Arunachal Pradesh: అరుణాచల్ భారత్‌లో అంతర్భాగం.. చైనా సరిహద్దును మెక్‌మహన్ రేఖగా గుర్తిస్తూ అమెరికా తీర్మానం
చైనా, అరుణాచల్ మధ్యనున్న మెక్‌మోహన్ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. సరిహద్దు వద్ద యథాతథ స్థితిని మార్చడానికి చైనా ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సెనేటర్లు బిల్ హగెట్రీ, జెఫ్ మెర్క్‌లీ సెనేట్‌లో తీర్మానం ప్రవేశపెట్టగా మరో సెనేటర్ జాన్ కార్నిన్ కూడా దాన్ని ప్రతిపాదించారు. ‘‘స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్‌కు చైనా నుంచి ముప్పు కొనసాగుతున్న తరుణంలో ఈ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలకు అండగా నిలవడం అమెరికా బాధ్యత. ప్రత్యేకించి భారత్‌కు మా మద్దతు ఉంటుంది’’ అని హగెట్రీ పేర్కొన్నారు.
వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద యథాతథ స్థితిని మార్చాలన్న చైనా కుటిల యత్నాలను ఖండిస్తున్నామని చెప్పారు. అమెరికా–భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత ముందుకెళ్లనుందని అన్నారు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్‌కు ‘క్వాడ్’ కూటమి మద్దతు ఉంటుందని వెల్లడించారు. సరిహద్దు వెంట వివాదాస్పద ప్రాంతాల్లో గ్రామాల నిర్మాణం, అరుణాచల్ భూభాగాలకు మాండరిన్ భాషలో మ్యాప్‌లను రూపొందించడాన్ని తీర్మానంలో ప్రస్తావించారు.