Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 18th కరెంట్ అఫైర్స్
కొత్త CJI నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర
న్యూఢిల్లీ: నూతన సీజేఐగా జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్‌ను నియమిస్తూ సంబంధిత ఉత్తర్వుపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకంచేశారు. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ సిఫార్సు తర్వాత సంబంధించి ప్రతిని కేంద్ర న్యాయశాఖ.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపగా ఆమె ఆమోదించారని ఆ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు తెలిపారు. నవంబర్ 9న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణంచేస్తారని రిజెజు ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అప్పటి నుంచి రెండు సంవత్సరాలపాటు అంటే 2024 నవంబర్ పదోతేదీ దాకా ఆయన సీజేఐగా కొనసాగుతారు. కొత్త సీజేగా నియామకపత్రాన్ని ప్రధాని ప్రధాన సలహాదారు పీకే మిశ్రా, న్యాయశాఖ ఉన్నతాధికారులు స్వయంగా జస్టిస్ చంద్రచూడ్‌కు అందజేశారు. ప్రస్తుత సీజేఐ లలిత్ కేవలం 74 రోజులే ఆ బాధ్యతల్లో కొనసాగి రిటైర్‌కానున్నారు.
సాధారణంగా సుప్రీంకోర్టు జడ్జి 65 ఏళ్ల వయసురాగానే రిటైర్‌అవుతారు.
Also read: Local Language: కోర్టుల్లో స్థానిక భాష... ఆలిండియా న్యాయ మంత్రుల సదస్సులో మోదీ
భూమి దీర్ఘవృత్తంగా ఉండును!
భూమి గుండ్రంగా ఉండును. ఇది చిన్నప్పటి నుంచీ మనమంతా వింటున్నదే. నిజానికి పూర్తిగా గుండ్రంగా కాకుండా ఓ మాదిరి దీర్ఘవృత్తాకారంలో ఉందట. అసలు ఆ మాటకొస్తే భూమి ఇంకా పూర్తి రూపాన్ని సంతరించుకునే క్రమంలోనే ఉందట. దీర్ఘవృత్తాకారం రావడానికి కారణమైన గురుత్వాకర్షణ శక్తే భూమికి ఓ నిశ్చిత రూపాన్నిచ్చే పనిలో మునిగి ఉందని సైంటిస్టులు చెబుతుండటం విశేషం! భూమిపై నుంచి అంతరిక్షంలోకి జారిపోకుండా మనల్ని కాపాడుతున్నది, భూమిపై పట్టి ఉంచుతున్నది గురుత్వాకర్షణ శక్తేనన్నది తెలిసిందే. భూమికి ఆ శక్తే భూమిని లోలోపలి నుంచి సమ్మెట పోట్లను తలపించేలా ఒత్తిడి చేసీ చేసీ దీర్ఘవృత్తాకారానికి తీసుకొచ్చిందట. భూమి కేంద్రానికి, ఉపరితలానికి మధ్య దూరం భూమధ్యరేఖ వద్ద ఒకలా, ధ్రువాల వద్ద ఇంకోలా ఉండటానికి ఈ దీర్ఘవృత్తాకారమే కారణమట. భూమి రూపాన్ని తీర్చిదిద్దే ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉందని తాజాగా కనిపెట్టామంటున్నారు అంతరిక్ష శాస్త్రవేత్తలు. భూమి ఆకారాన్ని నిర్దేశించడంలో గురుత్వాకర్షణ శక్తితో పాటు ఎగుడుదిగుడు ఉపరితలం, లోపలి పొరల్లో ఉన్న వనరుల అసమతుల విస్తృత వంటి పలు ఇతర కారకాల ప్రమేయమూ ఉందని పరిశోధన తేల్చింది. ఒకప్పుడు భూమిపై 30 కిలోమీటర్ల పై చిలుకు ఎత్తు దాకా ఉన్న పర్వతాలు గురుత్వాకర్షణ శక్తి వల్లే క్రమంగా తగ్గుతూ వచ్చాయట. భూమిపై ఉన్న విభిన్న స్థలాకృతులు, పై పొరల కదలికలు తదితరాలు కూడా ఇందుకు కారణమయ్యాయని తేలింది. భూమి ఎలా ఏర్పడిందో అర్థం చేసుకునే ప్రయత్నానికి ఈ తాజా ఆవిష్కరణలు కొత్త కోణాలను అందిస్తున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు.
Also read: ఆక్సిజన్ ‘స్థాయి’లో మార్పును బట్టి గ్రహాలపై జీవం గుట్టు పట్టేయొచ్చు
BioNTech: త్వరలో క్యాన్సర్ వ్యాక్సిన్!
క్యాన్సర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఇక ఎంతో సమయం పట్టదని ఈ ప్రాణాంతక వ్యాధిపై సుదీర్ఘ కాలంగా పరిశోధన చేస్తున్న దంపతులు, ‘బయో ఎన్‌టెక్’ వ్యాక్సిన్ల తయారీ సంస్థ అధినేలు ప్రొఫెసర్ ఉగుర్ సాహిన్, ప్రొఫెసర్ ఓజ్లెమ్ టురేసి చెబుతున్నారు. మహా అయితే ఎనిమిదేళ్లలోపే క్యాన్సర్ వ్యాక్సిన్ వాడుకలోకి రాబోతోందని వివరించారు. ప్రముఖ వార్తాసంస్థ బీబీసీ ఇంటర్వ్యూలో వారు ఈ మేరకు వెల్లడించారు. ‘‘మేం డాక్టర్లుగా బాధితుల వెతలు, నిరాశా నిస్పృహలు చూసి చలించిపోయేవాళ్లం. ఆ అనుభవమే క్యాన్సర్ పరిశోధనల వైపు మళ్లించింది’’ అన్నారు. ‘‘కరోనాకు మంచి వ్యాక్సిన్ తయారు చేస్తున్న క్రమంలో ఆ పరిశోధన అనుకోకుండా క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేలా మలుపు తిరిగింది. ఇది మెసెంజర్ ఆర్‌ఎన్‌ఏ సాంకేతికతతో రూపొందించిన వ్యాక్సిన్. మన ఒంట్లోని వ్యాధినిరోధక శక్తే క్యాన్సర్ కణాలను గుర్తించి తుదముట్టించేలా ఇది పని చేస్తుంది’’ అని డాక్టర్ సాహిన్ చెప్పారు. తమ వ్యాక్సిన్ అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుందని ఘంటాపథంగా చెప్పారు. అది క్యాన్సర్ కణాలను నేరుగా తుదముట్టించేలా రూపొందిందని టురేసి వివరించారు. ‘‘ట్రయల్స్‌లో బాధితులపై వ్యాక్సిన్‌ను వాడుతున్నప్పుడు ఎదురైన అడ్డంకులు దీన్ని మరింత ప్రభావవంతంగా మార్చేలా చేశాయి’’ అని దంపతులు చెప్పారు. ఈ పరిశోధనల వివరాలు తొలుత బిజినెస్ ఇన్‌సైడర్ మ్యాగజైన్‌లో ప్రచురితమయ్యాయి.
Also read: Human intelligence: ల్యాబ్‌లోని మెదడు కణాలూ వీడియోగేమ్ ఆడేశాయ్
యాంటీబాడీలకు చిక్కని బీఏ.2.75.2 సబ్ వేరియంట్
లండన్: కరోనా వైరస్‌లో(సార్స్–కోవ్–2) కొత్తగా పుట్టుకొచ్చిన బీఏ.2.75.2 అనే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ప్రమాదకరంగా పరిణమిస్తున్నట్లు స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్ పరిశోధకులు గుర్తించారు. ఇది మనుషుల రక్తంలోని ప్రతిరక్షకాల (యాంటీబాడీలు) నుంచి సమర్థంగా తప్పించుకున్నట్లు తేల్చారు. అంతేకాకుండా ఇప్పుడు అందుబాటులో ఉన్న కోవిడ్–19 యాంటీబాడీ చికిత్సలను కూడా తట్టుకుంటున్నట్లు చెప్పారు. ఈ పరిశోధన వివరాలను లాన్సెట్ అంటువ్యాధుల పత్రికలో ప్రచురించారు. ప్రస్తుత శీతాకాలంలో కరోనా మహమ్మారని ముప్పు పొంచి ఉందని, అందుకే ముందుజాగ్రత్తగా అప్‌డేటెడ్ టీకాలు తీసుకోవాలని, రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని పరిశోధకులు సూచించారు. కరోనా ఒమిక్రాన్‌లోని బీఏ.2.75 అనే వేరియంట్ ఉత్పరివర్తనం చెందడంతో బీఏ.2.75.2 ఉప వేరియంట్ పుట్టినట్లు కనిపెట్టారు. ఈ ఏడాది మొదట్లోనే ఇది బయటపడింది. కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికైతే తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నప్పటికీ భవిష్యత్తులో ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పలేమన్నది పరిశోధకులు మాట. కోవిడ్–19 బారిన పడే అవకాశం అధికంగా ఉన్నవారికి యాంటీవైరల్ ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది.
Also read: CMFRI: కాలేయంలో కొవ్వుకు సముద్రపు నాచుతో పరిష్కారం
Ukraine war: కీవ్‌పై డ్రోన్ బాంబులు
కీవ్: వారాంతం ముగిసి సోమవారం విధుల్లోకి వెళ్లే ఉద్యోగులతో బిజీగా మారిన ఉక్రెయిన్ రాజధానిని రష్యా డ్రోన్లు చుట్టుముట్టాయి. ఆత్మాహుతి బాంబర్లుగా మారి బాంబుల వర్షం కురిపించాయి. దీంతో బాంబు శబ్దాల హోరుతో కీవ్ దద్దరిల్లింది. ప్రాణభయంతో జనం సమీప సురక్షిత ప్రాంతాలకు పరుగులుతీశారు. బాంబుల ధాటికి పలు భవనాలు నేలమట్టమయ్యాయి. కొద్దిరోజులుగా కీవ్‌పై దాడి ఎక్కుపెట్టిన రష్యా వైమానిక దళం దెబ్బకు రాజధాని ప్రజలు నిరంతరం ఆకాశం వైపు చూస్తూ భయంభయంగా బయట సంచరిస్తున్నారు. గతంలో క్షిపణి దాడులకు దిగిన రష్యా బలగాలు ఈసారి ఇరాన్ తయారీ షహీద్(జెరాన్–2) డ్రోన్లకు పనిచెప్పాయి. కీవ్‌లో ధ్వంసమైన ఒక భవంతి శిథిలాల నుంచి 18 మందిని ఉక్రెయిన్ సేనలు సురక్షితంగా కాపాడాయి. సోమవారం నాటి దాడిలో గర్భిణిసహా నలుగురు మరణించారు.
Also read: Ukraine: ఖేర్సన్‌పై పట్టు బిగిస్తున్న ఉక్రెయిన్
China’s Communist Party Congress: ఆర్థిక వ్యవస్థ పునర్వైభవం ఖాయం.. జాతీయ సదస్సులో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా స్పష్టికరణ
బీజింగ్: ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక మందగమనం పెద్ద సమస్యేమీ కాదని, తమ దేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే పుంజుకోవడం ఖాయమని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) ధీమా వ్యక్తం చేసింది. మరిన్ని విదేశీ పెట్టుబడుల కోసం ద్వారాలు తెరుస్తామని ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణే లక్ష్యంగా సీపీసీ 20వ జాతీయ సదస్సులో సోమవారం నూతన ఆర్థిక విధానంపై విస్తృతంగా చర్చించారు. 2,300 మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు. వాస్తవానికి 2022లో 5.5 శాతం వృద్ధి సాధించాలని చైనా సర్కారు లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ, అది సాధ్యం కాదని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు తేల్చిచెప్పాయి. 3.2 శాతం వృద్ధిని ఐఎంఎఫ్, 2.8 శాతం వృద్ధిని ప్రపంచ బ్యాంకు అంచనా వేశాయి. చైనా అధినేత షీ జిన్‌పింగ్ కఠినంగా అమలు చేస్తున్న జీరో కోవిడ్ పాలసీ వల్ల ఆర్థిక ప్రగతి క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసిక నుంచి ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టడం తథ్యమని నేషనల్ డెవలప్‌మెంట్, రిఫామ్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ ఝవో చెన్‌న్ చెప్పారు. కొత్త పరిశ్రమలు, తద్వారా కొత్త ఉద్యోగాల సృష్టికి కృషి చేస్తున్నామని వివరించారు.
Also read: Great Hall Of The People: చైనాలో తైవాన్ అంతర్భాగం.. బలప్రయోగానికీ వెనుకాడం
50 లక్షల మందిపై దర్యాప్తు
అవినీతిని సహించే ప్రసక్తే లేదని చైనా కమ్యూనిస్ట్ పార్టీ తేల్చిచెప్పింది. గత పదేళ్లలో అవినీతి ఆరోపణల కింద తమ పార్టీలో 50 లక్షల మంది సభ్యులపై దర్యాప్తు చేసినట్లు వెల్లడించింది. 553 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపింది. అధికార దుర్వినియోగానికి పాల్పడడం, లంచాలు ఇవ్వడం, లంచాలు తీసుకోవడం వంటివాటిలో భాగస్వాములైతే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించింది. చైనా కమ్యూనిస్ట్ పారీ్టలో 9.6 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. గత పదేళ్లలో 2,07,000 మందికి వివిధ రకాల శిక్షలు విధించినట్లు పార్టీ క్రమశిక్షణా కమిటీ ఉప కార్యదర్శి షియావో తెలిపారు.
Also read: Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 17th కరెంట్ అఫైర్స్
'PM-Kisaan': రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.16,000 కోట్లు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం–కిసాన్) 12వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ అర్హులైన రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. అక్టోబర్ 17న ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, ఎరువుల శాఖల ఆధ్వర్యంలో ప్రారంభమైన పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్–2022 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 12వ విడతలో దాదాపు రూ.16,000 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి చేరాయి. దీంతో ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ.2.16 లక్షల కోట్ల సాయం అందించినట్లయ్యింది. ఏటా 11 కోట్ల మంది రైతన్నలు లబ్ధి పొందుతున్నారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం–కిసాన్ కింద అర్హులకు ప్రతి సంవత్సరం రూ.6,000 మూడు విడతల్లో అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి నాలుగో నెలలకోసారి రూ.2,000ను వారి ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నారు. ఈ పథకాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే అమలు చేస్తోంది.
Also read: FCI: ఐదేళ్ల కనిష్టానికి ఆహార ధాన్యాల నిల్వలు
కిసాన్ సమృద్ధి కేంద్రాలు ప్రారంభం
‘ఒకే దేశం, ఒకే ఎరువుల పథకం’లో భాగంగా ‘భారత్’ బ్రాండ్ రాయితీ యూరియాను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల ఆవిష్కరించారు. అలాగే 600 పీఎం–కిసాన్ సమృద్ధి కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ రెండు చర్యల వల్ల రైతులకు నాణ్యమైన ఎరువులు సకాలంలో అందుతాయని చెప్పారు. అంతర్జాతీయ ఎరువుల ఈ–వారపత్రిక ‘ఇండియన్ ఎడ్జ్’ను సైతం మోదీ ఆవిష్కరించారు.
Also read: Digital Transactions: వృద్ధి గతిని మార్చిన డిజిటల్ బ్యాంకింగ్
ఖజానాపై ‘ఎరువుల’ భారం
కిసాన్ సమృద్ధి కేంద్రాల్లో రైతులకు బహుళ సేవలు అందుతాయని తెలియజేశారు. ఇవి ‘వన్ స్టాప్ షాప్’గా పని చేస్తాయన్నారు. దేశవ్యాప్తంగా 3.25 లక్షల రిటైల్ ఎరువుల దుకాణాలను కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా మార్చబోతున్నట్లు ప్రకటించారు. ఎరువుల కోసం మనం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని, ఎరువులపై కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా రూ.2.5 లక్షల కోట్ల మేర రాయితీ భారం భరిస్తోందన్నారు. ఒక్కో కిలో ఎరువును రూ.80కి కొని, రైతులకు రూ.6కు అమ్ముతున్నామని చెప్పారు. ఎరువులతోపాటు ముడి చమురు, వంట నూనెల దిగుమతుల భారం సైతం పెరుగుతోందన్నారు. దిగుమతుల బిల్లు తగ్గించుకోవాలని, ఎరువులు, వంట నూనెల ఉత్పత్తిలో స్వయం స్వావలంబన సాధించాలని, ఈ విషయంలో మిషన్ మోడ్‌లో పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్‌లో దాదాపు 1,500 వ్యవసాయ స్టార్టప్ కంపెనీలు తమ ఉత్పత్తులను, నవీన ఆవిష్కరణలను ప్రదర్శించాయి.
Also read: Industrial production: 18 నెలల కనిష్టానికి పారిశ్రామిక రంగం
స్వియాటెక్ ఖాతాలో ఎనిమిదో టైటిల్
మహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ ఈ ఏడాది తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ ఎనిమిదో టైటిల్‌ను సాధించింది. అమెరికాలో జరిగిన సాన్ డియాగో ఓపెన్ టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది. ఫైనల్లో స్వియాటెక్ (పోలాండ్) 6–3, 3–6, 6–0తో క్వాలిఫయర్ డొనా వెకిచ్ (క్రొయేషియా)పై గెలిచి 1,16,340 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 95 లక్షల 62 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు దక్కించుకుంది.
100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి జాతీయ రికార్డు
కైరో (ఈజిప్ట్): ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు లభించాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో ఇలవేనిల్, మెహులీ ఘోష్, మేఘన సజ్జనార్‌లతో కూడిన భారత జట్టు కాంస్యం సాధించింది. కాంస్య పతక మ్యాచ్‌లో భారత్ 17–11తో జర్మనీపై గెలిచింది. జూనియర్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో సమీర్ రజతం గెలిచాడు. ఫైనల్లో సమీర్ 23–25తో వాంగ్ షివెన్ (చైనా) చేతిలో ఓడిపోయాడు.
World Shooting Championship: భారత జట్టుకు కాంస్యం
కైరో (ఈజిప్ట్): ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు లభించాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో ఇలవేనిల్, మెహులీ ఘోష్, మేఘన సజ్జనార్‌లతో కూడిన భారత జట్టు కాంస్యం సాధించింది. కాంస్య పతక మ్యాచ్‌లో భారత్ 17–11తో జర్మనీపై గెలిచింది. జూనియర్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో సమీర్ రజతం గెలిచాడు. ఫైనల్లో సమీర్ 23–25తో వాంగ్ షివెన్ (చైనా) చేతిలో ఓడిపోయాడు.
Also read: ISSF World Championship 2022:18 ఏళ్లకే ప్రపంచ చాంపియన్ రుద్రాంక్ష్
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP