Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 17th కరెంట్ అఫైర్స్
Local Language: కోర్టుల్లో స్థానిక భాష... ఆలిండియా న్యాయ మంత్రుల సదస్సులో మోదీ
న్యాయమందే ప్రక్రియలో ఆలస్యం దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య అని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. సమర్థ దేశం, సామరస్యపూర్వక సమాజం నెలకొనాలంటే బాధితుల పట్ల సానుభూతితో స్పందించే న్యాయవ్యవస్థ చాలా అవసరమన్నారు. ‘‘కఠినమైన న్యాయ పరిభాష పౌరులకు అడ్డంకిగా నిలిచే పరిస్థితి మారాలి. కొత్త చట్టాలను స్థానిక భాషల్లో రాయాలి. కోర్టుల్లో స్థానిక భాషల వాడకం పెరగాలి. తద్వారా న్యాయప్రక్రియను మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది’’ అని చెప్పారు. గుజరాత్‌లోని కేవడియా సమీపంలో ఏక్తానగర్‌లో అక్టోబర్ 15న మొదలైన రెండు రోజుల అఖిల భారత న్యాయ మంత్రులు, కార్యదర్శుల సదస్సును ఉద్దేశించి మోదీ వీడియో సందేశమిచ్చారు. ఈ ఉద్దేశంతోనే బ్రిటిష్ కాలం నాటి 1,500కు పైగా కాలం చెల్లిన, పనికిరాని పాత చట్టాలను తమ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో బుట్టదాఖలు చేసిందన్నారు. ‘‘లోక్ అదాలత్‌ల వంటి ప్రత్యామ్నాయ న్యాయ ప్రక్రియలు కోర్టులపై భారాన్ని తగ్గించడంతో దోహదపడుతున్నాయి.
Also read: హైదరాబాద్‌కు World Green City Award 2022... ప్యారిస్, బొగోటాని వెనక్కి నెట్టి!!
ISSF World Shooting Championshipsలో ఇషా సింగ్ కు స్వర్ణ పతకం
కైరో (ఈజిప్ట్): ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్ ఇషా సింగ్ స్వర్ణ పతకం సాధించింది. అక్టోబర్ 15న జరిగిన జూనియర్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఇషా సింగ్ చాంపియన్ గా అవతరించింది. ఫైనల్లో ఇషా 29 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది.
- సిజువాన్ ఫెంగ్ (చైనా; 26 పాయింట్లు) రజతం, మిరియమ్ జాకో (హంగేరి; 18 పాయింట్లు) కాంస్యం గెలిచారు.
- పురుషుల జూనియర్ 25 మీటర్ల పిస్టల్, స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్స్‌లో భారత్‌కే చెందిన ఉదయ్‌వీర్ సిద్ధూ పసిడి పతకాలు సొంతం చేసుకున్నాడు.
- పిస్టల్ విభాగంలో ఉదయ్‌వీర్ 580 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్‌లో నిలిచాడు.
- మాస్ట్రోవలెరియో (ఇటలీ; 579 పాయింట్లు) రజతం, లియు యాంగ్‌పన్ (చైనా; 577 పాయింట్లు) కాంస్యం సాధించారు.
- స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్‌లో ఉదయ్‌వీర్ 568 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
- సమీర్ (భారత్; 567 పాయింట్లు) కాంస్యం గెలిచాడు.
Also read: Eviation Alice : ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్ విమానం ఎగిరిందిలా.. దీని ప్రత్యేకతలు ఇవే..
India International Challenge: రన్నరప్‌గా సిక్కి రెడ్డి, రుత్విక
బెంగళూరు: ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారిణులు గద్దె రుత్విక శివాని, సిక్కి రెడ్డి రజత పతకాలు సాధించారు. అక్టోబర్ 15న జరిగిన ఫైనల్స్‌లో రుతి్వక శివాని మహిళల సింగిల్స్‌లో... సిక్కి రెడ్డి మిక్స్‌డ్ డబుల్స్‌లో ఓడిపోయారు. సింగిల్స్ తుది పోరులో రుత్విక 19–21, 21–17, 17–21తో తాన్యా (భారత్) చేతిలో ఓటమి చవిచూడగా... మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ 16–21, 21–11, 18–21తో అశ్విని పొన్నప్ప–సాయిప్రతీక్ (భారత్) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో సౌరభ్ వర్మ 21–18, 17–21, 21–16తో మిథున్ మంజునాథ్‌ను ఓడించి విజేతగా నిలిచాడు.
Also read: ISSF World Championship 2022:18 ఏళ్లకే ప్రపంచ చాంపియన్ రుద్రాంక్ష్
ISSF: ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఐదో స్వర్ణం
కైరో (ఈజిప్ట్): ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల నిలకడైన ప్రదర్శన కొనసాగుతోంది. అక్టోబర్ 15న భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యం లభించాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, అర్జున్ బబూటా, అంకుశ్ కిరణ్ జాధవ్‌లతో కూడిన భారత జట్టు పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. చైనాతో జరిగిన ఫైనల్లో భారత బృందం 16–10 పాయింట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
Also read: World Championship Shooting: భారత్ ఖాతాలో కాంస్యం
Aimchess Rapid Online Tournament: అర్జున్ సంచలనం... ప్రపంచ చాంపియన్ కార్ల్‌సన్‌పై విజయం
చెన్నై: ఎయిమ్‌చెస్ ర్యాపిడ్ ఆన్‌లైన్ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ సంచలనం సృష్టించాడు. ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కార్ల్‌సన్ (నార్వే)తో జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో అర్జున్ 54 ఎత్తుల్లో గెలిచాడు. డూడా (పోలాండ్)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను అర్జున్ 45 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. 16 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఎనిమిదో రౌండ్ తర్వాత అర్జున్ 15 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.
ఈ టోర్నీ నిబంధనల ప్రకారం విజయం సాధిస్తే మూడు పాయింట్లతోపాటు 750 డాలర్లు (రూ. 61 వేలు), ‘డ్రా’ చేసుకుంటే ఒక పాయింట్‌తోపాటు 250 డాలర్లు (రూ. 20 వేలు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి.
Also read: ISSF World Championship 2022:18 ఏళ్లకే ప్రపంచ చాంపియన్ రుద్రాంక్ష్
Electric Double Deckers: భాగ్యనగరానికి 10 విద్యుత్ డబుల్ డెక్కర్‌లు
సాక్షి, హైదరాబాద్: ముంబై తరహాలో హైదరాబాద్ రోడ్లపైనా త్వరలోనే ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. నగరంలోని పలు రూట్లలో 10 విద్యుత్ డబుల్ డెక్కర్ బస్సులను తిప్పాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. అయితే ఒక్కో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఖరీదు రూ. 2.25 కోట్ల వరకు ఉండటం.. అంత ఖర్చును భరించే ఆర్థిక పరిస్థితి సంస్థకు లేకపోవడంతో అద్దె ప్రాతిపదికన వాటిని ఆర్టీసీ ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం 4–5 రోజుల్లో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. క్రాస్ కాస్ట్ విధానంలో ఈ బస్సులు నడిపేందుకు ఆసక్తి ఉన్న కంపెనీలు ముందుకు రావాలని టెండర్ నోటిఫికేషన్‌లో కోరనుంది. అద్దె పద్ధతిలో బస్సులు నిర్వహించే సంస్థతో టెండర్ దక్కించుకున్న సంస్థ ఒప్పందం కుదుర్చుకొని ఆర్టీసీకి బస్సులు సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రతి కిలోమీటర్ చొప్పున నిర్ధారిత అద్దెను ఆర్టీసీ ఆ సంస్థకు చెల్లించనుంది.
Also read: World Tourism Day : థీమ్ - రీ థింకింగ్ టూరిజం
హిందీలో MBBS పాఠ్యపుస్తకాలు విడుదల చేసిన అమిత్ షా
వైద్య విద్యను హిందీలో అందించే లక్ష్యంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎంబీబీఎస్ మూడు సబ్జెక్టుల హిందీ పాఠ్యపుస్తకాలను విడుదల చేశారు. ఎంబీబీఎస్ కోర్సును హిందీలో అందిస్తున్న మొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్ అని అన్నారు. ఇది స్వర్ణాక్షరాలతో లిఖింపబడుతుందని అభివర్ణించారు. అక్టోబర్ 15న భోపాల్ మంత్రి అమిత్ షా ఎంబీబీఎస్‌లోని మెడికల్ బయో కెమిస్ట్రీ, అనాటమీ, మెడికల్ ఫిజియాలజీ సబ్జెక్టుల హిందీ పాఠ్యపుస్తకాలను ఆవిష్కరించారు.
Also read: Weekly Current Affairs (Important Dates) Bitbank: ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
ఆక్సిజన్ ‘స్థాయి’లో మార్పును బట్టి గ్రహాలపై జీవం గుట్టు పట్టేయొచ్చు
లీడ్స్(యూకే): అనంతమైన విశ్వంలో మనమంతా ఒంటరి జీవులమా? లేక ఇతర గ్రహాలపైనా జీవం ఏదైనా ఉందా? మన సౌర కుటుంబానికి అవతల ఉన్న గ్రహాలపై వాతావరణం ఉనికి ఉండే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలు శతాబ్దాలుగా మానవులను వేధిస్తూనే ఉన్నాయి. వీటికి సమాధాలు కనిపెట్టేందుకు జిజ్ఞాసులు అలుపెరుగని కృషి సాగిస్తున్నారు. ఇతర గ్రహాలపై జీవం జాడ తెలుసుకొనేందుకు ఎన్నో పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతున్నాయి. రహస్యాన్ని ఛేదించే విషయంలో మనం కొంత పురోగతి సాధించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటిదాకా మనకు తెలిసింతవరకూ కేవలం మన భూగోళంపైనే జీవులు ఉన్నాయి. ఇవన్నీ ఆక్సిజన్‌ను శ్వాసిస్తున్నాయి. జీవుల మనుగడకు ప్రాణవాయువు(ఆక్సిజన్) అవసరమన్న సంగతి తెలిసిందే. భూమిపై ఆక్సిజన్ ఎల్లవేళలా ఒకేలా లేదని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌కు చెందిన బయోకెమికల్ మోడలింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ బెంజమిన్ జేడబ్ల్యూ మిల్స్ చెప్పారు. కోట్ల సంవత్సరాల నుంచి భూమిపై ఆక్సిజన్ పరిమాణం మారుతూ వచ్చిందని అన్నారు. ఈ మార్పు ఎప్పుడు, ఎలా జరిగిందో, ఆయా సమయాల్లో ఏయే జీవులు పుట్టాయో కచ్చితంగా తెలుసుకుంటే ఇతర గ్రహాలపై ఉన్న వాయువుల పరిమాణం గురించి, తద్వారా అక్కడి జీవజాలం గురించి ఒక అంచనాకు రావొచ్చని వివరించారు. మన గ్రహంపై ఉన్న ఆక్సిజన్ పరిమాణంపై తమ పరిశోధనలో కీలక విషయాలు బహిర్గతమయ్యాయని పేర్కొన్నారు.
Also read: Continents of the World: 7 ఖండాలు కాదు.. ఏక ఖండమే..!
భూమిపై ఆక్సిజన్, జీవం
భూగోళంపై వాతావరణంలో ప్రస్తుతం 21 శాతం ఆక్సిజన్ ఉంది. అయితే, ఇప్పుడున్నంత ఆక్సిజన్ కోట్ల సంవత్సరాల క్రితం లేదు. గతంలోకి.. అంటే 45 కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్తే.. అక్కడ జీవించడానికి ఆక్సిజన్ ట్యాంకర్లు కూడా వెంట తీసుకొని పోవాల్సిందే. ఎందకంటే అప్పట్లో స్వల్ప పరిమాణంలో ఆక్సిజన్ ఉండేది. జీవులు కూడా ఇంకా పుట్టలేదు. ప్రధానంగా మూడు దశల్లో ఆక్సిజన్ స్థాయిలు భూమిపై పెరిగాయి. మొదటిది ‘గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్’. దాదాపు 240 కోట్ల సంవత్సరాల క్రితం ఇది సంభవించింది. భూమిపై వాతావరణం ఏర్పడింది. ఆక్సిజన్ నిల్వలు ప్రారంభమయ్యాయి. రెండోది నియోప్రొటెరోజోయిక్ ఆక్సిజనేషన్ ఈవెంట్ (ఎన్‌ఓఈ). 80 కోట్ల సంవత్సరాల క్రితం సంభవించింది. భూమిపై ఆక్సిజన్ పరిమాణం పెరిగింది. దాదాపు ఇప్పుడున్న స్థాయికి ప్రాణవాయువు చేరుకుంది. ఆ తర్వాత 20 కోట్ల సంత్సరాలకు భూమిపై తొలితరం జంతువులు పుట్టాయి. మూడోది ‘పాలెజోయిక్ ఆక్సిజనేషన్ ఈవెంట్’.. 42 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడింది. ఆక్సిజన్ ఇప్పుడున్న స్థాయికి పూర్తిగా చేరింది. 75 కోట్ల ఏళ్ల క్రితం భూమి వాతావరణంలో కేవలం 12 శాతం ఆక్సిజన్ ఉండేది. ఇది ఇప్పుడు 21 శాతానికి ఎగబాకింది. ఆక్సిజన్ పరిమాణాన్ని బట్టి కొత్త జీవులు ఉద్భవించడం, పాతవి అంతరించిపోవడం వంటివి జరిగాయని పరిశోధకులు భావిస్తున్నారు. దాదాపు 45 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై మొక్కలు పుట్టాయి.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్‌ఏ), కెనడియన్ స్పేస్ ఏజెన్సీ(సీఎస్‌ఏ) భాగస్వామ్యంతో గత ఏడాది జేమ్స్‌వెబ్ స్పేస్ టెలిస్కోప్(జేడబ్ల్యూఎస్‌టీ)ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇది మన సౌర మండలం ఆవల ఉన్న గ్రహాలపై వాతావరణం, వాయువులపై అధ్యయనం చేస్తోంది. అక్కడి వాయువులు, వాటి పరిమాణం గురించి తెలిస్తే జీవం ఉందా? లేదా? అనేది తేల్చవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు.
Also read: Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 14th కరెంట్ అఫైర్స్
నవంబర్ 1న నాసా ‘Loftid’ ప్రయోగం
అంగారక గ్రహంపై(మార్స్) క్షేమంగా దిగడానికి వీలు కల్పించే ప్రయోగానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) శ్రీకారం చుడుతోంది. ఫ్లైయింగ్ సాసర్ వంటి భారీ హీట్ షీల్డ్‌ను వచ్చే నవంబర్ 1న అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. దీనికి లో–ఎర్త్ ఆర్బిట్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ యన్ ఇన్‌ఫ్లాటబుల్ డిసీలరేటర్(లోఫ్టిడ్)గా నామకరణం చేసింది. అట్లాస్ వి–రాకెట్ ద్వారా లో–ఎర్త్ ఆర్బిట్‌లోకి హీట్ షీల్డ్‌ను పంపించనుంది. భవిష్యత్తులో మార్స్‌పైకి పంపించే అంతరిక్షనౌక వేగాన్ని తగ్గించి, ఉపరితలంపై క్షేమంగా దించడానికి ఈ హీట్ షీల్డ్ తోడ్పడనుంది.
Also read: Planet Jupiter : భూమికి అతి సమీపానికి
Digital Transactions: వృద్ధి గతిని మార్చిన డిజిటల్ బ్యాంకింగ్
2014కు ముందున్న ఫోన్ బ్యాంకింగ్ స్థానంలో గత ఎనిమిది సంవత్సరాల్లో డిజిటల్ బ్యాంకింగ్ ప్రవేశపెట్టడం స్థిరమైన వృద్ధికి దోహదపడినట్టు చెప్పారు. యూపీఏ సర్కారు హయాంలో ఫోన్ బ్యాంకింగ్ ద్వారా ఎవరికి రుణాలు ఇవ్వాలి, నియమ నిబంధనలపై ఆదేశాలు ఫోన్ ద్వారా వెళ్లేవన్నారు. ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా.. దాని బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత బలంగా ఉంటే అంత పురోగమిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అక్టోబర్ 16న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను (డీబీయూలు) ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.
Also read: IIIT UNA: పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించిన మోదీ
Great Hall Of The People: చైనాలో తైవాన్ అంతర్భాగం.. బలప్రయోగానికీ వెనుకాడం
తైవాన్‌ను చైనాలో ఐక్యం చేసుకొనే విషయంలో బలప్రయోగానికి సైతం వెనుకాడబోమని డ్రాగన్ దేశాధిపతి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) ప్రధాన కార్యదర్శి షీ జిన్‌పింగ్ తేల్చిచెప్పారు. తైవాన్ ముమ్మాటికీ తమదేశంలో ఒక అంతర్గత భాగమేనని ఉద్ఘాటించారు. చైనా జాతీయ సార్వ భౌమత్వం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాల కోసం సైన్యాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరిస్తామని ప్రకటించారు. రాజధాని బీజింగ్‌లోని ‘ఆర్నేట్ గ్రేట్ హాల్ ఆఫ్ ద పీపుల్’లో ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా 20వ జాతీయ సదస్సులో జిన్‌పింగ్ ప్రసంగించారు. తైవాన్ విషయంలో తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టంచేశారు. తైవాన్‌లో వేర్పాటువాద ఉద్యమాలకు అడ్డుకట్ట వేయడానికి అన్ని రకాల చర్యలు చేపడతామని వెల్లడించారు. బలప్రయోగానికైనా వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు.
‘పూర్తిస్థాయి పునరేకీకరణ’ తప్పనిసరి
చైనా పునరేకీకరణను పూర్తి చేస్తామని షీ జిన్‌పింగ్ ప్రతినబూనారు. పునరేకీకరణ అంటే తైవాన్‌ను చైనా ప్రధాన భూభాగంలో(మెయిన్ ల్యాండ్) కలిపేయడమే. జిన్‌పింగ్ ప్రతిజ్ఞకు సదస్సులో చప్పట్లతో పెద్ద ఎత్తున ఆమోదం లభించింది. తైవాన్ అంశంలో కమ్యూనిస్ట్ పార్టీ దృఢసంకల్పంతో వ్యవహరించాలని జిన్‌పింగ్ సూచించారు. పునరేకీకరణ విషయంలో చిత్తశుద్ధిని ప్రదర్శించాలన్నారు. ‘‘తైవాన్ సమస్యను పరిష్కరించుకోవడం అనేది పూర్తిగా చైనాకు సంబంధించిన వ్యవహారం. ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిందే చైనానే’’ అని వ్యాఖ్యానించారు. పునరేకీకరణ విషయంలో శాంతియుత మార్గంలోనే ముందకెళ్తామని తెలిపారు. అదేసమయంలో బలప్రయోగానికి పాల్పడబోమన్న హామీని తాము ఇవ్వలేమన్నారు. ‘పూర్తిస్థాయి పునరేకీకరణ’ అనేది వాస్తవరూపం దాల్చడం తప్పనిసరి అని ఉద్ఘాటించారు. తైవాన్ సోదరుల సంక్షేమం కోసం తాము పనిచేస్తున్నామని చెప్పారు. వారిని ఎల్లప్పుడూ గౌరవిస్తూనే ఉన్నామన్నారు. చైనా–తైవాన్ మధ్య ఆర్థిక,
సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహిస్తామని వివరించారు. ఇరుగు పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలను కోరుకుంటున్నామని జిన్‌పింగ్ తెలియజేశారు. పీపుల్స్ లిబరేషన్ ఆరీ్మ(పీఎల్‌ఏ) 2027లో వందేళ్లను పూర్తిచేసుకోనుందని అన్నారు. సైన్యాన్ని ఆధునీకరించాలన్న లక్ష్యాన్ని మరో ఐదేళ్లలో సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆధునిక సోషలిస్ట్ దేశ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఆహారం, ఇంధనం, పరిశ్రమలు, సప్లై చైన్స్, విదేశాల్లోని చైనీయుల హక్కుల విషయంలో మరింత సామర్థ్యంతో పని చేయాల్సి ఉందన్నారు. బ్రిక్స్, షాంఘై సహకార సంఘం(ఎస్సీఓ) వంటి వాటిలో చురుకైన పాత్ర పోషిస్తామని జిన్‌పింగ్ వివరించారు. హాంకాంగ్‌పై స్పష్టమైన ఆధిపత్యం సాధించామని చెప్పారు.
అగ్రనేతలకు స్థానచలనం!
కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సదస్సు దాదాపు వారం రోజులపాటు జరుగనుంది. చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ను వరుసగా మూడోసారి ఎన్నుకోనున్నారు. జిన్‌పింగ్ మినహా పారీ్టలో అగ్రనేతలందరికీ ఈసారి స్థానచలనం తప్పదని తెలుస్తోంది. నంబర్–2గా పేరుగాంచిన లీ కెఖియాంగ్‌ను సైతం మార్చనున్నారు. ఆయన స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. తొలిరోజు సదస్సులో 2,300 మందికిపైగా ‘ఎన్నికైన ప్రతినిధుల’తోపాటు కమ్యూనిస్ట్ పార్టీ మాజీ అగ్రనేతలు హూ జింటావో, సాంగ్‌పింగ్ తదితరులు పాల్గొన్నారు. 2002 దాకా అధ్యక్షుడిగా పనిచేసిన 96 ఏళ్ల జియాంగ్ జెమిన్ హాజరు కాలేదు. జిన్‌పింగ్ దాదాపు 45 నిమిషాలపాటు మాట్లాడారు. కీలక అంశాలను ప్రస్తావించారు. ఆయన ప్రసంగం పట్ల ఆహూతులంతా హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.