిగ జమీందార్‌
అసోసియేట్‌ ప్రొఫెసర్, కేఎల్‌ యూనివర్సిటీ
మొబైల్‌: 9849491969

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 03 May 2022 07:01PM

Photo Stories