Skip to main content

90th INTERPOL General Assembly: గుర్తుగా 100 రూపాయల నాణాన్ని మోదీ విడుదల చేశారు

- పాక్‌తో పాటు మొత్తం 195 దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు
90th Interpol Conference in Delhi
90th Interpol Conference in Delhi

న్యూఢిల్లీ: ఉగ్రవాదులు, అవినీతిపరులు, డ్రగ్‌ స్మగ్లర్లు, వ్యవస్థీకృత నేరగాళ్లకు ఏ దేశమూ ఆశ్రయంగా మారకూడదని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వారి స్థావరాలు ఎక్కడున్నా సరే, వాటన్నింటినీ నిర్మూలించాల్సిందేనని పాకిస్తాన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇందుకు కలసికట్టుగా కృషి చేయాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. సురక్షిత ప్రపంచం అంతర్జాతీయ సమాజపు సమష్టి బాధ్యత అన్న వాస్తవాన్ని అందరూ గుర్తించాలన్నారు. ‘స్థానిక సంక్షేమం కోసం అంతర్జాతీయ సహకారం’ అన్నదే భారత నినాదమన్నారు. ‘‘సానుకూల శక్తులన్నీ పరస్పరం సహకరించుకుంటే దుష్టశక్తులు, నేరగాళ్ల పీచమణచవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. ఇంటర్‌పోల్‌ 90వ సర్వసభ్య సమావేశాన్ని అక్టోబర్ 18న ఢిల్లీలో మోదీ ప్రారంభించారు. 195 దేశాల నుంచి హోం మంత్రులు, పోలీసులు ఉన్నతాధికారులు తదితరులు సమావేశానికి హాజరయ్యారు. పాకిస్తాన్‌ తరఫున ఆ దేశ ఫెరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (FIA) డైరెక్టర్‌ జనరల్‌ మొహసిన్‌ బట్‌ పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఇంటర్‌పోల్‌ అధ్యక్షుడు అహ్మద్‌ నాజర్‌ అల్‌రైసీ, సెక్రెటరీ జనరల్‌ ఉర్గన్‌ స్టాక్‌ వేదిక వద్ద మోదీకి స్వాగతం పలికారు. సదస్సును ప్రారంభించిన అనంతరం ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గతంతో పోలిస్తే ఈ దుష్టశక్తుల వేగం పెరిగిందని అభిప్రాయపడ్డారు. ‘‘ఇలాంటి నేరాలు ఎక్కడ జరిగినా వాటిని మొత్తం మానవత్వంపై దాడిగానే చూడాలి. ఎందుకంటే ఇవి భావి తరాలను కూడా ప్రభావితం చేస్తాయి. అంతర్జాతీయ స్థాయి ముప్పులను ఎదుర్కొనేందుకు స్థానిక స్పందనలు సరిపోవు’’ అని స్పష్టం చేశారు. అందుకే వీటిని సమర్థంగా తిప్పికొట్టేందుకు ప్రపంచమంతా ఒక్కతాటిపైకి రావడం తక్షణావసరమన్నారు. సదస్సుకు గుర్తుగా 100 రూపాయల నాణాన్ని, పోస్టల్‌ స్టాంపును మోదీ విడుదల చేశారు. ఇంటర్‌పోల్‌ సదస్సు పాతికేళ్ల తర్వాత భారత్‌లో జరుగుతోంది.  

Also read: Weekly Current Affairs (Awards) Bitbank: 52వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో ఎవరు సత్కరించబడతారు?

ఉగ్రవాదం తీరు మారింది... 
పొరుగు దేశాల ప్రేరేపిత ఉగ్రవాదంతో భారత్‌ దశాబ్దాలుగా పోరాడుతోందని మోదీ గుర్తు చేశారు. ‘‘ఉగ్రవాద భూతాన్ని మిగతా ప్రపంచం గుర్తించడానికి చాలాకాలం ముందు నుంచే మేం దానితో పోరాడుతూ వస్తున్నాం. భద్రత, రక్షణ కోసం ఎంతటి మూల్యం చెల్లించాల్సి ఉంటుందో మాకు బాగా తెలుసు. ఈ పోరులో వేలాదిమంది వీరులను కోల్పోయాం’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. ఉగ్రవాదం ఆన్‌లైన్‌ బాట కూడా పట్టిందన్న వాస్తవాలను గుర్తించాలన్నారు. ‘‘ఇప్పుడు ఎక్కడో మారుమూల నుంచి ఒక్క బటన్‌ నొక్కడం ద్వారా భారీ పేలుడు సృష్టించవచ్చు. తద్వారా ఈ దుష్టశక్తులు వ్యవస్థలనే తమ ముందు సాగిలపడేలా చేసుకునే పరిస్థితి నెలకొంది’’ అంటూ ఆందోళన వెలిబుచ్చారు. వీటిని ఎదుర్కొనడానికి దేశాలు వ్యక్తిగతంగా చేసే ప్రయత్నాలు చాలవని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా పటిష్ట వ్యూహాల ద్వారా  సైబర్‌ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోగలమన్నారు. ఆ దిశగా తక్షణం విధానాలు రూపొందాలని సూచించారు. పోలీసు, చట్టపరమైన సంస్థలు పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకునేందుకు మార్గాలు కనిపెట్టాలని సూచించారు. ‘‘ప్రమాదాలను ముందే గుర్తించి హెచ్చరించే వ్యవస్థలు, రవాణా, కమ్యూనికేషన్‌ సేవలను కాపాడుకునే యంత్రాంగం, సాంకేతిక, నిఘా సమాచారాల త్వరితగత మారి్పడి తదితరాలను ఆధునీకరించుకోవాలి. అవినీతి, ఆర్థిక నేరాలు చాలా దేశాల్లో పౌరుల సంక్షేమానికి గొడ్డలిపెట్టుగా మారాయి. ఇలా దోచిన సొమ్ము అంతిమంతా ఉగ్రవాదానికి పెట్టుబడిగా మారుతోంది. యువత జీవితాలను డ్రగ్స్‌ సమూలంగా నాశనం చేస్తోంది’’ అని మోదీ అన్నారు.

Also read: Quiz of The Day (October 18, 2022): మానవ శరీరంలో చర్మం బరువు సుమారుగా ఎంత శాతం?

 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 19 Oct 2022 06:01PM

Photo Stories