Parliament Budget Session 2022: లోక్‌సభలో 2021–2022 ఆర్థిక సర్వే
Parliament Budget Session 2022 Updates: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమయ్యాయి. తొలుత పార్లమెంట్ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. అనంతరం భారత ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని ప్రతిబింబించే కీలకమైన 2021–22 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జనవరి 31న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఆర్థిక సర్వే సమర్పణ అనంతరం లోక్‌సభను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. కేంద్ర ఆర్థికశాఖ ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించి ఆర్థిక సర్వే 2022 వివరాలను వెల్లడించనుంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు 8–8.5 శాతంగా ఉండొచ్చని ప్రభుత్వ అంచనా.
సింగిల్ వాల్యూమ్‌గా ఆర్థిక సర్వేను విడుదల..
సాధారణంగా ప్రతి ఏటా ఈ సర్వేను రెండు విభాగాలుగా ప్రవేశపెట్టేవారు. తొలి విభాగంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రముఖంగా ప్రస్తావిస్తారు. రెండో విభాగంలో మాత్రం గత ఏడాదికి సంబంధించిన దేశ ఆర్థిక పనితీరును సవివరంగా పొందుపర్చేవారు. అయితే ఈ ఏడాది అన్ని వివరాలను ఒకే దాంట్లో కలిపి సింగిల్ వాల్యూమ్‌గా ఆర్థిక సర్వేను విడుదల చేశారు. బడ్జెట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించే ఈ సర్వే దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.
ఆర్థిక సర్వే అంటే ఏంటి?
గత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, పనితీరు ఎలా ఉందో ఆర్థిక సర్వే వెల్లడిస్తుంది. భవిష్యత్ సవాళ్లు ఏంటివి? వీటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలు కూడా ఆర్థిక సర్వేలో ఉంటాయి. ఏటా బడ్జెట్‌కు ముందు ఈ సర్వేను విడుదల చేస్తారు.
ఆర్థిక సర్వేను ఎవరు రూపొందిస్తారు?
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్ (డీఈఏ)లోని ఎకనమిక్ డివిజన్ ప్రతి ఏడాది ఆర్థిక సర్వేను రూపొందిస్తుంది. ప్రధాన ఆర్థిక సలహాదారు(చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్- సీఈఏ) నేతృత్వంలోని బృందం ఆర్థిక సర్వేను రూపొందిస్తుంది. సర్వేను ఆర్థికమంత్రి పార్లమెంటులో ప్రవేశపెడతారు. తొలి ఆర్థిక సర్వేను 1950-51లో ఆవిష్కరించారు.