Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 21st కరెంట్ అఫైర్స్
UK PM resigns: యూకే ప్రధాని ట్రస్ రాజీనామా
లండన్: సొంత పార్టీ సభ్యుల నుంచే అసమ్మతి సెగ ఎదుర్కొంటున్న యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) ప్రధానమంత్రి లిజ్ ట్రస్(47) అక్టోబర్ 20న పదవికి రాజీనామా చేశారు. ఆర్థికంగా పెను సవాళ్లు ఎదురవ్వడం, మినీ బడ్జెట్‌తో పరిస్థితి మరింత దిగజారడం, రష్యా నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఖజానాపై విద్యుత్ బిల్లుల భారం పెరిగిపోవడం, ధనవంతులకు పన్ను మినహాయింపుల పట్ల ఆరోపణలు రావడం, డాలర్‌తో పోలిస్తే పౌండు విలువ దారుణంగా పడిపోవడం, వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినడం వంటి అంశాలు ఆమెపై విపరీతమైన ఒత్తిడిని పెంచాయి. మరోవైపు సొంత పార్టీ ఎంపీలు తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధపడడంతో రాజీనామాకే ట్రస్ మొగ్గుచూపారు. కన్జర్వేటివ్ నాయకురాలి పదవి నుంచి తప్పుకున్నారు. అనూహ్య రీతిలో కేవలం 45 రోజుల్లో తన భర్తతో కలిసి ‘10 డౌనింగ్ స్ట్రీట్’ నుంచి భారంగా నిష్క్రమించారు. పార్టీ నాయకత్వం తనకు కట్టబెట్టిన బాధ్యతను నెరవేర్చలేకపోయాయని, ఆర్థిక అజెండాను అమలు చేయలేకపోయానని, అందుకే పదవికి రాజీనామా చేశానని చెప్పారు. కొత్త ప్రధానమంత్రి ఎన్నికయ్యే దాకా ప్రధానిగా ట్రస్ కొనసాగుతారు. నూతన ప్రధాని ఎవరన్నది వారం రోజుల్లోగా తేలిపోనుంది.
Also read: UK home secretary: బ్రిటన్ హోం మంత్రి బ్రేవర్మన్ రాజీనామా
45 రోజుల ప్రధానమంత్రి
యూకేలో పలువురు ప్రధానమంత్రులు ఏడాది కంటే తక్కువ కాలమే అధికారంలో కొనసాగారు. పదవిలో ఉండగానే మరణించడం లేదా రాజీనామా వంటివి ఇందుకు కారణాలు. తాజాగా 45 రోజుల ప్రధానిగా ట్రస్ రికార్డు సృష్టించారు.
సంవత్సరం లోపే అధికారంలో ఉన్న యూకే ప్రధానులు
పేరు | ప్రమాణం | రాజీనామా | రోజులు |
లిజ్ ట్రస్ | 2022 సెప్టెంబర్ 6 | 2022 అక్టోబర్ 20 | 45 |
జార్జ్ కానింగ్ | 1827 ఏప్రిల్ 10 | 1827 ఆగస్టు 8(మృతి) | 119 |
ఫ్రెడరిక్ రాబిన్సన్ | 1827 ఆగస్టు 31 | 1828 జనవరి 21 | 144 |
బోనర్ లా | 1922 అక్టోబర్ 23 | 1923 మే 20 | 210 |
విలియం కావెండిష్ | 1756 నవంబర్ 6 | 1757 జూన్ 29 | 236 |
విలియం పెట్టీ | 1782 జూలై 13 | 1783 ఏప్రిల్ 5 | 267 |
Also read: Gujarat's Defense Expo: ‘మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ప్రారంభించిన మోదీ
బాధ్యత నెరవేర్చలేకపోయా
దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానన్న నమ్మకంతో తనను ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని, ఆ బాధ్యతను నెరవేర్చడంలో విఫలమయ్యానని లిజ్ ట్రస్ పేర్కొన్నారు. అందుకే పదవి నుంచి తప్పుకుంటున్నానని స్పష్టం చేశారు. అక్టోబర్ 20న రాజీనామా అనంతరం ఆమె లండన్‌లోని డౌనింగ్ స్ట్రీట్‌లో మీడియాతో మాట్లాడారు. రాజీనామాకు దారితీసిన కారణాలను వెల్లడించారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలి పదవికి రాజీనామా చేశానంటూ రాజు చార్లెస్‌కు తెలియజేశానని అన్నారు. అస్థిరమైన ఆర్థిక వ్యవస్థ, ప్రతికూల అంతర్జాతీయ పరిస్థితుల నడుమ యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) ప్రధానమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టానని గుర్తుచేశారు. లిజ్ ట్రస్ ఇంకా ఏం చెప్పారంటే.. ‘‘బిల్లులు చెల్లించలేక ప్రజలు, వ్యాపారవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఆదాయాలు లేకపోవడంతో బిల్లులు ఎలా కట్టాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రారంభించిన చట్టవిరుద్ధమైన యుద్ధం మన భద్రతకు ముప్పుగా మారింది. ఆర్థిక వృద్ధి క్రమంగా పడిపోతోంది. మన దేశం వెనుకంజ వేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి, దేశాన్ని ముందుకు నడిపిస్తానన్న విశ్వాసంతో కన్జర్వేటివ్ పార్టీ నన్ను ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. ఇంధన బిల్లులు, జాతీయ ఇన్సూరెన్స్‌లో కోత వంటి అంశాల్లో కార్యాచరణ ప్రారంభించాం. తక్కువ పన్నులు, ఎక్కువ ఆర్థిక వృద్ధిని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. బ్రెగ్జిట్ వల్ల లభించిన స్వేచ్ఛను వాడుకోవాలన్నదే మన ఉద్దేశం. కానీ, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకున్నా. పార్టీ నాకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడంలో విఫలమయ్యానని గుర్తించా. రాజు చార్లెస్‌తో మాట్లాడా. కన్జర్వేటివ్ పార్టీ నేత పదవికి రాజీనామా చేశానని తెలియజేశా. ఈ రోజు ఉదయమే ‘1922 కమిటీ’ చైర్మన్ సర్ గ్రాహం బ్రాడీతో సమావేశమయ్యా. వారం రోజుల్లోగా నూతన నాయకుడి (ప్రధానమంత్రి) ఎన్నిక ప్రక్రియను పూర్తిచేయాలని మేము ఒక నిర్ణయానికొచ్చాం. మనం అనుకున్న ప్రణాళికలను సక్రమంగా అమలు చేయడానికి, మన దేశ ఆర్థిక రంగంలో స్థిరత్వాన్ని సాధించడానికి, దేశంలో భద్రత కొనసాగించడానికి నూతన ప్రధానమంత్రి ఎన్నిక దోహదపడుతుందని భావిస్తున్నా. నా వారసుడు(కొత్త ప్రధాని) ఎన్నికయ్యే దాకా పదవిలో కొనసాగుతా’’.
Also read: Russia-Ukraine War: ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాల్లో... మార్షల్ లా విధించిన రష్యా
ISRO: జూన్‌లో చంద్రయాన్ 3: ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్
చందమామపై శోధనకు ఉద్దేశించిన చంద్రయాన్–3 ప్రయోగం వచ్చే ఏడాది జూన్‌లో ఉంటుందని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ ప్రకటించారు. అక్టోబర్ 20న ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో సోమ్‌నాథ్ మాట్లాడారు. ‘ గగన్‌యాన్ ప్రాజెక్ట్ కోసం తొలి రోదసీనౌక పరీక్షను వచ్చే ఏడాది తొలినాళ్లలో చేపడతాం. లాంచ్ వెహికల్ మార్క్–3 ద్వారా చంద్రయాన్–3ను ప్రయోగిస్తాం. పలుమార్లు మానవరహిత వాహకనౌక పరీక్షల తర్వాత 2024 చివరికల్లా భారతీయ వ్యోమగాములు విజయవంతంగా కక్ష్యలో అడుగుపెట్టేలా చేస్తాం. 2019 సెప్టెంబర్‌లో విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడిపై దింపేందుకు చేసిన చంద్రయాన్–2 ప్రయోగం విఫలమైంది. ఈసారి అలా జరగబోదు. ఇది భిన్నమైన ఇంజనీరింగ్. ఉపరితలంపై ల్యాండర్ దిగేటపుడు పాడవకుండా ఉండేందుకు శక్తివంతమైన కాళ్లు సిద్ధంచేస్తున్నాం. ఈ ప్రక్రియలో ఏవైనా పొరపాట్లు జరిగితే, ప్రయోగం సజావుగా సాగేందుకు ‘మరో పరిష్కారం’ రంగంలోకి దిగుతుంది. ‘చంద్రుడిని చేరే క్రమంలో ఎంత ఎత్తులో ప్రయాణించాల్సి రావచ్చు? చంద్రుడి ఉపరితలంపై సమస్యలు లేని స్థలాల గుర్తింపు వంటి అంశాల్లో మరింత స్పష్టత సాధిస్తున్నాం’ అని అన్నారు.
'Rozgar Mela': కొత్తగా 10 లక్షల మందికి ఉద్యోగాలు
దేశంలో యువతకు కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక అందజేస్తోంది. ఏకంగా 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ‘రోజ్‌గార్ మేళా’ను ప్రధాని మోదీ అక్టోబర్ 22న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందిన 75,000 మందికి ఇదే కార్యక్రమంలో నియామక పత్రాలు అందజేస్తారని ప్రధాని కార్యాలయం(పీఎంఓ) పేర్కొంది. ప్రధాని∙ఆశయ సాధనలో రోజ్‌గార్ మేళా ఒక కీలకమైన ముందడుగు అని అభివర్ణించింది. ప్రతిపక్షాలు ప్రధానంగా నిరుద్యోగ సమస్యను లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని తరచుగా ఇరుకునపెడుతున్న సంగతి తెలిసిందే. ఏడాదిన్నర కాలంలో కొత్తగా 10 లక్షల మందిని నియమించుకోవడానికి మిషన్ మోడ్‌లో పనిచేయాలని వివిధ ప్రభుత్వ విభాగాలను ప్రధాని జూన్‌లో ఆదేశించారు. ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల సంఖ్య, ఖాళీలపై కేంద్రం సమీక్ష నిర్వహించింది. ఖాళీల సంఖ్య తేలడంతో వాటిని భర్తీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Also read: Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 20th కరెంట్ అఫైర్స్
నియామకాల ప్రక్రియ 22న
దేశవ్యాప్తంగా ఈ నెల 22న సాగే నియామక ప్రక్రియలో 38 కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు పాల్గొంటాయి. గ్రూప్–ఎ, గ్రూప్–బి(గెజిటెడ్), గ్రూప్–బి(నాన్–గెజిటెడ్), గ్రూప్–సి స్థాయిల్లో కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటాయి. రోజ్‌గార్ మేళా ద్వారా సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్స్ పర్సనల్, సబ్–ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, ఎల్‌డీసీ, స్టెనో, ఇన్‌కం ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, మల్టి–టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్) తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు సొంతంగా లేదా యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ తదితర రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారా నూతన నియామకాలు చేపడతాయి.
Also read: 90th INTERPOL General Assembly: గుర్తుగా 100 రూపాయల నాణాన్ని మోదీ విడుదల చేశారు
పర్యావరణానికి ‘లైఫ్’: మిషన్ లైఫ్‌ను ప్రారంభించిన మోదీ
కెవాడియా: వాతావరణ మార్పుల కారణంగా విధ్వంసకరమైన పరిణామాల నుంచి మన భూమండలాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా భారత్ ఆధ్వర్యంలో ఒక అంతర్జాతీయ కార్యాచరణ రూపు దిద్దుకుంది. ప్రధాని మోదీ, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ సంయుక్తంగా మిషన్ లైఫ్(లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్)ను ప్రారంభించారు. ప్రజలు తమ జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, దీనిని ప్రపంచ దేశాల ప్రజల్లోకి ఒక ఉద్యమంలా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం దగ్గర అక్టోబర్ 20న లైఫ్ మిషన్‌ను ప్రారంభించారు. ప్రజలు లైఫ్ స్టైల్‌లో మార్చుకోవాల్సిన జాబితాతో పాటు లైఫ్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ మిషన్ పీ3 మోడల్ అని ప్రో ప్లేనెట్, పీపుల్‌గా వ్యాఖ్యానించారు. ‘రెడ్యూస్, రీయూజ్, రీ సైకిల్’ విధానాన్ని అందరూ అనుసరించాలని ప్రధాని పిలుపునిచ్చారు.
Also read: Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 19th కరెంట్ అఫైర్స్
ప్రకృతి వనరుల్ని అతిగా వాడొద్దు : గుటెరస్
ప్రకృతి వనరుల్ని అతిగా వినియోగించడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతోందని గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. జీ–20 దేశాలు 80 శాతం గ్రీన్ హౌస్ వాయువుల్ని విడుదల చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చెప్పిన మాటల్ని గుటెరస్ గుర్తు చేసుకున్నారు. ‘‘ప్రతీ ఒక్కరి అవసరాలు తీర్చే వనరులు ఈ భూమిపై ఉన్నాయి. కానీ అందరి అత్యాశలను నెరవేర్చే శక్తి భూమికి లేదు. దురదృష్టవశాత్తూ ఇవాళ రేపు ప్రతీ ఒక్కరూ అత్యాశకి పోతున్నారు. దానిని మనం మార్చాలి’’ అని కొన్ని దశాబ్దాల కిందటే గాందీజీ చెప్పారని ఇప్పటికీ అది అనుసరణీయమని వ్యాఖ్యానించారు. భారత్ తీసుకువచ్చిన ఈ కార్యాచరణని ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయి.
భారత్‌ను దెబ్బతీసిన వాతావరణ మార్పులు
న్యూఢిల్లీ: వాతావరణ మార్పులు మన దేశాన్ని ఆర్థికంగా కూడా తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నాయి. 2021లో వడగాడ్పులకి భారత్‌కి 15,900 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని క్లైమేట్ ట్రాన్స్‌పరెన్సీ రిపోర్ట్–2022 వెల్లడించింది. పర్యావరణం, వాతావరణ మార్పులపై అధ్యయనం చేస్తున్న కొన్ని అంతర్జాతీయ సంస్థలు కలసికట్టుగా ఈ నివేదిక రూపొందించాయి. వ్యవసాయం, నిర్మాణం, తయారీ, సేవా రంగాల్లో ఈ నష్టం వాటిల్లింది. దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో 5.4% నష్టం జరిగినట్టు ఆ నివేదిక వివరించింది.
Also read: Quiz of The Day (October 19, 2022): ఆస్తి హక్కును భారత రాజ్యాంగం నుంచి ఎప్పుడు తొలగించారు?
ఆ నివేదికలో ఏముందంటే..!
- మండే ఎండలతో గత ఏడాది దేశంలో 16,700 పని గంటలు వృథా అయ్యాయి. 1990–1999తో పోల్చి చూస్తే 39% పెరిగింది.
- 2016–2021 మధ్య కాలంలో తుపానులు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి 3.6 కోట్ల హెక్టార్లలో పంటలకి నష్టం వాటిల్లింది. దీంతో రైతన్నలు 375 కోట్ల డాలర్లు నష్టపోయారు.
- దేశంలో 30 ఏళ్లలో వర్షాలు పడే తీరులో ఎన్నో మార్పులు వచ్చాయి. వ్యవసాయం, అటవీ, మత్స్య ఆర్థిక ప్రభావాన్ని కనబరిచింది.
- 1850–1900 మధ్య కాలంతో పోల్చి చూస్తే భూ ఉష్ణోగ్రతలు 1.1 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి
- వాతావరణ మార్పుల ప్రభావం అన్ని దేశాలతో పాటు భారత్‌పై రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నిలువ నీడ లేని వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది.
- వాతావరణ మార్పులతో జరుగుతున్న నష్టాన్ని అరికట్టాలంటే ప్రపంచ దేశాలు భూ ఉష్ణోగ్రతల్ని 2 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గించడానికి కృషి చేయాలి. 2015 పారిస్ ఒప్పందాన్ని అన్ని దేశాలు వినియోగించడమే దీనికి మార్గం.
- పర్యావరణ మార్పుల్ని కట్టడి చేయాలంటే మనం వాడుతున్న ఇంధనాలను మార్చేసి, పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు చేపట్టాల్సి అవసరం ఉందని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్‌లో ఎర్త్ సైన్సెస్, క్లైమేట్ చేంజ్ డైరెక్టర్ సురుచి భద్వాల్ పేర్కొన్నారు.
Awarded: యాదాద్రి ఆలయానికి ‘గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్’ పురస్కారం
సాక్షి, హైదరాబాద్/యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి 2022 – 2025 సంవత్సరాలకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సంస్థ ప్రదానం చేసే ‘గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్’ (ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్రం) అవార్డు లభించింది. ప్రధానాలయాన్ని పూర్తిగా కృష్ణశిలతో పునఃనిర్మించడంతో పాటు కొండ చుట్టూ ఆకుపచ్చగా తీర్చిదిద్దడం, నీటిశుద్ధి నిర్వహణ, ఆలయ అభివృద్ధిలో నిబంధనలు, పరిరక్షణకు పలు చర్యలు పాటించడాన్ని పరిగణనలోకి తీసుకొని యాదాద్రి క్షేత్రానికి ఈ అవార్డును ప్రకటించారని వైటీడీఏ వైస్‌చైర్మన్ కిషన్‌రావు అక్టోబర్ 20నఒక ప్రకటనలో తెలిపారు.
Also read: Booker Prize : శ్రీలంక రచయిత షెహాన్ కరుణతిలకకు ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్
World Shooting Championship: అనీశ్ – సిమ్రన్‌లకు సిల్వర్
కైరో: వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ మరో రజత పతకాన్ని గెలుచుకుంది. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత ద్వయం రెండో స్థానంలో నిలిచింది. ఫైనల్లో అనీశ్ – సిమ్రన్‌ప్రీత్ కౌర్ ద్వయం 14–16 స్కోరుతో ఉక్రెయిన్‌కు చెందిన యులి యా కొరొస్టైలోపొవా – మాక్సిమ్ హొరడైనెట్స్ చేతిలో పరాజయంపాలైంది. తాజా వెండి పతకంతో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్ మొత్తం పతకాల సంఖ్య 26కు చేరగా, జట్టు రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇందులో 10 స్వర్ణాలు, 6 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి.
World Under-23 Wrestling Championship: అంకుశ్‌కు రజతం
పాంటివెడ్రా (స్పెయిన్): ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. మహిళల 50 కేజీల విభాగంలో అంకుశ్ ఫైనల్లో ఓటమిపాలై రజతా న్ని అందుకుంది. ఫైనల్లో యుయి సుసాకి (జపాన్) చేతిలో 2 నిమిషాల్లోనే ‘ఫాల్’గా అంకుశ్ ఓటమి ఖాయమైంది. 59 కేజీల విభాగంలో రమినా మామెడొవా (లాత్వి యా) గాయంతో తప్పుకోవడంతో మాన్సికి కూడా కాంస్యం దక్కింది. పురుషుల విభాగంలో వికాస్, నితీశ్ కూడా రజతాలు గెలుచుకున్నారు. 70 కేజీల కేటగిరీలో వికాస్ 6–0 తేడాతో డైగో కొబయాషి (జపాన్)ను, 97 కేజీల విభాగంలో నితీశ్ 10–0తో ఐగర్ ఫెర్నాండో (బ్రెజిల్)ను ఓడించి కాంస్య పతకాలు గెలుచుకున్నారు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP