UK Elections: ‘బ్రిటన్ ప్రధాని’ బరిలో ముగ్గురు నేతలు! రేసులో రిషి సునాక్, బోరిస్, మోర్డంట్
ఈసారి ఎన్నికల ప్రక్రియలో కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల కంటే ఎంపీల మద్దతే కీలకంగా మారింది. అభ్యర్థిగా బరిలో దిగాలంటే కనీసం 100 మంది ఎంపీల మద్దతు అవసరం. గతంలో 20గా ఉండేది.
Also read: Quiz of The Day (October 20, 2022): ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న రాజధాని నగరం ఏది?
ఎన్నిక ప్రక్రియ ఇలా...
- ఈసారి ఎన్నిక ప్రక్రియ కూడా గతంలో కంటే భిన్నంగా ఉంటుంది. 1922 కమిటీ నిబంధనల మేరకు 100 మంది ఎంపీల మద్దతున్నవారికే పోటీకి చాన్సుంటుంది. పార్లమెంటులో 357 మంది ఎంపీలున్నందున అత్యధికంగా ముగ్గురు బరిలో దిగొచ్చు.
- నామినేషన్‌కు అక్టోబర్ 24తో గడువు ముగుస్తుంది. అప్పటికల్లా ఇద్దరి కంటే ఎక్కువ మంది 100 ఎంపీల మద్దతు సాధిస్తే వారి నుంచి ఇద్దరిని ఎంపీలే అప్పటికప్పుడు ఎన్నుకుంటారు. అంటే అత్యధిక ఓట్లు పొందిన ఇద్దరు బరిలో మిగులుతారు.
- ఆ ఇద్దరిలో ఒకరిని టోరీ సభ్యులు ఆన్‌లైన్‌లో తమ నాయకుడిగా ఎన్నుకుంటారు. అక్టోబర్ 28న ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత కింగ్ చార్లెస్ –3 లాంఛనంగా కొత్త ప్రధానిని నియమిస్తారు.
- ఒకవేళ గడువులోగా 100 మంది ఎంపీల మద్దతు ఒక్కరికే లభిస్తే తదుపరి ప్రక్రియతో పని లేకుండా వారే నేరుగా ప్రధాని అవుతారు.
- ఒక ప్రధాని రాజీనామా చేసి మరొకరు పదవి చేపట్టే సమయంలో ఎన్నిక ప్రక్రియ సర్వసాధారణంగా టోరీ సభ్యుల వరకు వెళ్లదు. ఇద్దరు సభ్యులు చివర్లో మిగిలితే తక్కువ మంది ఎంపీల మద్దతున్న వారు తప్పుకుంటారు. 2016లో థెరిసా మే ప్రధాని అయినప్పుడు ప్రత్యర్థి అండ్రూ లీడ్సమ్ ఇలాగే బరి నుంచి తప్పుకున్నారు.
- అందుకే ఈ సారి ఎన్నికలో టోరీ సభ్యులు కంటే ఎంపీలే కీలకంగా ఉన్నారు.
Also read: Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 21st కరెంట్ అఫైర్స్
రేసులో వీరే...
రిషి సునాక్: భారత సంతతికి చెందిన రిషి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు. గత ఎన్నికలో ట్రస్‌కు గట్టి పోటీ ఇచ్చారు. అత్యధిక ఎంపీల మద్దతు ఆయనకే ఉన్నా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలనని సభ్యుల్లో విశ్వాసం కలిగించలేక 21 వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు. ట్రస్ పన్ను రాయితీలు దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడతాయని మొదట్నుంచి హెచ్చరిస్తూ వచ్చిన సునాక్‌కు ఈసారి ఎంపీల మద్దతు లభించే అవకాశముంది.
Also read: Liz truss : బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా.. కారణం ఇదే? పదవి చేపట్టిన 45 రోజుల్లోనే..
బోరిస్ జాన్సన్: తాను ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి రావడానికి రిషియే కారణమన్న ఆగ్రహంతో ఉన్న జాన్సన్ మరోసారి పీఠమెక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. సొంత పార్టీ ఎంపీలు, మంత్రుల తిరుగుబాటు కారణంగా మరో దారి లేక ప్రధానిగా రాజీనామా చేసినా, జాన్సన్‌కు ఇప్పటికీ పార్టీపై పట్టుంది. ట్రస్ చేతిలో రిషి ఓటమికి జాన్సన్ తెర వెనుక మంత్రాంగమే ప్రధాన కారణమన్న ఆరోపణలున్నాయి. కరోనా సమయంలో పార్టీలు చేసుకున్న వ్యక్తిగా అప్రతిష్ట మూటగట్టుకున్న ఆయనకు ఈసారి కూడా ఎంపీలు మద్దతుగా నిలవకపోయినా సునాక్‌ని ఓడించడానికైతే ప్రయత్నిస్తారన్న వార్తలు విన్పిస్తున్నాయి.
పెన్నీ మోర్డంట్
బ్రిటన్ తొలి మహిళా రక్షణ మంత్రి. గత ఎన్నికల్లో ఎంపీల మద్దతు బాగా సంపాదించినా తుది ఇద్దరు అభ్యర్థుల్లో స్థానం దక్కించుకోలేకపోయారు. మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ట్రస్‌కు మద్దతుగా నిలిచి ఆమె ప్రధాని అయ్యాక హౌస్ ఆఫ్ కామన్స్ అండ్ లార్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ప్రైవీ కౌన్సిల్‌కి నాయకురాలయ్యారు. ట్రస్‌పై ఎంపీల్లో వ్యతిరేకత ఉండడంతో ఆమె సన్నిహితురాలైన పెన్నీకి ఎంతవరకు మద్దతునిస్తారన్న అనుమానాలున్నాయి. వీరే కాకుండా మంత్రులుగా అనుభవమున్న కెమీ బాదెనోచ్, సుయెల్లా బ్రేవర్మన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆర్థిక మంత్రిగా గొప్ప పనితీరుతో ఆకట్టుకున్న రిషి, బోరిస్ మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also read: UK PM resigns: యూకే ప్రధాని ట్రస్ రాజీనామా
– సాక్షి, నేషనల్ డెస్క్