Skip to main content

Schools news: సర్కార్‌ బడుల్లో మూలకు పడ్డ కంప్యూటర్లు

government Schools Computers news
government Schools Computers news

నందిపేట్‌: కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలకు గతంలో ప్రభుత్వం కంప్యూటర్‌ విద్యను ప్రవేశపెట్టింది. కొద్ది రోజులు సక్రమంగానే సాగిన కంప్యూటర్‌ విద్య తర్వాత అటకెక్కింది. నిర్వహణ లేక అధికారులు పట్టించుకోకపోవడంతో నిజామాబాద్‌ జిల్లాలోని విద్యార్థులకు సాంకేతిక విద్య దూరమైంది. ఏళ్ల నుంచి ఆయా పాఠశాలల్లో కంప్యూటర్లు మూలకు పడ్డాయి.

2008 ప్రారంభం.. 2013లో ముగింపు

2008లో నాటి ప్రభుత్వం కంప్యూటర్‌ విద్యను ప్రారంభించింది. రూ.లక్షలు ఖర్చు చేసి కంప్యూటర్లు కొనుగోలు చేసి జిల్లాలోని 179 పాఠశాలలకు పంపిణీ చేశారు. ఇందులో హైస్కూల్‌కు రెండు సీపీయూలతో పాటు 8 నుంచి 10 కంప్యూటర్లు, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఒక యూపీసీతో పాటు 4 కంప్యూటర్లు అందజేశారు. బోధించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేసే బాధ్యతను ప్రయివేట్‌ కాంట్రాక్ట్‌ సంస్థలకు అప్పగించారు. 2013లో బోధన సిబ్బంది ఒప్పందం ముగియడంతో కంప్యూటర్‌ విద్య బోధించే వారు కరువయ్యారు. కొత్తగా సిబ్బందిని నియమించకపోవడంతో నిరుపేద విద్యార్థులకు సాంకేతిక విద్య అందకుండా పోయింది. దీంతో కంప్యూటర్లు మూలకు పడ్డాయి. కొత్త కంప్యూటర్లు పంపిణీ చేసి శిక్షకులను నియమించి సాంకేతికత అందించాలని విద్యార్థులు కోరుతున్నారు.

కంప్యూటర్‌ క్లాసులు చెప్తలేరు

మాకు కంప్యూటర్‌ క్లాసులు చెప్తలేరు. స్కూల్‌కు ఇచ్చిన కంప్యూటర్లు ఖరాబు అయితే మూలకు పడేసిండ్రు. వాటిని రిపేరు చేపిస్తలేరు. మాకు కంప్యూటర్‌ క్లాసులు జరిగేలా చర్యలు తీసుకోవాలి.

– రక్షిత, 8వ తరగతి, అయిలాపూర్‌, నందిపేట

కంప్యూటర్లు లేవు.. శిక్షకులు లేరు..

మాకు కంప్యూటర్‌ విద్య అందడం లేదు. ప్రయివేట్‌ పాఠశాలలో చిన్ననాటి నుంచి కంప్యూటర్‌ నేర్పిస్తున్నారు. మాకు మాత్రం కంప్యూటర్‌లు లేవు. శిక్షకుడు లేడు. మాకు కూడా శిక్షకుడ్ని నియమించాలి. క్లాసులు మొదలు పెట్టాలి.

– వైశాలి, 8వ తరగతి, అయిలాపూర్‌, నందిపేట

చర్యలు తీసుకుంటాం

ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక విద్య అందేలా చర్యలు తీసుకుంటాం. ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన కంప్యూటర్లు పనిచేయడం లేదు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించి విద్యార్థులకు కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌ అందేలా చర్యలు తీసుకుంటాం. – దుర్గా ప్రసాద్‌, జిల్లా విద్యాధికారి, నిజామాబాద్‌

Published date : 20 Aug 2024 08:04PM

Photo Stories