Automobile Industry: మొత్తం ఎన్ని రంగాలకు పీఎల్‌ఐ స్కీమ్ వర్తింపజేయనున్నారు?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సెప్టెంబర్ 15న సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా రానున్న ఐదేళ్లలో రూ. 26,058 కోట్ల మేర నిధులను కేటాయించనున్నారు. అధిక విలువతో కూడిన అడ్వాన్స్‌డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ వాహనాలు, ఉత్పత్తులకు ఈ పీఎల్‌ఐ స్కీమ్ ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తారు.
మొత్తం 13 రంగాలకు...
2021–22 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన మేరకు మొత్తం 13 రంగాలకు పీఎల్‌ఐ స్కీమ్ వర్తింపజేయాల్సి ఉంది. అందులో భాగంగానే తాజాగా కేంద్రం ఆటోమోటివ్, డ్రోన్ రంగాలకు ఈ స్కీమ్‌ను వర్తింపజేసింది. అత్యాధునిక ఆటోమోటివ్ టెక్నాలజీ ఉత్పత్తుల తయారీలో ఎదురవుతున్న పెట్టుబడి సమస్యలను ఈ పథకం పరిష్కరిస్తుంది. ఐదేళ్ల కాలంలో ఆటోమొబైల్, ఆటో కంపోనెంట్స్ పరిశ్రమలో సుమారు రూ. 42,500 కోట్ల పెట్టుబడులకు ఈ చర్య దోహదపడుతుందని కేంద్రం అంచనా.
డ్రోన్ పరిశ్రమలకు...
పీఎల్‌ఐ పథకంలో భాగంగా డ్రోన్స్, డ్రోన్స్‌కు అవసరమయ్యే విడిభాగాల పరిశ్రమకు దన్నునిచ్చేందుకు సైతం ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు మూడేళ్ల కాలానికిగాను రూ. 120 కోట్లు కేటాయించినట్లు పౌర విమానయాన శాఖ పేర్కొంది. డ్రోన్లు, డ్రోన్ల విడిభాగాల తయారీలో వేల్యూ ఎడిషన్‌కు గరిష్టంగా 20 శాతంవరకూ ప్రోత్సాహకాలు లభించగలవని తెలియజేసింది. మూడేళ్ల కాలంలో డ్రోన్ల పరిశ్రమలో రూ. 5,000 కోట్ల పెట్టుబడులకు దారి ఏర్పడుతుందని ప్రభుత్వం పేర్కొంది.
చదవండి: ఇటీవల ఏ పరిశ్రమను పీఎల్‌ఐ స్కీమ్ పరిధిలోకి తెచ్చారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆటోమొబైల్ పరిశ్రమ, డ్రోన్ పరిశ్రమలకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాన్ని(పీఎల్‌ఐఎస్) వర్తింపజేయాలని నిర్ణయం
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : ఆటోమొబైల్, డ్రోన్ పరిశ్రమల్లో ఉత్పత్తుల తయారీలో ఎదురవుతున్న పెట్టుబడి సమస్యలను పరిష్కరించేందుకు...