Liz truss : బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా.. కారణం ఇదే? పదవి చేపట్టిన 45 రోజుల్లోనే..
ప్రధాని పదవి చేపట్టిన 45 రోజుల్లోనే ఆమె బాధ్యతల నుంచి వైదొలిగారు. బ్రిటన్‌లో చరిత్రలోనే అతి తక్కువ కాలం ప్రధానిగా ఉన్న నేత ట్రసే కావడం గమనార్హం. బ్రిటన్‌లో కొద్ది రోజుల క్రితమే ఎన్నికలు జరిగాయి.
Liz Truss: బ్రిటన్ మూడో మహిళా పీఎంగా రికార్డు
ట్రస్ వచ్చాక పరిస్థితి మరింత దిగజారింది.. దీంతో..
భారత సంతతికి చెందిన రిషి సునాక్, లిజ్ ట్రస్ పోటీ పడ్డారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులంతా ట్రస్‌కే పట్టంగట్టడంతో ఆమె సునాయసంగా విజయం సాధించారు. అయితే అప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న బ్రిటన్‌లో ట్రస్ వచ్చాక పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ఆర్థిక మంత్రిని ఆమె స్వయంగా తప్పించారు. ట్రస్‌ను కూడా తప్పించేందుకు కన్జర్వేటివ్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమెపై సొంత పార్టీ ఎంపీలే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారని వార్తలు వచ్చాయి.
UK Elections: బ్రిటన్ ప్రధాని పోరు రిషి X ట్రస్
ఇలా చెప్పిన మరుసటి రోజే..
ప్రధానమంత్రి హోదాలో ఎంపీల ప్రశ్నలకు జవాబివ్వడానికి ట్రస్ బుధవారం పార్లమెంటుకు వచ్చిన సందర్భంలో కొందరు ఎంపీలు ఆమె రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత కెయిర్ స్టార్మెర్ అయితే.. ‘‘ఆమె ఇంకా పదవిలో ఉన్నారెందుకు?’ అని ప్రశ్నంచగా.. ‘‘నేను ఎదురొడ్డి పోరాడే ధీరవనితను. కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. బరి నుంచి పారిపోయే దాన్ని కాదు’ అంటూ దీటుగా సమాధానం ఇచ్చిన మరుసటి రోజే లిజ్‌ట్రస్ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. దీంతో ఆమె ప్రధాని పదవి మూన్నాళ్ల ముచ్చటగానే నిలిచింది. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు కొత్త ప్రధానిగా ఎవర్ని ఎన్నుకుంటారో చూడాలి.
లిజ్‌పై ఒత్తిడి..
లిజ్‌ట్రస్ ప్రకటించిన మినీ బడ్జెట్‌తో దేశంలో మాంద్యాన్ని చక్కదిద్దకపోగా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మరింత గందరగోళానికి గురైంది. ఈ క్రమంలోనే ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం, లిజ్‌పై ఒత్తిడికి కారణమైంది. ఈ పరిస్థితుల్లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొన్న వేళ ఆమె తన పదవికి రాజీనామా చేశారు.
అనంతరం ఆమె డౌనింగ్ స్ట్రీట్ బయట మీడియాతో మాట్లాడారు. తన రాజీనామా విషయాన్ని బ్రిటన్ రాజుకు తెలియపరిచానని.. తదుపరి ప్రధానిని ఎన్నుకొనేవరకు పదవిలో కొనసాగనున్నట్టు తెలిపారు. తీవ్ర ఆర్థిక, అంతర్జాతీయ అస్థితరత కొనసాగుతున్న సమయంలో తాను ప్రధాని పదవి చేపట్టానని చెప్పుకొచ్చారు లిజ్. ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధం కొనసాగిస్తుండటం యూరప్‌తో పాటు బ్రిటన్‌కు ముప్పుగా పరిణమించిందని.. ఈ పరిస్థితి దేశ ఆర్థిక పరిస్థితిని మరింత క్షీణింపజేసిందని ఆమె పేర్కొన్నారు.
ఈమె జీవిత ప్రస్థానం ఇలా..
బ్రిటన్‌లో దాదాపు 40 ఏళ్ల క్రితం ఓ పాఠశాలలో నిర్వహించిన నాటకంలో ఓ బాలిక మార్గరేట్ థాచర్ పాత్ర పోషించింది. ఆ నాటికలో ఉత్తుత్తి ఎన్నికలు నిర్వహించారు. దానికి ముందు అభ్యర్థులు ప్రసంగించాలి. ఆ బాలిక కూడా అలానే చేసింది. కానీ, ఒక్క ఓటు కూడా ఆ బాలికకు రాలేదు. చివరికి తన ఓటు కూడా తనకు వేసుకోలేదు. ఇప్పుడు దాదాపు 39 ఏళ్ల తర్వాత ఆ బాలిక దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
కుటుంబ నేపథ్యం :
1975లో ఆక్స్‌ఫర్డ్‌లో వామపక్ష భావజాలం ఉన్న కుటుంబంలో లిజ్ ట్రస్ జన్మించారు. ఆమె తండ్రి లెక్కల ప్రొఫెసర్. తల్లి నర్స్. వారి కుటుంబం తర్వాత గ్లాస్గోకు వలసవెళ్లింది. ఆమె చిన్నప్పుడు తల్లితో కలిసి అణ్వాయుధ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంది. అప్పట్లో అమెరికా అణ్వాయుధాలను రాయల్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో ఉంచాలని నిర్ణయించారు.
ఎడ్యుకేషన్ సాగిందిలా..
స్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేసి.. ఆక్స్‌ఫర్డ్‌లో చేరారు. అక్కడ ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్‌ను ఎంపిక చేసుకొన్నారు. విద్యార్థి రాజకీయాల్లో లిబరల్ డెమోక్రాట్ల తరపున చురుగ్గా పాల్గొన్నారు. 1994లో ఆమె పార్టీలో ప్రసంగిస్తూ రాజరికాన్ని అంతమొందించాలన్నారు. లిబరల్ డెమోక్రాట్లు అందరికీ అవకాశాలు ఇవ్వడాన్ని విశ్వసిస్తారని పేర్కొన్నారు. పాలించడం కోసమే కొందరు పుడతారనే దానిని విశ్వసించబోమని చెప్పారు. ఆ తర్వాత కొన్నేళ్లకే ఆమె కన్జర్వేటీవ్ పార్టీకి మారారు. డిగ్రీ తర్వాత ఆమె అకౌంటెంట్‌గా పనిచేశారు.
పెళ్లి :
ఈమె హ్యూ ఓ లియారీని పెళ్లి చేసుకొన్నారు. వీరికి ఇద్దరు సంతానం.
ఓటమి నుంచి గెలుపు..
2001లో ఎన్నికల్లో కన్జర్వేటీవ్ పార్టీ తరపున ట్రస్ హెమ్స్‌వర్త్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి 2005 ఎన్నికల్లో కాల్డర్ వ్యాలీలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తొలిసారి ఆగ్నేయ లండన్‌లోని గ్రీన్ విచ్ నుంచి కౌన్సిలర్‌గా విజయం సాధించారు. 2008లో రైట్ ఆఫ్ సెంటర్ రిఫార్మ్ థింక్‌ట్యాంక్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా చేరారు. కన్జర్వేటీవ్ పార్టీ నేత డేవిడ్ కేమరూన్ 2010లో జరిగిన ఎన్నికలకు ఆమెను అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆ ఎన్నికల్లో ఆమె నార్‌ఫోక్ నుంచి పోటీ చేయడానికి ఎంపికయ్యారు. అక్కడ 13,000 వేల ఓట్లతో గెలిచారు.
ఆమె వ్యక్తిగత జీవితంపై కూడా..
2012లో ఆమె వ్యక్తిగత జీవితంపై విమర్శలు రావడంతో పదవి నుంచి తప్పించాలనే యత్నం జరిగినా .. అది ఫలించలేదు. అదే ఏడాది ఆమె విద్యాశాఖ మంత్రి అయ్యారు. ఈ క్రమంలో పాఠశాల సంస్కరణలపై డిప్యూటీ ప్రైమినిస్టర్ నిక్‌తో ఆమె గొడవపడ్డారు. 2014 నాటికి ఆమెను ప్రధాని కేమరూన్ తన కేబినేట్‌లోకి తీసుకొని.. పర్యావరణ శాఖ సెక్రటరీగా నియమించారు.
పెద్ద విషాదంగా..
బ్రిటన్ చరిత్రలో జరిగిన అత్యంత కీలకమైన బ్రెగ్జిట్‌ను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఐరోపా సమాఖ్యలో కొనసాగడానికే ఆమె మొగ్గు చూపారు. ఈయూ నుంచి విడిపోవడాన్ని పెద్ద విషాదంగా పేర్కొంటూ సన్ పత్రికకు ఎడిటోరియల్ రాశారు. బ్రెగ్జిట్ వల్ల వ్యాపారాల్లో మరింత జాప్యం చోటు చేసుకొంటుందని అభిప్రాయపడ్డారు. కానీ, బ్రెగ్జిట్‌కు బ్రిటన్‌లో ఆమోద ముద్రపడటంతో మనసు మార్చుకొన్నారు. బ్రెగ్జిట్‌తో బ్రిటన్‌లో పనితీరును మార్చుకోవచ్చని వాదించారు. 2016లో ఆమె థెరిస్సా ప్రభుత్వంలో జస్టిస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు.
బోరిస్ జాన్సన్ ప్రధాని అయ్యాక..
2019లో బోరిస్ జాన్సన్ ప్రధాని అయ్యాక ఇంటర్నేషనల్ ట్రేడ్ సెక్రటరీగా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. మరో రెండేళ్లకే బ్రిటన్ విదేశాంగశాఖ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. బ్రిటన్‌లోని అత్యంత సీనియర్ పదవుల్లో ఇది కూడా ఒకటి.
అదే సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేపట్టింది. లిజ్ ట్రస్ మాస్కోకు వ్యతిరేకంగా బ్రిటన్ తరపున గళం వినిపించారు. కానీ, ఇది ఐరోపాలో తీవ్ర సంక్షోభం కావడంతో ఆమె పాత్రను బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఎక్కువగా పోషించాల్సి వచ్చింది.
ఫలితంగా ట్రస్‌కు అనుకొన్నంత పేరు రాలేదనే చెప్పాలి. కానీ, బోరిస్ ప్రధాని పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడంతో మరోసారి లిజ్ ట్రస్ పేరు తెరపైకి వచ్చింది. రిషి పై జాన్సన్ కోపంగా ఉండటంతో.. ట్రస్‌కు తెరవెనుక ఆమెకు మద్దతు పెరిగింది. ఫలితంగా రేసులో ముందుకొచ్చిన ఆమె ఇప్పుడు ప్రధానిగా విజయం సాధించారు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP