Afghanistan PM: అఫ్గానిస్తాన్ ప్రధానిగా ఎంపికైన తాలిబన్ ప్రతినిధి?
ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ సెప్టెంబర్ 7న వెల్లడించారు. అమెరికాతో చర్చల్లో అత్యంత కీలకపాత్ర పోషించిన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌తో పాటు మౌల్వీ హనాఫీలు అఖుంద్‌కు డిప్యూటీ పీఎంలుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఖారీ ఫసిహుద్దీన్ బంద్‌క్షనిని ఆర్మీ చీఫ్‌గా నియమించినట్లు తెలిపారు. అయితే ఎంతకాలం ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంటుందో, ప్రభుత్వంలో మార్పులు ఎలా వస్తాయో తాలిబన్లు వెల్లడించలేదు.
కీలక మంత్రులు– శాఖలు
- అమీర్ ఖాన్ ముత్తఖీ: విదేశాంగ మంత్రి
- షేర్ మొహ్మద్ అబ్బాస్ స్టానెక్‌జాయ్: విదేశాంగ సహాయ మంత్రి
- సిరాజ్ హక్కానీ: హోంశాఖ మంత్రి
- ముల్లా యాకూబ్: రక్షణ మంత్రి
- అబ్దుల్లా హకీం షరే: న్యాయ మంత్రి
- హిదాయతుల్లా బద్రి: ఆర్థిక మంత్రి
- షేక్ మవ్లావీ నూరుల్లా: విద్యా మంత్రి
ఎవరీ అఖుంద్?
ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్(65), తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌కు అత్యంత సన్నిహితుడు, రాజకీయ సలహాదారు. గత తాలిబన్ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా, కాందహార్ గవర్నర్‌గా పనిచేశారు. అనంతరం ఐరాస ఆంక్షల జాబితాకెక్కారు. తాలిబన్ కమాండర్లలో అత్యంత ప్రభావశాలి అని ఐరాస పేర్కొంది. ఇరవైఏళ్లుగా తాలిబన్ల నాయకత్వ మండలి ‘రెహబరి షురా’కు అఖుంద్ అధిపతిగా ఉన్నారు.
ఇతర ప్రముఖులు
- డిప్యూటీగా నియమితులైన ముల్లా బరాదర్, తాలిబన్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు.
- హోంశాఖ మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ కీలకమైన హక్కానీ నెట్‌వర్క్ అధిపతి.
- రక్షణ మంత్రిగా నియమితులైన ముల్లా యాకూబ్, తాలిబన్ స్థాపకుడు ముల్లా ఒమర్ కుమారుడు.
పాక్ జోక్యాన్ని సహించం..
అఫ్గాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో పాకిస్తాన్ జోక్యాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 7న వందలాది మంది కాబూల్ రోడ్లెక్కి నిరసన ప్రదర్శనలు చేశారు. పంజ్‌షీర్ ప్రావిన్స్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడానికి పాకిస్తాన్ సహాయ సహకారాలు అందించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అఫ్గానిస్తాన్ తాత్కాలిక ప్రధానిగా ఎంపికైన తాలిబన్ ప్రతినిధి?
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్
ఎందుకు : అఫ్గానిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా...