Skip to main content

Inspirational Story: అడవి బిడ్డల నేస్తం... ఫ్లారెన్స్‌ నైటింగేల్ అవార్డు అందుకున్న తెలంగాణ ఏఎన్ఎం

వృత్తే దైవంగా,సేవే పరమార్థంగా భావించిన తేజావత్‌ సుశీలకు ఈ యేడాది ప్రతిష్టాత్మక ‘ఫ్లారెన్స్‌ నైటింగేల్‌’ అవార్డు దక్కింది. తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం, ఎర్రగుంట ప్రాథమిక వైద్యశాలలో ఏఎన్‌ఎంగా సేవలందిస్తున్న సుశీల గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు.
అడవి బిడ్డల నేస్తం తేజావత్‌ సుశీల
అడవి బిడ్డల నేస్తం తేజావత్‌ సుశీల

ఈ సందర్భంగా 27 ఏళ్ల తన కెరీర్‌ గురించి సుశీల ‘సాక్షి’తో పంచుకున్నారు.

దేశవ్యాప్తంగా నర్సులు చేస్తున్న ఉత్తమ సేవలకుగాను జాతీయ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డులను ఏటా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్నారు. గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 2022, 2023 సంవత్సరాలకుగాను జాతీయ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందించారు. ఇందులో 2022కు ఏఎన్‌ఎమ్‌ కేటగిరీలో తెలంగాణకు చెందిన నర్సు తేజావత్‌ సుశీల రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు.

Inspirational Story : ప్రభుత్వ బడిలో చ‌దువు.. తండ్రి స్థానంలో ఎస్ఐగా బాధ్యతలు.. ఈ అరుదైన సంఘటన ఎక్క‌డంటే..

Tejavath Susheela

రహదారి సదుపాయం కూడా లేని మారుమూల ప్రాంతంలో ఉండే గుత్తికోయలకు అందించిన సేవలకు గుర్తుగా ఆమెకు ఈ అవార్డు ద‌క్కింది. 1973 నుంచి ఈ ఏడాది వరకు మొత్తం 614 మంది నర్సులు ఉత్తమ నర్సులకు నైటింగేల్‌ అవార్డులు అందుకున్నారని కేంద్రం తెలిపింది. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలలోని వీ వెంకటాయపాలెం అనే గ్రామం మా సొంతూరు. 1996లో ఏఎన్‌ఎంగా తొలి పోస్టింగ్‌ మణుగూరులో వచ్చింది. ఆ తర్వాత సుజాతనగర్‌లో కొన్నాళ్లు పని చేశాను. 2010 నుంచి ఏజెన్సీ ప్రాంతమైన ఎర్రగుంట పీహెచ్‌సీలో పని చేస్తున్నా. 27 ఏళ్ల కెరీర్‌లో పనిలోనే సంతృప్తి వెతుక్కుంటూ వస్తున్నా. 

Inspirational Person: 82 ఏళ్ల వ‌య‌సులో సైకిల్‌ మెకానిక్‌కు పద్మశ్రీ... ఎందుకు ఇచ్చారో మీకు తెలుసా..?

Tejavath Susheela

మా ఇల్లు, నాకు కేటాయించిన గ్రామాలు తప్ప పెద్దగా బయటకి పోయిందీ లేదు. హైదరాబాద్‌కు కూడా వెళ్లడం తక్కువే. చదువుకునేప్పటి నుంచి ఈ రోజు వరకు... ఏనాటికైనా ఢిల్లీని చూస్తానా అనుకునేదాన్ని. కానీ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌ వరకు నా ప్రయాణం ఉంటుందని అనుకోలేదు. దేశ ప్రథమ మహిళ చేతుల మీదుగా అవార్డు అందుకున్న క్షణాలు 
మరువలేనివి అంటూ భావోద్వేగానికి గురైంది సుశీల‌.

2010లో ఛత్తీస్‌గడ్‌ నుంచి గుత్తి కోయలు తెలంగాణకు రావడం ఎక్కువైంది.  మద్దుకూరు సమీపంలో గుత్తికోయలు వచ్చి మంగళబోడు పేరుతో ఓ గూడెం ఏర్పాటు చేసుకున్నారు. అక్క‌డికి వెళ్లినప్పుడు ఎవ్వరూ పలకరించలేదు. నేనే చొరవ తీసుకుని అన్ని ఇళ్లలోకి తలుపులు తీసుకుని వెళ్లాను. ఓ ఇంట్లో ఓ మహిళ అచేతనంగా పడుకుని ఉంది. 

15 ఏళ్ల‌కే తండ్రిని కోల్పోయి... సైకిల్ మెకానిక్‌గా జీవితాన్ని ప్రారంభించి... 23 ఏళ్ల‌కే ఐఏఎస్ సాధించిన వరుణ్ భరన్వాల్ స‌క్సెస్ స్టోరీ

పదిహేను రోజుల కిందటే ప్రసవం జరిగిందని అక్క‌డివారు చెప్పారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మనిషి నీరసించిపోయి ఉంది. ఒళ్లంతా ఉబ్బిపోయి ఉంది. వెంటనే అడవి నుంచి మద్దుకూరుకు.. అక్కడి నుంచి ఆటోలో కొత్తగూడెం ఆస్పత్రికి వచ్చాం. 

పరిస్థితి విషమించడంతో వరంగల్‌ తీసుకెళ్లాలని సూచించారు. 108లో ఆమెను వెంటబెట్టుకుని వరంగల్‌కు తీసుకెళ్లాను. 21 రోజుల పాటు చికిత్స అందించిన తర్వాత ఆ తల్లిబిడ్డలు ఇద్దరూ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఈ ఘటన తర్వాత గుత్తి కోయలకు నాపై నమ్మకం కలిగింది.  

Tejavath Susheela


ఓసారి గుత్తికోయగూడెం వెళ్లినప్పుడు పిల్లలందరూ నా దగ్గరకు వచ్చారు. కానీ, జెమిలీ అనే ఏడేళ్ల బాలిక రాలేదు. ఏమైందా అని ఆరా తీస్తూ ఆ పాప ఇంట్లోకి వెళ్లాను. నేలపై స్పృహ లేని స్థితిలో ఆ పాప పడుకుని ఉంది. బ్లడ్‌ శాంపిల్‌ తీసుకుని టెస్ట్‌ చేస్తే మలేరియా పాజిటివ్‌గా తేలింది. వెంటనే పీహెచ్‌సీకి అక్కడి నుంచి కొత్తగూడెం తీసుకువస్తే పాప పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని డాక్టర్లు చెప్పారు. 

ఖమ్మం తీసుకెళ్లమన్నారు. ఆక్కడకు వెళ్తే వరంగల్‌ పొమ్మన్నారు. కానీ, డాక్టర్లను బతిమాలి అక్కడే వైద్యం చేయమన్నాను. ఆ పాపది ఓ-నెగెటివ్‌ గ్రూప్‌ రక్తం కావడంతో చాలా మందికి ఫోన్లు చేసి బతిమాలి రెండు యూనిట్ల రక్తం సంపాదించగలిగా. చివరకు ఆ పాప ప్రాణాలు దక్కాయి. వలస ఆదివాసీల గుత్తికోయలతో కలిసిపోతేనే వారు మ‌న‌తో ఫ్రీగా ఉండ‌గ‌లుగుతారు.  

Inspiring Story: పూరి గుడిసెలో నివాసం.. నైట్ వాచ్‌మన్‌గా జాబ్‌.. సీన్ కట్ చేస్తే ఐఐఎంలో ప్రొఫెసర్.. రంజిత్ సక్సెస్ స్టోరీ

కోవిడ్‌ సమయంలో నా పరిధిలో ఉన్న గ్రామాల్లో ఏ ఒక్కరూ కోవిడ్‌తో ఇంట్లో చనిపోలేదు. వృత్తిలో మనం చూపించే నిబద్ధతను బట్టి మనకంటూ ఓ గుర్తింపు వస్తుంది. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకప్పుడు అర్థరాత్రి ఫోన్‌ చేసినా డాక్టర్లు లిఫ్ట్‌ చేసి అప్పటికప్పుడు సలహాలు ఇస్తారు. అవసరాన్ని బట్టి హాస్పిటల్‌కు వచ్చి కేస్‌ అటెండ్‌ చేస్తారు. అందరి సహకారం వల్లే నేను ఉత్తమ స్థాయిలో సేవలు అందించగలిగాను. ఈ రోజు నాకు దక్కిన గుర్తింపుకు డాక్టర్ల నుంచి ఆశావర్కర్ల వరకు అందరి సహకారం ఉంది అని వివరించారు సుశీల. ఇలాంటి మ‌రెన్నో స‌క్సెస్ స్టోరీస్, స్ఫూర్తిదాయ‌క‌మైన క‌థ‌నాల కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ను ఫాలో అవ్వండి.

Published date : 24 Jun 2023 03:38PM

Photo Stories