Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 19th కరెంట్ అఫైర్స్
IIT-Roorkee Researchers: శ్వాసతోనే క్యాన్సర్‌ను కనిపెట్టొచ్చు
రూర్కీ: రొమ్ము, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్‌ను వ్యయప్రయాసలు లేకుండా కేవలం శ్వాస ఆధారంగానే కనుగొనే కొత్త విధానాన్ని ఐఐటీ–రూర్కీ పరిశోధకులు అభివృద్ధిచేశారు. ప్రొఫెసర్ ఇంద్రాణి లాహిరి, ప్రొఫెసర్ పార్థా రాయ్, ప్రొఫెసర్ దిబ్రుపా లాహిరి తదితరులు రూపొందించిన ఈ డిటెక్టర్ రంగుల వేర్వేరు గాఢతలను వివరించే కలరీమెట్రీ సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తుంది. ‘ చిన్న పరిమాణంలో ఉండే ఈ స్క్రీనింగ్ డివైజ్‌ను ఉపయోగించడం చాలా తేలిక. ఈ డివైజ్‌లోకి సంబంధిత వ్యక్తి గట్టిగా గాలి ఊదితే చాలు వెంటనే డివైజ్‌లో ఒక కలర్ కనిపిస్తుంది. ఏ రోగానికి ఏ రంగు అనేది ముందే నిర్దేశితమై ఉంటుందిగనుక వాటిని పోలిచూసి రొమ్ము, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్‌లలో ఏదైనా వ్యాధి ప్రబలిందా లేదా చెక్ చేయవచ్చు’ అని పరిశోధనలో కీలకభూమిక పోషించిన ప్రొఫెసర్ ఇంద్రాణి లాహిరి వివరించారు. ‘క్యాన్సర్‌ను తొలినాళ్లలోనే కనుగొంటే చాలా ఉత్తమం. అప్పుడే దాని నుంచి త్వరగా కోలుకునేందుకు అవకాశాలు మెరుగుపడతాయి’ అని ఐఐటీ–రూర్కీ తాత్కాలిక డైరెక్టర్ ప్రొఫెసర్ ఎంఎల్ శర్మ అన్నారు. ‘ఈ ఉపకరణంతో కోట్లాదిమంది ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రాణాంతక రోగం ముదిరి వ్యాధి చికిత్సకు లక్షలు పోసే బదులు ముందే వ్యాధిని గుర్తించేందుకు ఇది సాయపడనుంది’ అని ఆయన అన్నారు. ఈ పరికరం ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉన్న క్యాన్సర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో దీని సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. డిటెక్టర్‌ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తెచ్చేందుకు టాటా స్టీల్‌తో సాంకేతిక బదిలీ ఒప్పందాన్ని ఐఐటీ–రూర్కీ చేసుకుంది. హెల్త్ టెక్నాలజీలో విదేశాలపై ఆధారపడకుండా దేశీయ జ్ఞానాన్ని ఒడిసిపట్టేందుకే టెక్నాలజీ, న్యూ మెటీరియల్స్ బిజినెస్ పేరిట టాటా స్టీల్ విడిగా ఒక ప్రత్యేక విభాగాన్ని నిర్వహిస్తోంది. ఆరోగ్య ఉపకరణాల రంగంలో స్వావలంబనకు ఈ సంస్థ కృషిచేస్తోంది. ప్రధాని మోదీ నినదించిన ఆత్మనిర్భరత భారత్ కోసం శ్రమిస్తోంది.
Also read: Quiz of The Day (October 19, 2022): ఆస్తి హక్కును భారత రాజ్యాంగం నుంచి ఎప్పుడు తొలగించారు?
Booker Prize : శ్రీలంక రచయిత షెహాన్ కరుణతిలకకు ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్
లండన్: శ్రీలంక రచయిత షెహాన్ కరుణతిలకను ప్రఖ్యాత బుకర్ ప్రైజ్ వరించింది. లండన్‌లో అక్టోబర్ 18న రాత్రి జరిగిన కార్యక్రమంలో 2022 ఏడాదికి ‘ ది సెవెన్ మూన్స్ ఆఫ్ మాలి అల్మీడియా’ రచనకు గాను కరుణతిలకకు బుకర్ సాహిత్య పురస్కారంతోపాటు 50వేల పౌండ్లను బహూకరించారు. లండన్‌లో జరిగిన కార్యక్రమంలో బ్రిటన్ రాజు చార్లెస్ సతీమణి కెమిల్లా ఈ ట్రోఫీని కరుణతిలకకు స్వయంగా అందజేశారు. 1992 తర్వాత ఒక శ్రీలంక జాతీయుడు ఈ బుకర్ ప్రైజ్‌ను సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ‘ది సెవెన్ మూన్స్ ఆఫ్ మాలి ఆల్మీడియా’ కాల్పనిక థ్రిల్లర్ పుస్తకంలో.. శ్రీలంక అంతర్యుద్ధం తాలూకు ఘోరాలను, మానవీయ కోణాలను తన కెమెరాలతో బంధిస్తూ యుద్ధంలో మరణించిన ఒక ఫొటో జర్నలిస్ట్ కథను కరుణతిలక అద్భుతంగా ఆవిష్కరించారు. కథాగమనం గొప్పది’ అని బుకర్ ప్రైజ్ న్యాయనిర్ణేతల చైర్మన్ మ్యాక్‌గ్రిగార్ వ్యాఖ్యానించారు. పుస్తకంలో.. యుద్ధంలో మరణించిన మాలి అనే జర్నలిస్ట్ ఆ తర్వాత స్వర్గంలో కళ్లు తెరుస్తాడు. అతడిని చంపింది ఎవరు? ఎందుకు చంపారు ? వంటి మిస్టరీలను ఛేదించేందుకు అతనికి కేవలం ఏడు రోజుల సమయం మిగిలి ఉంటుంది. ఈ గడువు గడిచేలోపే కాలానికి ఎదురీదుతూ వాస్తవిక, కాల్పనిక ప్రపంచాల మధ్య తిరుగుతుంటాడు. శ్రీలంక అంతర్యుద్ధం తాలూకు ఘోరాలు, మానవీయ కోణాలు, ప్రజల కష్టాలు, తనవారి ప్రేమానురాగాలు, ఇలా ఎన్నో బంధాల తీవ్రతను మాలి ఆవిష్కరిస్తాడు. కరుణతిలక గతంలో అడ్వర్‌టైజింగ్ కాపీ రైటర్‌గా పనిచేశారు. కొన్ని పాటలు రాశారు. స్క్రీన్‌ప్లే అందించారు. ట్రావెల్‌స్టోరీలు రచించారు.
Also read: Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 18th కరెంట్ అఫైర్స్
90th INTERPOL General Assembly: గుర్తుగా 100 రూపాయల నాణాన్ని మోదీ విడుదల చేశారు
న్యూఢిల్లీ: ఉగ్రవాదులు, అవినీతిపరులు, డ్రగ్ స్మగ్లర్లు, వ్యవస్థీకృత నేరగాళ్లకు ఏ దేశమూ ఆశ్రయంగా మారకూడదని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వారి స్థావరాలు ఎక్కడున్నా సరే, వాటన్నింటినీ నిర్మూలించాల్సిందేనని పాకిస్తాన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇందుకు కలసికట్టుగా కృషి చేయాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. సురక్షిత ప్రపంచం అంతర్జాతీయ సమాజపు సమష్టి బాధ్యత అన్న వాస్తవాన్ని అందరూ గుర్తించాలన్నారు. ‘స్థానిక సంక్షేమం కోసం అంతర్జాతీయ సహకారం’ అన్నదే భారత నినాదమన్నారు. ‘‘సానుకూల శక్తులన్నీ పరస్పరం సహకరించుకుంటే దుష్టశక్తులు, నేరగాళ్ల పీచమణచవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. ఇంటర్‌పోల్ 90వ సర్వసభ్య సమావేశాన్ని అక్టోబర్ 18న ఢిల్లీలో మోదీ ప్రారంభించారు. 195 దేశాల నుంచి హోం మంత్రులు, పోలీసులు ఉన్నతాధికారులు తదితరులు సమావేశానికి హాజరయ్యారు. పాకిస్తాన్ తరఫున ఆ దేశ ఫెరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) డైరెక్టర్ జనరల్ మొహసిన్ బట్ పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇంటర్‌పోల్ అధ్యక్షుడు అహ్మద్ నాజర్ అల్‌రైసీ, సెక్రెటరీ జనరల్ ఉర్గన్ స్టాక్ వేదిక వద్ద మోదీకి స్వాగతం పలికారు. సదస్సును ప్రారంభించిన అనంతరం ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గతంతో పోలిస్తే ఈ దుష్టశక్తుల వేగం పెరిగిందని అభిప్రాయపడ్డారు. ‘‘ఇలాంటి నేరాలు ఎక్కడ జరిగినా వాటిని మొత్తం మానవత్వంపై దాడిగానే చూడాలి. ఎందుకంటే ఇవి భావి తరాలను కూడా ప్రభావితం చేస్తాయి. అంతర్జాతీయ స్థాయి ముప్పులను ఎదుర్కొనేందుకు స్థానిక స్పందనలు సరిపోవు’’ అని స్పష్టం చేశారు. అందుకే వీటిని సమర్థంగా తిప్పికొట్టేందుకు ప్రపంచమంతా ఒక్కతాటిపైకి రావడం తక్షణావసరమన్నారు. సదస్సుకు గుర్తుగా 100 రూపాయల నాణాన్ని, పోస్టల్ స్టాంపును మోదీ విడుదల చేశారు. ఇంటర్‌పోల్ సదస్సు పాతికేళ్ల తర్వాత భారత్‌లో జరుగుతోంది.
Also read: Weekly Current Affairs (Awards) Bitbank: 52వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో ఎవరు సత్కరించబడతారు?
ఉగ్రవాదం తీరు మారింది...
పొరుగు దేశాల ప్రేరేపిత ఉగ్రవాదంతో భారత్ దశాబ్దాలుగా పోరాడుతోందని మోదీ గుర్తు చేశారు. ‘‘ఉగ్రవాద భూతాన్ని మిగతా ప్రపంచం గుర్తించడానికి చాలాకాలం ముందు నుంచే మేం దానితో పోరాడుతూ వస్తున్నాం. భద్రత, రక్షణ కోసం ఎంతటి మూల్యం చెల్లించాల్సి ఉంటుందో మాకు బాగా తెలుసు. ఈ పోరులో వేలాదిమంది వీరులను కోల్పోయాం’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. ఉగ్రవాదం ఆన్‌లైన్ బాట కూడా పట్టిందన్న వాస్తవాలను గుర్తించాలన్నారు. ‘‘ఇప్పుడు ఎక్కడో మారుమూల నుంచి ఒక్క బటన్ నొక్కడం ద్వారా భారీ పేలుడు సృష్టించవచ్చు. తద్వారా ఈ దుష్టశక్తులు వ్యవస్థలనే తమ ముందు సాగిలపడేలా చేసుకునే పరిస్థితి నెలకొంది’’ అంటూ ఆందోళన వెలిబుచ్చారు. వీటిని ఎదుర్కొనడానికి దేశాలు వ్యక్తిగతంగా చేసే ప్రయత్నాలు చాలవని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా పటిష్ట వ్యూహాల ద్వారా సైబర్ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోగలమన్నారు. ఆ దిశగా తక్షణం విధానాలు రూపొందాలని సూచించారు. పోలీసు, చట్టపరమైన సంస్థలు పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకునేందుకు మార్గాలు కనిపెట్టాలని సూచించారు. ‘‘ప్రమాదాలను ముందే గుర్తించి హెచ్చరించే వ్యవస్థలు, రవాణా, కమ్యూనికేషన్ సేవలను కాపాడుకునే యంత్రాంగం, సాంకేతిక, నిఘా సమాచారాల త్వరితగత మారి్పడి తదితరాలను ఆధునీకరించుకోవాలి. అవినీతి, ఆర్థిక నేరాలు చాలా దేశాల్లో పౌరుల సంక్షేమానికి గొడ్డలిపెట్టుగా మారాయి. ఇలా దోచిన సొమ్ము అంతిమంతా ఉగ్రవాదానికి పెట్టుబడిగా మారుతోంది. యువత జీవితాలను డ్రగ్స్ సమూలంగా నాశనం చేస్తోంది’’ అని మోదీ అన్నారు.
Also read: Quiz of The Day (October 18, 2022): మానవ శరీరంలో చర్మం బరువు సుమారుగా ఎంత శాతం?
Ukraine war: అపార్టుమెంట్‌పై కూలిన రష్యా బాంబర్..
మాస్కో: అపార్టుమెంట్ భవనంపై యుద్ధ విమానం కూలిన ఘటనలో 15 మంది చనిపోయారు. రష్యాలోని అజోవ్ సముద్ర తీర నగరం యెయ్‌స్క్ లో అక్టోబర్ 18న ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. యెయెస్క్‌లోని వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన ఎస్‌యు–34 రకం శిక్షణ విమానం ఒక ఇంజిన్‌లో మంటలు చెలరేగి 9 అంతస్తులున్న ఓ అపార్టుమెంట్ భవనంపై కూలింది. దీంతో, బాంబర్ విమానంలోని వేలాది లీటర్ల ఆయిల్ ఒక్కసారిగా భగ్గుమని మండిపోయింది. అపార్టుమెంట్‌లోని కొన్ని అంతస్తులు మంటల్లో చిక్కుకున్నాయి. మంటల నుంచి తప్పించుకునేందుకు ప్రాణభయంతో పైనుంచి దూకి ముగ్గురు చనిపోగా, మిగతా వారు అగి్నకి ఆహుతయ్యారని అధికారులు తెలిపారు. విమానంలోని ఇద్దరు పైలట్లు ప్రమాదానికి ముందే దూకి తప్పించుకున్నారు. మొత్తం 15 మంది మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారు. క్షతగాత్రులైన మరో 19 మందిని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే అపార్టుమెంట్‌లోని 500 మంది నివాసితులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. అగి్నమాపక సిబ్బంది కొన్ని గంటలపాటు శ్రమించి, మంటలను అదుపులోకి తెచ్చారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా వైమానిక దళం వాడే విమానాల్లో అధునాతన సెన్సర్లు, ఆయుధ వ్యవస్థలున్న ఎస్–34 సూపర్‌సోనిక్ ట్విన్ ఇంజిన్ బాంబర్ ముఖ్యమైంది.
Also read: Ukraine war: కీవ్‌పై డ్రోన్ బాంబులు
YouGov Gallup Survey: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సునాక్‌దే పైచేయి
యూగవ్ తాజాగా నిర్వహించిన గ్యాలప్ పోల్‌లో అధికార కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లో కేవలం 25 శాతం మంది మాత్రమే మళ్లీ ట్రస్‌కు ఓటేస్తామన్నారు. రిషి వైపు 55% మంది మొగ్గు చూపారు. పన్నుల్లో కోత పెట్టి, వివాదాస్పదం కావడంతో వాటిని ఉపసంహరించుకున్న లిజ్‌ట్రస్ నాయకత్వంపై విమర్శలు చెలరేగుతున్న వేళ ఈ సర్వే చేపట్టారు. ప్రధాని పదవికి, పార్టీ నాయకత్వ పదవికి రాజీనామా చేయాలని 55 శాతం మంది కోరుకుంటుంటుండగా, కొనసాగాలని 38% మంది మాత్రమే కోరుకోవడం గమనార్హం. పార్టీ గేట్ కుంభకోణంతో తప్పుకున్న మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను సరైన ప్రత్యామ్నాయంగా 63 శాతం మంది పేర్కొనడం విశేషం. ప్రధానిగా జాన్సన్‌ను 32%, రిషిని 23 శాతం బలపరిచారు.
తప్పులు చేశాం..క్షమించండి: లిజ్ ట్రస్
ప్రధాని లిజ్‌ట్రస్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం కావడంతోపాటు, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ఇబ్బందుల్లో నెట్టాయి. సొంత పార్టీ సభ్యుల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆమె తొలిసారిగా స్పందించారు. ‘మేం తప్పులు చేశామని గుర్తించాను. ఆ తప్పిదాలకు నన్ను క్షమించండి. ఇప్పటికే ఆ తప్పులను సరిచేసుకున్నాను. కొత్త ఆర్థిక మంత్రిని నియమించాను. ఆర్థిక స్థిరత్వం, క్రమశిక్షణను పునరుద్ధరించాం’అని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు పార్టీ నేతగా కొనసాగుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 24వ తేదీలోగా ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు పాలక కన్జర్వేటివ్ పారీ్టకి చెందిన 100 మంది సభ్యులు యోచిస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Football: కరీమ్ బెంజెమాకు ‘గోల్డెన్ బాల్’
యూరోపియన్ అత్యుత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్‌కు ప్రదానం చేసే ప్రతిష్టాత్మక పురస్కారం ‘గోల్డెన్ బాల్’ను ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు, రియల్ మాడ్రిడ్ క్లబ్ జట్టు సభ్యుడు కరీమ్ బెంజెమా సొంతం చేసుకున్నాడు. గత సీజన్‌లో చాంపియన్స్ లీగ్ టైటిల్‌ను, స్పానిష్ లీగ్ టైటిల్స్‌ను మాడ్రిడ్ క్లబ్ గెల్చుకోవడంలో 34 ఏళ్ల కరీమ్ కీలకపాత్ర పోషించాడు. 2009 నుంచి మాడ్రిడ్ జట్టుకు ఆడుతున్న కరీమ్ 223 గోల్స్ సాధించాడు. 24 ఏళ్ల తర్వాత (1998లో జిదాన్) ఫ్రాన్స్ ప్లేయర్‌కు ‘గోల్డెన్ బాల్’ అవార్డు లభించింది.
Pistol World Championship 2022: ఇషా జట్టుకు స్వర్ణం
కైరో (ఈజిప్ట్): ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో భారత షూటర్ల పసిడి వేట కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్‌లో తాజాగా భారత్‌కు మరో మూడు స్వర్ణ పతకాలు లభించాయి. జూనియర్ మహిళల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్, వర్షా సింగ్, శిఖా నర్వాల్‌లతో కూడిన భారత జట్టు పసిడి పతకం గెలిచింది. ఫైనల్లో భారత్ 16–6తో చైనా జట్టును ఓడించింది. జూనియర్ మహిళల ఎయిర్ రైఫిల్ టీమ్ ఫైనల్లో తిలోత్తమా సేన్, నాన్సీ, రమితాలతో కూడిన భారత జట్టు 16–2తో చైనా జట్టుపై గెలిచి స్వర్ణం నెగ్గింది. జూనియర్ పురుషుల ఎయిర్ రైఫిల్ టీమ్ ఫైనల్లో శ్రీ కార్తీక్ శబరి రాజ్, దివ్యాంశ్ సింగ్ పన్వర్, విదిత్ జైన్‌లతో కూడిన భారత జట్టు 17–11తో చైనా జట్టుపై గెలిచి బంగారు పతకం సాధించింది. ఇప్పటి వరకు ఈ టోరీ్నలో భారత్ 9 స్వర్ణాలు, 3 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 20 పతకాలతో రెండో స్థానంలో ఉంది.
Also read: ISSF: ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఐదో స్వర్ణం
New BCCI President: బిన్నీ చేతికి బోర్డు పగ్గాలు
ముంబై: మరోసారి మరో మాజీ క్రికెటరే బోర్డు పాలకుడయ్యారు. తొలి వన్డే ప్రపంచకప్ (1983) గెలిచిన టీమిండియా సభ్యుడు, 67 ఏళ్ల రోజర్ బిన్నీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ కెపె్టన్ సౌరవ్ గంగూలీ తర్వాత మళ్లీ ఆటగాడే బోర్డు పగ్గాలు చేపట్టారు. మంగళవారం జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో పదవులన్నీ కూడా పోటీలేకుండానే నామినేషన్ వేసిన వాళ్లందరికీ దక్కాయి.
Also read: T20: ‘లక్నో’ జట్టు గ్లోబల్ మెంటార్‌గా గంభీర్
కొత్త కార్యవర్గం: రోజర్ బిన్నీ (అధ్యక్షుడు), జై షా (కార్యదర్శి), రాజీవ్ శుక్లా (ఉపాధ్యక్షుడు), దేవ్‌జిత్ సైకియా (సంయుక్త కార్యదర్శి), ఆశిష్ షెలార్ (కోశాధికారి).
ఐపీఎల్ చైర్మన్‌గా ధుమాల్
గంగూలీ నేతృత్వంలోని బోర్డులో ఇన్నాళ్లూ కోశాధికారిగా పనిచేసిన అరుణ్ ధుమాల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొత్త చైర్మన్‌గా ఎన్నికయ్యారు. బ్రిజేశ్ పటేల్ స్థానంలో ఆయన్ని నియమించారు. ఎమ్‌కేజే మజుందార్‌ను బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ప్రతినిధిగా ఎన్నుకున్నారు.
Also read: IPL 2023 :మళ్లీ ఈ ఫార్మాట్‌లోనే ఐపీఎల్ .. : సౌరవ్ గంగూలీ
అమ్మాయిల ఐపీఎల్‌కు జై
బోర్డు ఏజీఎంలో ఐపీఎల్ తరహా అమ్మాయిల లీగ్‌కు ఆమోదం లభించింది. వచ్చే ఏడాది మార్చిలో ఐదు జట్లతో మహిళల ఐపీఎల్ జరుగుతుంది. అయితే జట్లను ఎలా విక్రయించాలి, టోర్నీని ఏ విధంగా నిర్వహించాలనే అంశాలను కొత్త గవరి్నంగ్ కౌన్సిల్ నిర్ణయిస్తుందని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
Also read: ICC Rankings: కోహ్లి 14 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు
ఏటా రూ. వేల కోట్లు పెరుగుదల
ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డు (బీసీసీఐ) నగదు నిల్వలు ఏటికేడు వేల కోట్లు పెరిగిపోతున్నాయి. మూడేళ్ల క్రితం పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఆధ్వర్యంలో ఉన్నపుడు రూ. 3,648 కోట్లుగా ఉన్న బోర్డు కోశాగారం ఇప్పుడు రూ. 9,629 కోట్లకు చేరింది. కేవలం మూడేళ్లలోనే రూ. 5,981 కోట్లు పెరిగాయి. దాదాపు 3 రెట్లు ఆదాయం పెరిగింది. అలాగే రాష్ట్ర సంఘాలకు వితరణ కూడా ఐదు రెట్లు పెంచారు. సీఓఏ జమానాలో రూ. 680 కోట్లు ఇస్తుండగా... ఇప్పుడది రూ.3,295 కోట్లకు పెరిగిందని కోశాధికారి పదవి నుంచి దిగిపోతున్న అరుణ్ ధుమాల్ ఏజీఎంలో ఖాతాపద్దులు వివరించారు.
క్రికెటర్ల గాయాలపై దృష్టి పెడతాం.
ఆటగాళ్లు తరచూ గాయాలపాలయ్యే పరిస్థితుల్ని తగ్గిస్తాం. దీనికోసం అందుబాటులో ఉన్న అవకాశాల్ని పరిశీలించి, పరిస్థితిని మెరుగుపరుస్తాం. బెంగళూరు అకాడమీ (ఎన్‌సీఏ)లో డాక్టర్లు, ఫిజియోల బృందం ఈ పనిలో నిమగ్నమవుతాయి. దేశవాళీ పిచ్‌లను పోటీతత్వంతో ఉండేలా తీర్చిదిద్దుతాం. ఆస్ట్రేలియాలాంటి దేశాలకు దీటుగా పిచ్‌లను తయారు చేస్తాం. –రోజర్ బిన్నీ
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP