Skip to main content

UK PM resigns: యూకే ప్రధాని ట్రస్‌ రాజీనామా

లండన్‌: సొంత పార్టీ సభ్యుల నుంచే అసమ్మతి సెగ ఎదుర్కొంటున్న యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) ప్రధానమంత్రి లిజ్‌ ట్రస్‌(47) అక్టోబర్ 20న పదవికి రాజీనామా చేశారు.
Liz Truss resigns as UK prime minister
Liz Truss resigns as UK prime minister

ఆర్థికంగా పెను సవాళ్లు ఎదురవ్వడం, మినీ బడ్జెట్‌తో పరిస్థితి మరింత దిగజారడం, రష్యా నుంచి గ్యాస్‌ సరఫరా నిలిచిపోవడంతో ఖజానాపై విద్యుత్‌ బిల్లుల భారం పెరిగిపోవడం, ధనవంతులకు పన్ను మినహాయింపుల పట్ల ఆరోపణలు రావడం, డాలర్‌తో పోలిస్తే పౌండు విలువ దారుణంగా పడిపోవడం, వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినడం వంటి అంశాలు ఆమెపై విపరీతమైన ఒత్తిడిని పెంచాయి. మరోవైపు సొంత పార్టీ ఎంపీలు తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధపడడంతో రాజీనామాకే ట్రస్‌ మొగ్గుచూపారు. కన్జర్వేటివ్‌ నాయకురాలి పదవి నుంచి తప్పుకున్నారు. అనూహ్య రీతిలో కేవలం 45 రోజుల్లో తన భర్తతో కలిసి ‘10 డౌనింగ్‌ స్ట్రీట్‌’ నుంచి భారంగా నిష్క్రమించారు. పార్టీ నాయకత్వం తనకు కట్టబెట్టిన బాధ్యతను నెరవేర్చలేకపోయాయని, ఆర్థిక అజెండాను అమలు చేయలేకపోయానని, అందుకే పదవికి రాజీనామా చేశానని చెప్పారు. కొత్త ప్రధానమంత్రి ఎన్నికయ్యే దాకా ప్రధానిగా ట్రస్‌ కొనసాగుతారు. నూతన ప్రధాని ఎవరన్నది వారం రోజుల్లోగా తేలిపోనుంది.   

Also read: UK home secretary: బ్రిటన్‌ హోం మంత్రి బ్రేవర్మన్‌ రాజీనామా

45 రోజుల ప్రధానమంత్రి  
యూకేలో పలువురు ప్రధానమంత్రులు ఏడాది కంటే తక్కువ కాలమే అధికారంలో కొనసాగారు. పదవిలో ఉండగానే మరణించడం లేదా రాజీనామా వంటివి ఇందుకు కారణాలు. తాజాగా 45 రోజుల ప్రధానిగా ట్రస్‌ రికార్డు సృష్టించారు.

సంవత్సరం లోపే అధికారంలో ఉన్న యూకే ప్రధానులు

పేరు ప్రమాణం రాజీనామా రోజులు
లిజ్‌ ట్రస్‌ 2022 సెప్టెంబర్‌ 6 2022 అక్టోబర్‌ 20 45
జార్జ్‌ కానింగ్‌ 1827 ఏప్రిల్‌ 10 1827 ఆగస్టు 8(మృతి) 119
ఫ్రెడరిక్‌ రాబిన్సన్‌ 1827 ఆగస్టు 31 1828 జనవరి 21 144
బోనర్‌ లా 1922 అక్టోబర్‌ 23 1923 మే 20 210
విలియం కావెండిష్‌ 1756 నవంబర్‌ 6 1757 జూన్‌ 29 236
విలియం పెట్టీ 1782 జూలై 13 1783 ఏప్రిల్‌ 5 267

 

Also read: Gujarat's Defense Expo: ‘మిషన్‌ స్కూల్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ను ప్రారంభించిన మోదీ

బాధ్యత నెరవేర్చలేకపోయా 
దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానన్న నమ్మకంతో తనను ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని, ఆ బాధ్యతను నెరవేర్చడంలో విఫలమయ్యానని లిజ్‌ ట్రస్‌ పేర్కొన్నారు. అందుకే పదవి నుంచి తప్పుకుంటున్నానని స్పష్టం చేశారు. అక్టోబర్ 20న రాజీనామా అనంతరం ఆమె లండన్‌లోని డౌనింగ్‌ స్ట్రీట్‌లో మీడియాతో మాట్లాడారు. రాజీనామాకు దారితీసిన కారణాలను వెల్లడించారు. అధికార కన్జర్వేటివ్‌ పార్టీ నాయకురాలి పదవికి రాజీనామా చేశానంటూ రాజు చార్లెస్‌కు తెలియజేశానని అన్నారు. అస్థిరమైన ఆర్థిక వ్యవస్థ, ప్రతికూల అంతర్జాతీయ పరిస్థితుల నడుమ యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) ప్రధానమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టానని గుర్తుచేశారు. లిజ్‌ ట్రస్‌ ఇంకా ఏం చెప్పారంటే.. ‘‘బిల్లులు చెల్లించలేక ప్రజలు, వ్యాపారవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఆదాయాలు లేకపోవడంతో బిల్లులు ఎలా కట్టాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రారంభించిన చట్టవిరుద్ధమైన యుద్ధం మన భద్రతకు ముప్పుగా మారింది. ఆర్థిక వృద్ధి క్రమంగా పడిపోతోంది. మన దేశం వెనుకంజ వేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి, దేశాన్ని ముందుకు నడిపిస్తానన్న విశ్వాసంతో కన్జర్వేటివ్‌ పార్టీ నన్ను ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. ఇంధన బిల్లులు, జాతీయ ఇన్సూరెన్స్‌లో కోత వంటి అంశాల్లో కార్యాచరణ ప్రారంభించాం. తక్కువ పన్నులు, ఎక్కువ ఆర్థిక వృద్ధిని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. బ్రెగ్జిట్‌ వల్ల లభించిన స్వేచ్ఛను వాడుకోవాలన్నదే మన ఉద్దేశం. కానీ, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకున్నా. పార్టీ నాకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడంలో విఫలమయ్యానని గుర్తించా. రాజు చార్లెస్‌తో మాట్లాడా. కన్జర్వేటివ్‌ పార్టీ నేత పదవికి రాజీనామా చేశానని తెలియజేశా. ఈ రోజు ఉదయమే ‘1922 కమిటీ’ చైర్మన్‌ సర్‌ గ్రాహం బ్రాడీతో సమావేశమయ్యా. వారం రోజుల్లోగా నూతన నాయకుడి (ప్రధానమంత్రి) ఎన్నిక ప్రక్రియను పూర్తిచేయాలని మేము ఒక నిర్ణయానికొచ్చాం. మనం అనుకున్న ప్రణాళికలను సక్రమంగా అమలు చేయడానికి, మన దేశ ఆర్థిక రంగంలో స్థిరత్వాన్ని సాధించడానికి, దేశంలో భద్రత కొనసాగించడానికి నూతన ప్రధానమంత్రి ఎన్నిక దోహదపడుతుందని భావిస్తున్నా. నా వారసుడు(కొత్త ప్రధాని) ఎన్నికయ్యే దాకా పదవిలో కొనసాగుతా’’.

Also read: Russia-Ukraine War: ఆక్రమిత ఉక్రెయిన్‌ ప్రాంతాల్లో... మార్షల్‌ లా విధించిన రష్యా

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 21 Oct 2022 06:48PM

Photo Stories